సాక్షి, న్యూఢిల్లీ : ‘సమాజంలో మంచితనం పరిఢవిల్లితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు’ అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ చెప్పారు. ఆయన మాట్లాడిందీ దళితులు, బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి. ‘చట్టాన్ని మార్చకుండానే రిజర్వేషన్లపై కొనసాగుతున్న సామాజిక సంఘర్షణను ఒక్క నిమిషంలో పరిష్కరించవచ్చు. వీటిని వ్యతిరేకిస్తున్నవారు, సమర్థిస్తున్న వారి మధ్య సామరస్య భావన ఏర్పడితే చాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అది ఇప్పట్లో సాధ్యమా ?
అది సాధ్యమయ్యే పని కాదని గత శనివారం తమిళనాడులోని వెల్లూరి జిల్లాలో ఓ దళితుడి అంత్యక్రియల విషయంలో జరిగిన పరాభవమే అందుకు కారణం. వెల్లూరు జిల్లాలోని వనియంబమ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని నట్రంపల్లి గ్రామంలో 55 ఏళ్ల కుప్పన్ అనే దళితుడు మరణించాడు. ఊరి శ్మశానంలో దళితుల అంత్యక్రియలకు అనుమతి లేదు. దాంతో వారు పాలర్ నది అవతలి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించడం అలవాటు. అవతల ఒడ్డుకు వెళ్లాలంటే ఓ అగ్రవర్ణ కులస్థుడి పొలం బాట గుండా వెళ్లాలి. దళితులకు ఆ స్థలం గుండా కూడా ప్రవేశం లేదు.
అందుకని దళితులు ఆగస్టు 17న పాలం నది వంతెనపైకి కుప్పన్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. 45 అడుగుల ఎత్తున ఉన్న ఆ వంతెన మధ్య నుంచి తాళ్ల సహాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. అక్కడి నుంచి నిర్దేశిత చోటుకు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడి దళిత కుటుంబాల్లో ఇంటి పెద్ద కుమారుడిని పూడ్చి పెట్టడం, మిగతా కుటుంబ సభ్యులను తగులబెట్టడం సంప్రదాయమట. అది వేరే విషయం. ఇలా వంతెన మీది నుంచి మృత దేహాన్ని దించడం, అక్కడి నుంచి అంత్యక్రియలకు తీసుకెళ్లడంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
దీంతో వెల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగమంతా ఒక్కసారిగా కదిలిపోయింది. తిరుపత్తూర్ సబ్ కలెక్టర్ ప్రియాంక మరుసటి రోజే హుటాహుటిన నట్రంపల్లి గ్రామాన్ని సందర్శించి ఊరవతల అర ఎకరం పోరంబోకు స్థలాన్ని దళితుల అంత్యక్రియల కోసం కేటాయించారు. సామాజిక న్యాయం చేశామనిపించుకున్నారు. హిందువులందరికి ఒకే శ్మశాన వాటిక ఉండాల్సిన చోట వేరు స్థలం కేటాయించడంతోపాటు అందుకు దారితీసిన పరిణామాలన్నీ సమాజంలోని వివక్షతను, వైషమ్యాలను స్పష్టం చేస్తున్నాయి.
కుల వివక్షత పోయే వరకు రిజర్వేషన్లు తప్పవనే విషయం విజ్ఞులందరికి తెల్సిందే. హిందువులంతా ఒక్కటే దళితులందరు తమ వెంటే ఉన్నారని గత ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ ప్రకటించుకుంది. అవును దళితుల మద్దతు లేకపోయినట్లయితే ఆ పార్టీకి లోక్‌సభలో అన్ని సీట్లు వచ్చి ఉండేవి కావు. అయినా కేంద్ర కేబినెట్‌లో అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు లభించాయి. కులాల పేరిట ఎక్కువనో, తక్కువనో మంత్రి పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలోనే ఇలా రిజర్వేషన్లు కొనసాగితే విద్యా, ఉపాధి అవకాశాల్లో వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగడం తప్పా!?
Comments
Please login to add a commentAdd a comment