వెర్రి తలకెక్కి.. శ్మశానంలో బర్త్‌డే పార్టీ.. చివరికి ట్విస్ట్‌ | Birthday Party At The Graveyard In Konaseema District | Sakshi
Sakshi News home page

వెర్రి తలకెక్కి.. శ్మశానంలో బర్త్‌డే పార్టీ.. చివరికి ట్విస్ట్‌

Published Sat, Aug 20 2022 4:19 PM | Last Updated on Sat, Aug 20 2022 5:27 PM

Birthday Party At The Graveyard In Konaseema District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమలాపురం రూరల్‌(కోనసీమ జిల్లా): ఆ ఐదుగురూ స్నేహితులు.. వారిలో ఒకరి పుట్టిన రోజు.. వెర్రి తలకెక్కిన వారు.. ఆ వేడుకలను వెరైటీగా వల్లకాటిలో ఏర్పాటు చేసుకున్నారు. పూటుగా తాగారు. కేక్‌ కట్‌ చేసి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. తన్నులాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నలుగురు మిత్రులు కలిసి మరొకరిని చాకుతో తీవ్రంగా గాయపరిచారు.
చదవండి: రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా?  

అమలాపురం రూరల్‌ మండలం కామనగరువులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘర్షణ వివరాలను పట్టణ సీఐ ఎస్‌సీహెచ్‌ కొండలరావు శుక్రవారం తెలిపారు. కామనగరువుకు చెందిన పందిరి శివశంకర్, బొంతు నవీన్, మరో ముగ్గురు స్నేహితులు. నవీన్‌ పుట్టిన రోజు వేడుకలను అమలాపురం నల్ల వంతెన సమీపంలోని శ్మశానంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసుకున్నారు. మద్యం తాగి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మొదలైన వాగ్వాదం.. తీవ్ర రూపు దాల్చింది.

శ్మశానంలోనే కొద్దిపాటి ఘర్షణకు దిగిన వారు.. తరువాత ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. శివశంకర్‌ కామనగరువులోని తన ఇంటికి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఇంతలో మిగిలిన నలుగురు స్నేహితులూ అతడి ఇంటికి వచ్చి, శివశంకర్‌ను బయటకు తీసుకు వెళ్లి దాడి చేశారు. అతడి శరీరంపై పలుచోట్ల చాకుతో పొడిచి, పరారయ్యారు. గాయపడిన శివశంకర్‌ కేకలు వేయడంతో అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బొంతు నవీన్‌తో పాటు మిగిలిన ముగ్గురు స్నేహితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ కొండలరావు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement