సాక్షి, అమరావతి: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినందువల్ల అధికార యంత్రాంగం కూడా ఇందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాల అమలు తీరును నిరంతరం సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. రాత్రి పూటఆయన అక్కడే బస చేయనున్నారు. వివిధ శాఖలపై విశాఖలోనే సమీక్షలు చేసే అవకాశం ఉంది.
అందువల్ల సీనియర్ అధికారులు, జిల్లా పరిపాలన అధికారులు సీఎంకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాల్సి వస్తుంది. కొంతమంది సీనియర్ అధికారులను రాత్రి పూట కూడా విశాఖలో బస చేయమని కోరవచ్చు. ఈ కారణంగా వీలైనంత త్వరగా తగిన వసతిని గుర్తించి నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్–హెఆర్‌ఎం) కార్యదర్శితో కమిటీని ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా తగిన వసతి గుర్తించి సాధారణ పరిపాలన శాఖకు నివేదికను సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి పూట తగిన రవాణా, వసతి ఉండేలా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో బస చేయడానికి తగ్గ ప్రాంతాలను గుర్తించాలని పేర్కొన్నారు.
అభివృద్ధికి అవసరం..
రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలను ఉత్తరాంధ్రగా పిలుస్తారు. ఈ ప్రాంతం ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, కనెక్టివిటి మొదలైన సూచికల్లో వెనుకబడి ఉంది. గిరిజన జనాభా అత్యధికంగా ఉంది. ఉత్తరాంధ్రలో నాలుగు జిల్లాలను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించింది. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు కింద కూడా ఉన్నాయి.
ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా నీతి ఆయోగ్ గుర్తించింది. ఉత్తరాంధ్ర చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేక అభివృద్ధి ప్రోత్సహకాలను పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించడం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం, సమీక్షించడంతో పాటు స్థానిక అవసరాలను తెలుసుకోవడం వంటివి అధికారయంత్రాంగం చేయాల్సి ఉంటుంది.
రాత్రి పూట బస చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రవాణా, వసతి చూసుకోవాల్సిందిగా ఆయా శాఖలు, శాఖాధిపతులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment