దెయ్యం 'మాయం' | Ghost does not seem to be anyone! | Sakshi
Sakshi News home page

దెయ్యం 'మాయం'

Published Mon, Sep 12 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

దెయ్యం 'మాయం'

దెయ్యం 'మాయం'

చేత''బడి
‘ఎవరికీ దెయ్యం కనిపించడం లేదు’ ఆ ఊరిలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. నిజమే ఆ ఊళ్లో  ఎవరికీ దెయ్యం కనిపించడం లేదిప్పుడు.  జ్వరాలతో మంచాలు పట్టిన వాళ్లకీ కనిపించడం లేదు.  బడికెళ్లే పిల్లలకూ కనిపించడం లేదు. తొలి జామున పొలానికెళ్లే రైతులనూ పలకరించడం లేదు.  మిట్టమధ్యాహ్నం భర్తలకు అన్నం తీసుకెళ్లే ఆడవాళ్లనూ భయపెట్టడం లేదు. అజ్ఞానం చీకట్లో కొరివి దెయ్యం  వీర విహారం చేసిందొకప్పుడు విజ్ఞానం వెలుగులో మాయమైపోయిందిప్పుడు.

 ‘‘మరి దెయ్యం ఎక్కడికెళ్లింది నాన్నా’’ తండ్రి భుజాన్ని గుంజుతూ అడుగుతోంది గాయత్రి.
 ‘‘దెయ్యం మంటల్లో కాలిపోయింది. ఇక ఎవరికీ కనిపించదు’’ కూతురికి నచ్చే రీతితో ఆమె సమాధానపడేటట్లు చెప్పాడు గోవిందయ్య.
 ‘‘అయినా లేని దెయ్యాన్ని ఉందని నమ్మించి ఎంత డబ్బు గుంజాడయ్యా ఆ మాయగాడు’’ బుగ్గలు నొక్కుకుంటూ వచ్చి ఎదురుగా కూర్చుంది కమలమ్మ. ‘‘నెల్లాళ్ల కిందట ఈ ఊరు ఊరులా ఉండిందా, ఇంటికో జబ్బు మంచంతో ఆసుపత్రి వార్డులా ఉండేది’’ అన్నదామె. ఆమె ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి.
    
‘‘రాజమ్మొదినా! మీ పిల్లాడుంటే నాలుగు వేపమండలు కోసిమ్మని చెప్పవే. నా కొడుకు ఒళ్లు కాగిపోతోంది. మూసిన కన్ను తెరవలేదు. నిన్న పొలం పోయినోడు రాత్రికి ఇంటికి రావడమే మంచం మీద వాలాడు. ఇంకా లేవలేదు. ఆ కొరివిదెయ్యం చూపు నా బిడ్డ మీద పడ్డట్టుంది దేవుడా’’ అంటూ వరండాలో కూర్చుంది నాగమ్మ.  రాజమ్మలో సానుభూతి, సహాయం చేయాలనే సహృదయత కంటే ఎక్కువగా భయం గూడుకట్టుకుంటోంది.  దెయ్యం పట్టిన ఇంటి వాళ్లను తన ఇంటికి రానిస్తే వాళ్లతోపాటు ఆ పీడ కూడా వస్తుందేమోననే భయం ఆమెది.
 ‘‘నువ్వింటికి పో వదినా, పిల్లాడిని ఒక్కణ్నీ వదిలి వస్తే ఎట్టా, మా పిల్లాడు బడి నుంచి వచ్చాక వేపాకు కోయిస్తాలే’’ అన్నది. నాగమ్మను త్వరగా పంపించేయాలని తొందరపడుతోంది రాజమ్మ.
 వారం రోజుల్లోనే ఊళ్లో ఆడమగ, చిన్నా పెద్దా అంతా కలిసి వందమంది దాకా మంచం పట్టారు. ఒక్కో ఇంట్లో ఒకరికి జ్వరం తగ్గితే ఇద్దరు మంచాన పడుతున్నారు. అందరిదీ ఒకటే జ్వరం... అది భయం జ్వరం. కొరివిదెయ్యం భయంతో వచ్చిన చలిజ్వరం.
    
అది పొరుగురిలోని భూతవైద్యుడి ఇల్లు. గ్రామ పెద్దల వంటి నలుగురు ఆయన ఎదురుగా ఉన్నారు.
 ‘‘రాత్రి దీపాలు పెట్టాక నట్టింట్లో కూర్చోబెట్టి జ్వరం వచ్చిన వాళ్ల కుడి చేతికి కట్టండి’’ జ్వరాలకు అంత్రాలు మంత్రించి ఇస్తూ చెప్పాడు భూతవైద్యుడు. వాటిని భక్తిగా చేతిలోకి తీసుకుని సంచిలో దాచుకున్నాడు ఊరిపెద్ద.
 ‘‘ఆ శ్మశానం దారిని వదిలేసి మరొక దారిలో నడవమని చెప్పండి’’ అని ముక్తాయించాడు భూతవైద్యుడు.
 వాళ్లు అయోమయంగా చూశారు. ‘‘ఊరంతా పొలం పనులు చేసుకునే వాళ్లమే.

శ్మశానం మీదుగా వెళ్లాల్సిందే. మరో దారి లేదు’’ అన్నాడు వారిలో ఒకతడు.  సాలోచనగా తల పంకించాడు భూతవైద్యుడు.  వ్యవసాయం మీద ఆధారపడిన ఆ ఊరికి - ఊరి పొలాలకి మధ్యలో శ్మశానం ఉందని అర్థమైందతడికి. ‘‘అలా ఉంటే ఊరికి అరిష్టం కాక మరేమవుతుంది’’ అని శక్తిమంతమైన బాణాన్ని వదిలాడు భూతవైద్యుడు. నలుగురూ ఒకరిముఖాలొకరు చూసుకున్నారు. ఒకతడు ఊరికి పట్టిన అరిష్టం వదిలే మార్గం చెప్పమంటూ అమాయకంగా చక్కటి అవకాశాన్ని భూతవైద్యుడి చేతిలో పెట్టాడు.
    
‘‘రాజమ్మా! నా కొడుకుని పట్టుకుంది ఆ అరవదెయ్యమేనంట! భూతవైద్యుడు ఎల్లుండి ఆదివారం నుంచి పదిహేన్రోజులు మనూళ్లోనే ఉండి ఇంటింట్లో పూజ చేస్తాట్ట. ఆయన చేత్తో పూజ చేయించుకుంటే దెయ్యం రాకుండా లక్ష్మణరేఖ గీసినట్లేనని చెప్పుకుంటున్నారే రాజమ్మా! నువ్వు కూడా చేయించుకో పిల్లలు గల దానివి’’ సమాచారంతోపాటు ఓ సలహా ఇచ్చేసి వెళ్లింది నాగమ్మ.
    
ఆదివారం మధ్యాహ్నం... నాగమ్మ ఇల్లు. భూతవైద్యుడు, అతడి ఎదురుగా నాగమ్మ కొడుకు. పక్కనే భూతవైద్యుడి అనుచరులిద్దరు.
 ‘‘నువ్వేం చూశావ్’’ ఆ గొంతులోని గంభీరానికి నోరు పెగల్లేదు నాగమ్మ కొడుక్కి.
 ‘‘రాత్రి ఎనిమిది గంటలప్పుడు పొలం నుంచి పిల్లాడొక్కడే వస్తూన్నాడు. వల్లకాట్లో కొరివి మండడం చూశాడు, ఊపిరి బిగపట్టుకుని వస్తుంటే వెనక ఎవరో వెంట వస్తున్నట్లు చప్పుడు విన్నాడు. దెయ్యమే వెంటపడింది.  చెమటలతో ఇంటికొచ్చిన వాడు పది రోజులైనా మంచం మీద నుంచి లేవలేదు’’ చేత్తో గుండెలను బాదుకుంటూ చెప్పింది నాగమ్మ.
 
నట్టింట్లో ముగ్గు వేసి క్షుద్రపూజలు, నల్లకోడిని కోసి రక్తం ధారపోయడం, కళ్లెర్ర చేసి వేపమండలు చరుస్తూ కర్ణకఠోరంగా మంత్రాలు వల్లించడం వంటివన్నీ పూర్తయ్యాయి. నాగమ్మకు ఐదు వేల ఖర్చు లెక్కకొచ్చింది.
 ‘‘పిల్లవాడిని బాగా భయపెట్టింది కొరివిదెయ్యం. ఎంత పెద్ద దెయ్యమైనా సరే... దాన్ని భయపెట్టే వైద్యుడు వచ్చే వరకే ఆ ఆటలన్నీ. ఇప్పుడు తోక ముడుచుకుని శ్మశానం దారి పట్టింది’’ అంటూ రక్తి కట్టించాడు ఓ అనుచరుడు. ఇదే తంతు దాదాపుగా ఇరవై ఇళ్లలో జరిగింది.
 మరి... కొరివి దెయ్యం ఇప్పుడు శ్మశానం దారి పట్టింది సరే. మళ్లీ పట్టదని నమ్మకమేంటి. రోజూ ఆ దారిన నడవాల్సిన వాళ్లమే కదా! సందేహం రావడం అది వేళ్లూనుకోవడం గంటల్లోనే జరిగిపోయింది.

దానికి విరుగుడుగా ఊరంతటికీ రక్షణ కల్పించడం లేదా దెయ్యాన్ని శ్మశానం దాటకుండా దిగ్బంధనం చేయడం... తరుణోపాయం చెప్పాడు ఇంకోఅనుచరుడు.
 దిగ్బందనం చేయించాలంటే ఎంత ఖర్చవుతుంది... పెద్దలు ఆలోచనలో పడ్డారు. ‘పంట కాలువ కోసం ఎకరాకి వెయ్యేసి రూపాయలు పోగు చేశాం కదా పెద్దయ్యా! ఆ డబ్బుతో కొరివి దెయ్యం రాకుండా దిగ్బందం చేయిద్దాం. పంట కాలువ వచ్చే ఏడు తవ్వుకోవచ్చు’’ తోచిన సలహా ఇచ్చాడొక మధ్యవయస్కుడు. అందరికీ అదే ఆమోదయోగ్యంగా కనిపిస్తోంది. భూతవైద్యుడికి ఆ ఊరు లాభసాటిగా కనిపిస్తోంది. ఇంతలో ఓ రోజు...
    
 ‘‘మనూర్లో దెయ్యం ఉందని పేపర్లో ఏశారంట’’ ఉద్వేగంతో చెప్తోంది రాజమణి. ఈ సమాచారం ఊరంతటినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాని ప్రభావం మరుసటి రోజు కనిపించింది.
 గ్రామం రచ్చబండ దగ్గర సమావేశం. ఊరిపెద్దలంతా ఉన్నారు. ఊరికి కొత్తవాళ్లు ఐదుగురు కూడా ఉన్నారు. ‘‘పెద్దయ్యా! ఈ పని చేస్తే అంతా మనమీదకే వస్తుందేమో! కొరివిదెయ్యాన్ని దిగ్బందం చేద్దామని ఊరంతా ఒక్కమాట మీద ఉంది. పంటకాలవ డబ్బు బయటకు తీయడానికి ఇష్టం లేకే నువ్వీపని సేత్తన్నావనుకుంటారంతా’’ చెవిలో గుసగుసలాడాడు ఒకాయన.
 
‘‘నాకూ అయోమయంగానే ఉందిరా వెంకటయ్యా! ఏది నిజమో తెలవడంలా. ఏం చేద్దామన్నది పాలుపోవడం లేదు. చూద్దాం! వీళ్లేం చెబుతారో’’ సర్ది చెప్పాడు పెద్దయ్య.
 ఊరికి వచ్చిన వాళ్లు జ్వరంతో మంచం పట్టిన ఒక్కొక్కరినీ పిలిచి మాట్లాడుతున్నారు. పదిమందికి పైగా వాళ్లు చూసింది చెప్పారు. ఒక్కో ప్రశ్న సంధిస్తే స్పష్టమైన సమాధానం మాత్రం రావడం లేదు. అందరి మాటల్లో కామన్‌గా ఉన్నది మాత్రం శ్మశానంలో మంట ఒక్కటే.
 అదెలా వస్తుందో చెప్పారు. ఊరంతా సమాధానపడే వరకు శాస్త్రీయంగా వివరించారు. అంతా విన్న తర్వాత ఒక కుర్రాడు లేచి ‘‘చెప్పడానికి మేమూ చెప్తాం. రాత్రి ఆ దారెంట మీరు నడిచి చూడండి, మీకు జ్వరం రాకపోతే మీరు చెప్పింది నమ్ముతాం’’ సవాల్ విసిరాడు.
    
‘‘ఆ హేతువాదులు ఎక్కడా వెనకగుడు వేయలేదు చూడయ్యా! మీ ఊళ్లో దెయ్యం ఉంటే మాకేంటి, మీ చావు మీరు చావండని వెళ్లిపోయుంటే ఈ రోజు ఇంకా కొరివి దెయ్యం పట్టకుండా ఉండడానికి అంత్రాలు కట్టించుకుంటూ, భూతవైద్యులకు వేలకు వేలు సమర్పించుకుంటూ ఉండేవాళ్లం’’ అన్నది కమలమ్మ. ఆమె మాటల్లో అజ్ఞానం చీకటి వదిలిన ధైర్యం. విజ్ఞానం వెలుగు దారి చూపిస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతున్నాయి.

అరవదెయ్యం పుకారు!
ఆ ఊరికి చెందిన ఒక కుటుంబం తమిళనాడుకి వలసవెళ్లింది. కొన్నేళ్ల తర్వాత సొంతూరికి తిరిగి వచ్చింది. వారిలో ఒకావిడ అనారోగ్యంతో మరణించింది. ఆమెను తమిళనాడులో దెయ్య పట్టుకుందని, ఆమె పోయాక కొరివి దెయ్యమై ఊళ్లో వాళ్లను భయపెడుతోందని పుకారు పుట్టింది. ఇది పూర్తిగా భయం నుంచి మొదలైన అపోహ మాత్రమే. ఆ కుటుంబం పట్ల ఎవరికీ కక్షలు, కార్పణ్యాలు లేవు.
 
భయమే దెయ్యం...
ఇది మూడేళ్ల కిందట ఖమ్మం జిల్లా మణుగూరు మండలం, పాతర్లపాడు గ్రామంలో జరిగింది. ఆ కుర్రాడు సవాల్ చేశాడు. కానీ ఊళ్లో అందరి ఉద్దేశం అదే. అతడిని ఎవరూ వారించే ప్రయత్నం చేయలేదు. మా వివరణతో పూర్తిగా కన్విన్స్ కాలేకపోతున్నారనిపించింది. శ్మశానానికి మేమూ వస్తాం అని సవాల్‌ను స్వీకరించాం. ఆ రాత్రి అక్కడే ఉండి శ్మశానానికి వెళ్లాం. మంటలు ఎందుకు వస్తున్నాయో వివరిస్తూ ప్రాక్టికల్‌గా చూపించాం.
 ఇక వాళ్లను ఎవరో వెంబడిస్తున్నారనే భ్రాంతికి కారణం వాళ్ల పాదాల చప్పుడే. రాత్రిళ్లు నిశ్శబ్ద వాతావరణంలో తమ చెప్పుల చప్పుడు కొద్ది క్షణాల తర్వాత ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. దెయ్యం వెంబడిస్తోందని భయపడతారు. వెనక్కి చూడడానికీ భయమేయమడంతో వెనుక ఏమీ లేదని తెలిసే అవకాశం ఉండదు.
- అలవాల నాగేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక, రాష్ట్ర కోశాధికారి
 
శ్మశానంలో మంటలు!
శవాన్ని దహనం చేసిన తర్వాత కూడా కొన్ని ఎముకలు మిగిలే ఉంటాయి. ఎముకల్లో క్యాల్షియంతోపాటు భాస్వరం కూడా ఉంటుంది. కాలి బూడిదవుతూ ఒక్కొక్క పొర గాలికి ఎగిరి పోతూ ఉంటుంది. లోపలి పొరల్లో భాస్వరం గాలిలోని ఆక్సిజెన్‌తో సమ్మేళనమై మండుతూ ఉంటుంది. పగలు కూడా ఇదే రసాయన చర్య జరుగుతుంటుంది. కానీ పగలు వెలుతురులో మంటలు దూరానికి కనిపించవు.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
గమనిక: వ్యక్తుల పేర్లు మార్చడమైంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement