Waka Manju Reddy
-
అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి
‘‘జీవితంలో ఏదీ అసాధ్యం కాదు. అన్నీ సుసాధ్యమే. నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధించవచ్చు. నీ కలను నిజం చేసుకోవడానికి నీవే శ్రమించాలి. లక్ష్యాన్ని చేరే వరకు నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. అప్పుడు విజయం నీదై తీరుతుంది. అనారోగ్యం నిన్ను చూసి పారిపోతుంది. ఇందుకు అసలైన నిర్వచనం ఈ సాహసి జీవితం. ‘‘సాహసం చేయకపోతే జీవితంలో అనేక అనుభవాలకు, ఆనందాలకూ దూరంగా ఉండిపోతాం. అందుకే సాహసించాల్సిందే’’ అంటున్న ఈ సాహసి పేరు సవితారెడ్డి. ఆమె ఫ్యాషన్ డిజైనర్, అడ్వెంచరస్ టూరిస్ట్. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటారు. మసాబ్ ట్యాంకు నుంచి రాజేంద్రనగర్, హెచ్‌సీయూ, నార్సింగి, రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా, ఖాజాగూడల్లో ఉదయం పూట జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్ల మీద సైక్లింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈమె గత ఏడాది రెండు కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు. ఫిట్నెస్ను తిరిగి సాధించుకోవడానికి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ కశ్మీర్‌లోని ‘గ్రేట్ లేక్స్ ఆఫ్ కశ్మీర్’ట్రెకింగ్ టూర్‌కి సిద్ధమవుతున్నారు. మహిళకు సెలవేది? ఒక సామాన్యమైన కుటుంబం లో మహిళ జీవితం ఎలా ఉంటుంది? పిల్లల స్కూళ్లకు, కాలేజ్‌లకు సెలవులుంటాయి. భర్త ఆఫీస్‌కి సెలవులుంటాయి. తనకు మాత్రం సెలవు ఉండదు. తనకంటూ ఒక ఆటవిడుపు ఉండాలని కోరుకున్నా సరే సాధ్యపడదు. ఆ మహిళ గృహిణి అయినా ఉద్యోగి అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే... ఈ కుటుంబచిత్రమ్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. మహిళలు ఆ రొటీన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా రెక్కలు తగిలించుకోవాలంటారు సవిత. ఈ విషయంలో హైదరాబాద్ మహిళ ఓ అడుగు ముందుకేసిందని కూడా అన్నారామె. మహిళ తన సంతోషం కోసం ఇంకా ఇంకా గొంతు విప్పాలనేదే నా కోరిక. అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను. మరింత మందిని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు సవిత. దేశమంతా పెరిగాను! సవిత తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడంతో ఆమె బాల్యం దేశంలోని అనేక ప్రదేశాల్లో సాగింది. దాదాపుగా ముప్పై ఏళ్ల కిందట ఫ్యాషన్ డిజైనింగ్ ఒక కోర్సు రూపంలో యూనివర్సిటీ కరిక్యులమ్‌లో చేరిన తొలి రోజుల్లో, ఏ మాత్రం ఉపాధికి భరోసా కల్పించలేని ఆ కోర్సులో చేరాలనుకోవడమే పెద్ద సాహసం. అలాంటి రోజుల్లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారామె. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సొంతంగా తన పేరుతోనే ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ ప్రారంభించారు. ‘‘పాతికేళ్ల పాటు చాలా సీరియెస్‌గా ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం పని చేశాను. నా యూనిట్ చూసుకుంటూ మధ్యలో కార్ ర్యాలీలు, ట్రెక్కింగులతో జీవితాన్ని సంతోషంగా గడిపాననే చెప్పాలి. 2017లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించాను. అయితే అన్ని రోజులూ ఒకేరకంగా ఉండవు కదా! ఆ తర్వాతి ఏడాది కాళ్లు నాకు పరీక్ష పెట్టాయి. మాల్ అలైన్మెంట్ సమస్యతో బౌడ్ లెగ్స్గా మారిపోయాయి. ట్రెకింగ్ కాదు కదా మామూలుగా నడవడం కూడా కష్టమైంది. ఆ క్షణంలో నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధమయ్యాను. హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ చేయించుకున్నాను. మోకాళ్ల నుంచి మడమల మధ్య ఉండే ఎముకను వంపు తీసి సరిచేసి ప్లేట్ అమర్చి స్క్రూలతో బిగిస్తారన్నమాట. గత ఏడాది ఆగస్టులో ఒక కాలికి, నవంబరులో మరో కాలికి సర్జరీ అయింది. కొంతకాలం వీల్ చెయిర్‌కి పరిమితమయ్యాను. తర్వాత వాకర్‌తో రోజులు గడిచాయి. ఇక ఇప్పుడు నా ఫిట్‌నెస్‌ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకే ఈ సైక్లింగ్. వారంలో మూడు రోజులు సైక్లింగ్ రోజుకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు, మరో మూడు రోజులు గంటపాటు వాకింగ్... ఇదీ ఇప్పుడు నా రొటీన్. ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కశ్మీర్లో ట్రెకింగ్‌కి సిద్ధమవుతున్నాను’’ అని చెప్పారు సవిత. ఇంత సాహసం అవసరమా? ‘‘నలభై ఎనిమిదేళ్ల వయసులో ఆ సర్జరీ అవసరమా, మందులతో రోజులు వెళ్లదీయవచ్చు కదా’ అని అడిగే వాళ్లకు నేను చెప్పే సమాధానం ‘అవసరమే’ అని. ఏ వయసులోనైనా మనిషి జీవితం తన చేతుల్లోనే ఉండాలి. అనారోగ్యం కారణంగా మరొకరి మీద ఆధారపడే పరిస్థితిలోకి జారిపోకూడదు. పైగా నలభై ఎనిమిది అంటే... అభిరుచులను కట్టిపెట్టి జీవితాన్ని నిస్సారంగా గడిపే వయసు కాదు. నాకు ఇష్టమైన కార్ ర్యాలీ, ట్రెకింగ్ వంటివేవీ చేయలేనప్పుడు, భారంగా అడుగులేసుకుంటూ రోజులు గడిపే జీవితం నాకు అవసరమా... అనేది నా ప్రశ్న. అందుకే ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఫిఫ్టీ– ఫిఫ్టీ అని తెలిసినప్పటికీ నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడ్డాను. మనం అనుకున్నట్లు జీవించడానికి అనారోగ్యాన్ని అధిగమించడానికి మొదట మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా, ఫిట్‌గా ఉన్నాను. నా డిజైనింగ్ స్టూడియోని నడుపుకుంటున్నాను. నా ట్రెకింగ్ ఇంటరెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోగలను కూడా’’ అని ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వుతో చెప్పారు సవిత. – వాకా మంజులారెడ్డి -
దెయ్యం 'మాయం'
చేత'న'బడి ‘ఎవరికీ దెయ్యం కనిపించడం లేదు’ ఆ ఊరిలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. నిజమే ఆ ఊళ్లో ఎవరికీ దెయ్యం కనిపించడం లేదిప్పుడు. జ్వరాలతో మంచాలు పట్టిన వాళ్లకీ కనిపించడం లేదు. బడికెళ్లే పిల్లలకూ కనిపించడం లేదు. తొలి జామున పొలానికెళ్లే రైతులనూ పలకరించడం లేదు. మిట్టమధ్యాహ్నం భర్తలకు అన్నం తీసుకెళ్లే ఆడవాళ్లనూ భయపెట్టడం లేదు. అజ్ఞానం చీకట్లో కొరివి దెయ్యం వీర విహారం చేసిందొకప్పుడు విజ్ఞానం వెలుగులో మాయమైపోయిందిప్పుడు. ‘‘మరి దెయ్యం ఎక్కడికెళ్లింది నాన్నా’’ తండ్రి భుజాన్ని గుంజుతూ అడుగుతోంది గాయత్రి. ‘‘దెయ్యం మంటల్లో కాలిపోయింది. ఇక ఎవరికీ కనిపించదు’’ కూతురికి నచ్చే రీతితో ఆమె సమాధానపడేటట్లు చెప్పాడు గోవిందయ్య. ‘‘అయినా లేని దెయ్యాన్ని ఉందని నమ్మించి ఎంత డబ్బు గుంజాడయ్యా ఆ మాయగాడు’’ బుగ్గలు నొక్కుకుంటూ వచ్చి ఎదురుగా కూర్చుంది కమలమ్మ. ‘‘నెల్లాళ్ల కిందట ఈ ఊరు ఊరులా ఉండిందా, ఇంటికో జబ్బు మంచంతో ఆసుపత్రి వార్డులా ఉండేది’’ అన్నదామె. ఆమె ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. ‘‘రాజమ్మొదినా! మీ పిల్లాడుంటే నాలుగు వేపమండలు కోసిమ్మని చెప్పవే. నా కొడుకు ఒళ్లు కాగిపోతోంది. మూసిన కన్ను తెరవలేదు. నిన్న పొలం పోయినోడు రాత్రికి ఇంటికి రావడమే మంచం మీద వాలాడు. ఇంకా లేవలేదు. ఆ కొరివిదెయ్యం చూపు నా బిడ్డ మీద పడ్డట్టుంది దేవుడా’’ అంటూ వరండాలో కూర్చుంది నాగమ్మ. రాజమ్మలో సానుభూతి, సహాయం చేయాలనే సహృదయత కంటే ఎక్కువగా భయం గూడుకట్టుకుంటోంది. దెయ్యం పట్టిన ఇంటి వాళ్లను తన ఇంటికి రానిస్తే వాళ్లతోపాటు ఆ పీడ కూడా వస్తుందేమోననే భయం ఆమెది. ‘‘నువ్వింటికి పో వదినా, పిల్లాడిని ఒక్కణ్నీ వదిలి వస్తే ఎట్టా, మా పిల్లాడు బడి నుంచి వచ్చాక వేపాకు కోయిస్తాలే’’ అన్నది. నాగమ్మను త్వరగా పంపించేయాలని తొందరపడుతోంది రాజమ్మ. వారం రోజుల్లోనే ఊళ్లో ఆడమగ, చిన్నా పెద్దా అంతా కలిసి వందమంది దాకా మంచం పట్టారు. ఒక్కో ఇంట్లో ఒకరికి జ్వరం తగ్గితే ఇద్దరు మంచాన పడుతున్నారు. అందరిదీ ఒకటే జ్వరం... అది భయం జ్వరం. కొరివిదెయ్యం భయంతో వచ్చిన చలిజ్వరం. అది పొరుగురిలోని భూతవైద్యుడి ఇల్లు. గ్రామ పెద్దల వంటి నలుగురు ఆయన ఎదురుగా ఉన్నారు. ‘‘రాత్రి దీపాలు పెట్టాక నట్టింట్లో కూర్చోబెట్టి జ్వరం వచ్చిన వాళ్ల కుడి చేతికి కట్టండి’’ జ్వరాలకు అంత్రాలు మంత్రించి ఇస్తూ చెప్పాడు భూతవైద్యుడు. వాటిని భక్తిగా చేతిలోకి తీసుకుని సంచిలో దాచుకున్నాడు ఊరిపెద్ద. ‘‘ఆ శ్మశానం దారిని వదిలేసి మరొక దారిలో నడవమని చెప్పండి’’ అని ముక్తాయించాడు భూతవైద్యుడు. వాళ్లు అయోమయంగా చూశారు. ‘‘ఊరంతా పొలం పనులు చేసుకునే వాళ్లమే. శ్మశానం మీదుగా వెళ్లాల్సిందే. మరో దారి లేదు’’ అన్నాడు వారిలో ఒకతడు. సాలోచనగా తల పంకించాడు భూతవైద్యుడు. వ్యవసాయం మీద ఆధారపడిన ఆ ఊరికి - ఊరి పొలాలకి మధ్యలో శ్మశానం ఉందని అర్థమైందతడికి. ‘‘అలా ఉంటే ఊరికి అరిష్టం కాక మరేమవుతుంది’’ అని శక్తిమంతమైన బాణాన్ని వదిలాడు భూతవైద్యుడు. నలుగురూ ఒకరిముఖాలొకరు చూసుకున్నారు. ఒకతడు ఊరికి పట్టిన అరిష్టం వదిలే మార్గం చెప్పమంటూ అమాయకంగా చక్కటి అవకాశాన్ని భూతవైద్యుడి చేతిలో పెట్టాడు. ‘‘రాజమ్మా! నా కొడుకుని పట్టుకుంది ఆ అరవదెయ్యమేనంట! భూతవైద్యుడు ఎల్లుండి ఆదివారం నుంచి పదిహేన్రోజులు మనూళ్లోనే ఉండి ఇంటింట్లో పూజ చేస్తాట్ట. ఆయన చేత్తో పూజ చేయించుకుంటే దెయ్యం రాకుండా లక్ష్మణరేఖ గీసినట్లేనని చెప్పుకుంటున్నారే రాజమ్మా! నువ్వు కూడా చేయించుకో పిల్లలు గల దానివి’’ సమాచారంతోపాటు ఓ సలహా ఇచ్చేసి వెళ్లింది నాగమ్మ. ఆదివారం మధ్యాహ్నం... నాగమ్మ ఇల్లు. భూతవైద్యుడు, అతడి ఎదురుగా నాగమ్మ కొడుకు. పక్కనే భూతవైద్యుడి అనుచరులిద్దరు. ‘‘నువ్వేం చూశావ్’’ ఆ గొంతులోని గంభీరానికి నోరు పెగల్లేదు నాగమ్మ కొడుక్కి. ‘‘రాత్రి ఎనిమిది గంటలప్పుడు పొలం నుంచి పిల్లాడొక్కడే వస్తూన్నాడు. వల్లకాట్లో కొరివి మండడం చూశాడు, ఊపిరి బిగపట్టుకుని వస్తుంటే వెనక ఎవరో వెంట వస్తున్నట్లు చప్పుడు విన్నాడు. దెయ్యమే వెంటపడింది. చెమటలతో ఇంటికొచ్చిన వాడు పది రోజులైనా మంచం మీద నుంచి లేవలేదు’’ చేత్తో గుండెలను బాదుకుంటూ చెప్పింది నాగమ్మ. నట్టింట్లో ముగ్గు వేసి క్షుద్రపూజలు, నల్లకోడిని కోసి రక్తం ధారపోయడం, కళ్లెర్ర చేసి వేపమండలు చరుస్తూ కర్ణకఠోరంగా మంత్రాలు వల్లించడం వంటివన్నీ పూర్తయ్యాయి. నాగమ్మకు ఐదు వేల ఖర్చు లెక్కకొచ్చింది. ‘‘పిల్లవాడిని బాగా భయపెట్టింది కొరివిదెయ్యం. ఎంత పెద్ద దెయ్యమైనా సరే... దాన్ని భయపెట్టే వైద్యుడు వచ్చే వరకే ఆ ఆటలన్నీ. ఇప్పుడు తోక ముడుచుకుని శ్మశానం దారి పట్టింది’’ అంటూ రక్తి కట్టించాడు ఓ అనుచరుడు. ఇదే తంతు దాదాపుగా ఇరవై ఇళ్లలో జరిగింది. మరి... కొరివి దెయ్యం ఇప్పుడు శ్మశానం దారి పట్టింది సరే. మళ్లీ పట్టదని నమ్మకమేంటి. రోజూ ఆ దారిన నడవాల్సిన వాళ్లమే కదా! సందేహం రావడం అది వేళ్లూనుకోవడం గంటల్లోనే జరిగిపోయింది. దానికి విరుగుడుగా ఊరంతటికీ రక్షణ కల్పించడం లేదా దెయ్యాన్ని శ్మశానం దాటకుండా దిగ్బంధనం చేయడం... తరుణోపాయం చెప్పాడు ఇంకోఅనుచరుడు. దిగ్బందనం చేయించాలంటే ఎంత ఖర్చవుతుంది... పెద్దలు ఆలోచనలో పడ్డారు. ‘పంట కాలువ కోసం ఎకరాకి వెయ్యేసి రూపాయలు పోగు చేశాం కదా పెద్దయ్యా! ఆ డబ్బుతో కొరివి దెయ్యం రాకుండా దిగ్బందం చేయిద్దాం. పంట కాలువ వచ్చే ఏడు తవ్వుకోవచ్చు’’ తోచిన సలహా ఇచ్చాడొక మధ్యవయస్కుడు. అందరికీ అదే ఆమోదయోగ్యంగా కనిపిస్తోంది. భూతవైద్యుడికి ఆ ఊరు లాభసాటిగా కనిపిస్తోంది. ఇంతలో ఓ రోజు... ‘‘మనూర్లో దెయ్యం ఉందని పేపర్లో ఏశారంట’’ ఉద్వేగంతో చెప్తోంది రాజమణి. ఈ సమాచారం ఊరంతటినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాని ప్రభావం మరుసటి రోజు కనిపించింది. గ్రామం రచ్చబండ దగ్గర సమావేశం. ఊరిపెద్దలంతా ఉన్నారు. ఊరికి కొత్తవాళ్లు ఐదుగురు కూడా ఉన్నారు. ‘‘పెద్దయ్యా! ఈ పని చేస్తే అంతా మనమీదకే వస్తుందేమో! కొరివిదెయ్యాన్ని దిగ్బందం చేద్దామని ఊరంతా ఒక్కమాట మీద ఉంది. పంటకాలవ డబ్బు బయటకు తీయడానికి ఇష్టం లేకే నువ్వీపని సేత్తన్నావనుకుంటారంతా’’ చెవిలో గుసగుసలాడాడు ఒకాయన. ‘‘నాకూ అయోమయంగానే ఉందిరా వెంకటయ్యా! ఏది నిజమో తెలవడంలా. ఏం చేద్దామన్నది పాలుపోవడం లేదు. చూద్దాం! వీళ్లేం చెబుతారో’’ సర్ది చెప్పాడు పెద్దయ్య. ఊరికి వచ్చిన వాళ్లు జ్వరంతో మంచం పట్టిన ఒక్కొక్కరినీ పిలిచి మాట్లాడుతున్నారు. పదిమందికి పైగా వాళ్లు చూసింది చెప్పారు. ఒక్కో ప్రశ్న సంధిస్తే స్పష్టమైన సమాధానం మాత్రం రావడం లేదు. అందరి మాటల్లో కామన్‌గా ఉన్నది మాత్రం శ్మశానంలో మంట ఒక్కటే. అదెలా వస్తుందో చెప్పారు. ఊరంతా సమాధానపడే వరకు శాస్త్రీయంగా వివరించారు. అంతా విన్న తర్వాత ఒక కుర్రాడు లేచి ‘‘చెప్పడానికి మేమూ చెప్తాం. రాత్రి ఆ దారెంట మీరు నడిచి చూడండి, మీకు జ్వరం రాకపోతే మీరు చెప్పింది నమ్ముతాం’’ సవాల్ విసిరాడు. ‘‘ఆ హేతువాదులు ఎక్కడా వెనకగుడు వేయలేదు చూడయ్యా! మీ ఊళ్లో దెయ్యం ఉంటే మాకేంటి, మీ చావు మీరు చావండని వెళ్లిపోయుంటే ఈ రోజు ఇంకా కొరివి దెయ్యం పట్టకుండా ఉండడానికి అంత్రాలు కట్టించుకుంటూ, భూతవైద్యులకు వేలకు వేలు సమర్పించుకుంటూ ఉండేవాళ్లం’’ అన్నది కమలమ్మ. ఆమె మాటల్లో అజ్ఞానం చీకటి వదిలిన ధైర్యం. విజ్ఞానం వెలుగు దారి చూపిస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతున్నాయి. అరవదెయ్యం పుకారు! ఆ ఊరికి చెందిన ఒక కుటుంబం తమిళనాడుకి వలసవెళ్లింది. కొన్నేళ్ల తర్వాత సొంతూరికి తిరిగి వచ్చింది. వారిలో ఒకావిడ అనారోగ్యంతో మరణించింది. ఆమెను తమిళనాడులో దెయ్య పట్టుకుందని, ఆమె పోయాక కొరివి దెయ్యమై ఊళ్లో వాళ్లను భయపెడుతోందని పుకారు పుట్టింది. ఇది పూర్తిగా భయం నుంచి మొదలైన అపోహ మాత్రమే. ఆ కుటుంబం పట్ల ఎవరికీ కక్షలు, కార్పణ్యాలు లేవు. భయమే దెయ్యం... ఇది మూడేళ్ల కిందట ఖమ్మం జిల్లా మణుగూరు మండలం, పాతర్లపాడు గ్రామంలో జరిగింది. ఆ కుర్రాడు సవాల్ చేశాడు. కానీ ఊళ్లో అందరి ఉద్దేశం అదే. అతడిని ఎవరూ వారించే ప్రయత్నం చేయలేదు. మా వివరణతో పూర్తిగా కన్విన్స్ కాలేకపోతున్నారనిపించింది. శ్మశానానికి మేమూ వస్తాం అని సవాల్‌ను స్వీకరించాం. ఆ రాత్రి అక్కడే ఉండి శ్మశానానికి వెళ్లాం. మంటలు ఎందుకు వస్తున్నాయో వివరిస్తూ ప్రాక్టికల్‌గా చూపించాం. ఇక వాళ్లను ఎవరో వెంబడిస్తున్నారనే భ్రాంతికి కారణం వాళ్ల పాదాల చప్పుడే. రాత్రిళ్లు నిశ్శబ్ద వాతావరణంలో తమ చెప్పుల చప్పుడు కొద్ది క్షణాల తర్వాత ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. దెయ్యం వెంబడిస్తోందని భయపడతారు. వెనక్కి చూడడానికీ భయమేయమడంతో వెనుక ఏమీ లేదని తెలిసే అవకాశం ఉండదు. - అలవాల నాగేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక, రాష్ట్ర కోశాధికారి శ్మశానంలో మంటలు! శవాన్ని దహనం చేసిన తర్వాత కూడా కొన్ని ఎముకలు మిగిలే ఉంటాయి. ఎముకల్లో క్యాల్షియంతోపాటు భాస్వరం కూడా ఉంటుంది. కాలి బూడిదవుతూ ఒక్కొక్క పొర గాలికి ఎగిరి పోతూ ఉంటుంది. లోపలి పొరల్లో భాస్వరం గాలిలోని ఆక్సిజెన్‌తో సమ్మేళనమై మండుతూ ఉంటుంది. పగలు కూడా ఇదే రసాయన చర్య జరుగుతుంటుంది. కానీ పగలు వెలుతురులో మంటలు దూరానికి కనిపించవు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి గమనిక: వ్యక్తుల పేర్లు మార్చడమైంది -
మంత్రగాళ్లకు మంత్రగాడు
రాత్రి దుప్పటికప్పుకుని పడుకుంటే పొద్దున లేచేటప్పటికల్లా ఒళ్లంతా గాయాలు! చీమకుట్టినట్టయినా తెలీలేదు... కానీ అన్నీ గాట్లే... ‘నొప్పి లేదు... మంటా లేదు... ఇదేం దెయ్యంరా బాబూ...’ అని ఊరంతా మొత్తుకుంది. ఆ ఊరికున్న ఆస్థాన మంత్రగాళ్లు... మంత్రం మేమేస్తామంటే మేమేస్తామని... ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి దోచుకున్నారు. మరి కేసు ఎలా సాల్వ్ అవ్వాలి? మొనగాళ్లకు మొనగాళ్లలాగా... మంత్రగాళ్లకు మంత్రగాడిలా ప్రేమానంద్ వచ్చాడు! మిగతా కథకు మీరే సాక్షి!! అది ఇరవై ఏళ్ల నాటి ఉరవకొండ. ఓ రోజు తెల్లవారి నిద్రలేస్తూనే ఒళ్లంతా నొప్పులుగా అనిపించి ఒళ్లు విరుచుకుంటున్నాడు కిష్టప్ప. పక్క దుప్పటి మడతపెడుతున్న కొడుకును చూస్తూనే సరోజమ్మ కళ్లలో ఆందోళన. ‘ఏందప్పా... సావాసగాళ్లతో కొట్లాడితివా ఏంటీ... ఒల్లంతా దెబ్బలు తగిలించుకున్నావు. ఎవరు కొట్టారప్పా’ అన్నది గాబరాగా. అప్పుడే చూసుకున్నాడు కిష్టప్ప కూడా. నిజమే... ఒంటి మీద గాయాల ఆనవాళ్లున్నాయి. నొప్పి పెడుతున్నాయి కూడా. ‘ఏయప్ప నిన్ను కొట్టింది చెప్పు’ అంటూ గద్దిస్తోంది సరోజమ్మ. ‘నన్నెవరూ కొట్టలే... ఈ దెబ్బలెట్టా వచ్చాయో తెల్వదు’ అంటూ తెల్లముఖం వేశాడు కిష్టప్ప. కొడుకు ఏదో దాస్తున్నాడనుకుంది సరోజమ్మ. మరి రెట్టించడం ఇష్టం లేక... ‘ముఖం కడుక్కుని రా, దెబ్బలకు వెన్నపూస రాస్తా’ అంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. కిష్టప్ప ఒంటి మీదకు గాయాలొచ్చినట్లే మరో నలుగురైదుగురి ఒంటి మీద కూడా గాయాల ఆనవాళ్లు తేలాయి. ఎవరికి వారు అవి ఎలా వచ్చాయో తెలియదనే వాళ్లే. అప్పుడు మొదలైంది... ‘ఈ ఊరికి ఏమైంది’ అనే సందేహం. ‘రాత్రిళ్లు కోతులు తిరుగుతున్నాయి, అవి రాళ్లేసి ఉంటాయి’... గడచిన నాలుగు రోజులుగా కొండవాలు నుంచి అప్పుడప్పుడూ పడుతున్న రాళ్లకు, మనుషుల ఒంటి మీద గాయాలను జోడించి తార్కికంగా తేల్చేశారు కొందరు. అయితే గాయాలు ఆ ఒక్కరోజుతో ఆగలేదు, ప్రతిరోజూ కనీసం నలుగురైనా గాయాలతో నిద్రలేస్తున్నారు. ‘ఎంత కోతిచేష్టలైతే మాత్రం రాయి తగిలినట్లు తెలుస్తుంది కదా... అలాంటిదేమీ లేకనే గాయాలవుతుంటే చేతబడి కాకపోతే ఇంకేంటి’ తమకు తోచిన సమాధానంతో కూడిన ప్రశ్నలను రేకెత్తిస్తున్నారు గ్రామస్తులు. గాయాలైన వాళ్లు చేతబడిని పారదోలమని ఆ ఊళ్లోనే ఉన్న మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. గాయాలు కాని వాళ్లు ముందు జాగ్రత్తగా... వాళ్ల మీద చేతబడి జరగకుండా ఉండడానికి మంత్రగాళ్లను శరణుకోరుతున్నారు. మంత్రగాళ్లు నాగప్ప, శీనప్పలకు చేతినిండా పని. శీనప్ప అయితే వచ్చిన వాళ్లకు భూతవైద్యం చేసి అంతటితో సరిపెట్టుకోవడం లేదు. ‘ఈ రాత్రికి ఫలానా వీథిలో కూడా ఇలాగే గాయాలవుతాయి’ అంటూ జోస్యం చెప్పసాగాడు. అతడన్నట్లే జరిగేది. ఊరి పెద్దలంతా సమావేశమయ్యారు. ఏదో ఒకటి చేయాలి... ఊరికి పట్టిన పీడ విరగడవ్వాలంటే గ్రామదేవత చౌడమ్మకు తిరునాళ్లు చేయాలని తీర్మానించారు. ఈ సంగతి తెలిసిన శీనప్ప ‘ఇది ఎవరి పాపమో చెప్పడానికి మనమెవరం... చౌడమ్మ తల్లే తేలుస్తుంది’ అని నర్మగర్భంగా ఒక సంకేతాన్ని జారీ చేశాడు. ‘చౌడమ్మ పల్లకీ ఊరికి చేతబడి చేసిన వారింటి ముందు ఆగుతుంది’ అనే ప్రచారం ఊపందుకుంది. ఆ రోజు రానే వచ్చింది. చౌడమ్మ పల్లకీ ఊరేగుతోంది. ఆసక్తిగా ఇళ్ల ముందుకొచ్చి చూస్తున్నారు జనం. కొందరు పల్లకీతోపాటు నడుస్తున్నారు. దాదాపుగా సగం ఊరు పూర్తయింది. జనంలో ఉత్కంఠ పెరుగుతోంది. ‘చౌడమ్మ తప్పకుండా సత్యం చూపిస్తుంది’ అని మరింతగా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. పల్లకీ ఎవరో ఒకరి ఇంటి ముందు ఆగకపోతే నిరుత్సాహపడేటట్లు కూడా ఉంది పరిస్థితి. ఇంతలో ఓ ఇంటి ముందు ఆగింది. బోయీలు అక్కడే ఆగిపోయారు, పల్లకీని దించేశారు. ఇక జనం ఆగలేకపోయారు. ఆ ఇంటిలోకి చొచ్చుకుని పోయి, దొరికిన వస్తువును దొరికినట్లు పగులకొడుతున్నారు. ఆ విధ్వంసానికి గ్యాస్ సిలిండర్ పేలింది. ఇల్లు భగ్గుమన్నది. ఇంట్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మిగిలిన వాళ్లు గాయపడ్డారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం. కలెక్టర్ ముందు కూర్చుని ఉన్నాడో పెద్దమనిషి. పేరు ప్రేమానంద్. ‘మీరు అనుమతిస్తే ఉరవకొండ సమస్యను పరిష్కరిస్తాను’ స్థిరంగా, స్పష్టంగా చెబుతున్నాడాయన. దెయ్యాలు, చేతబడులు లేవు అంటూ ఊరిలోకి అడుగుపెట్టాలంటే... కుదిరేటట్లు లేదు. ఇది దెయ్యం పని లేదా చేతబడేనని అని గట్టిగా నమ్ముతున్నారు జనం. వ్యూహాత్మకంగా పరిష్కరించాల్సిందే. వాళ్లు నమ్ముతున్న బాటలో వెళ్లి పరిష్కరించడమే మార్గం. శాంతిభద్రతలను, రాజ్యాంగాన్ని, వ్యక్తుల భద్రతను పరిరక్షించాల్సిన పెద్ద బాధ్యతలో ఉన్న తాను తీసుకునే నిర్ణయం... సమస్యను మరింత జటిలం చేయకూడదు. మరి... ఇప్పుడీ వ్యక్తిని నమ్మాలా వద్దా అనే మీమాంస కలెక్టర్‌ను వేధిస్తోంది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఏదో ఒకటి చేయడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రేమానంద్‌కు రక్షణగా ఉంటూ జనం సమస్య తీర్చడానికి ఏర్పాట్లు చేయమని పోలీసు అధికారులకు ఆదేశించారు. ‘గొప్ప మలయాళ మాంత్రికుడు వచ్చి దెయ్యాలను పారదోలుతారు’ అని ప్రచారం చేసి జనాన్ని పోగేశారు పోలీసులు. ఊరంతా సమావేశమైంది. గాయాలపాలైన వారందరినీ ముందు వరుసలో కూర్చోబెట్టారు పోలీసులు. ఒక్కొక్కరిని, వారి గాయాలను నిశితంగా పరిశీలించారు ప్రేమానంద్. ఏం జరిగిందో చెప్పమని అందరి చేత మాట్లాడించారు. తర్వాత ఓ కుర్రాడిని వేదిక మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి హిప్నటైజ్ చేసి నిద్రపుచ్చారు ప్రేమానంద్. దుప్పటిలో నుంచి చేయిపెట్టి అతడి ఒంటి మీద గాయాలు చేశారు. నిద్ర నుంచి లేపి గాయాల గురించి అడిగితే తనకేమీ కాలేదన్నాడా యువకుడు. ఒంటి మీద చూపిస్తే తప్ప అతడికి గాయమైనట్లు తెలియలేదు. ‘ఇలాగే ఎవరో పని గట్టుకుని గాయాలు చేస్తున్నారు. అలా చేస్తున్నది ఎవరో కనిపెట్టండి. చేతబడులు లేవు, దెయ్యాలు లేవ’ంటూ మరికొన్ని మాయలను వేదిక మీద చేసి చూపించారాయన. అపోహలను తొలగించుకుని హాయిగా జీవించండని ధైర్యం చెప్పి వెళ్లిపోయారు ప్రేమానంద్. వెళ్తూ వెళ్తూ పోలీస్ అధికారులతో ‘చౌడమ్మ పల్లకీ మోసిన బోయిలను విచారించండి’ అని హెచ్చరించారు. ప్రేమానంద్ ఇచ్చిన సంకేతమే డొంకను కదిలించింది. పల్లకీ మోసే బోయీలలో వెనుక వైపున్న వాళ్లు ఎలా కావాలంటే అలా సాగుతుంది పల్లకి ప్రయాణం. వాళ్లు ఏ దిక్కుకు తిరగాలనుకుని దిశ మారిస్తే, ముందు వాళ్లు తమకు తెలియకనే అలా మలుపు తీసుకుంటారు. ఆ ప్రణాళికలో భాగంగానే పల్లకి నాగప్ప ఇంటి ముందు ఆగింది. అయితే పోలీసు దర్యాప్తు వేగవంతం అయితే తన కింద భూమి కదిలిపోతుందని గ్రహించాడు శీనప్ప. అంతే... ఆ ఊళ్లో ఇక ఎవ్వరికీ గాయాలు కాలేదు. రాళ్లు దొర్లి పడలేదు. వందమంది పోలీసులు, నలుగురు సబ్ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఓ డి.ఎస్.పిని ముప్పు తిప్పలు పెట్టిన గాయాల జాడ్యం అంతటితో సమసిపోయింది. ఈ ఇరవై ఏళ్లలో ఎవరూ చేతబడి అని, దెయ్యం అని మంత్రగాళ్లను ఆశ్రయించ లేదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి గమనిక: మంత్రగాళ్ల పేర్లు మార్చాం ఎందుకిలా! ఉరవకొండలో అప్పట్లో నాగప్ప, శీనప్ప అనే మంత్రగాళ్లదే హవా. ఇద్దరికీ మంచి స్నేహం కూడా ఉండేది. కొన్నాళ్లకు నాగప్పకు ఆదరణ ఎక్కువైంది, శీనప్పకు తగ్గింది. జనాదరణ పెంచుకోవడానికి శీనప్ప తన మనుషుల చేత ఆడించిన నాటకమే ఇది. కొండ రాళ్లు దొర్లడం, నిద్రపోయే వాళ్లకు గాయాలవడం, చౌడమ్మ పల్లకి నాగప్ప ఇంటి ముందు ఆగడం... అంతా శీనప్ప వ్యూహమే. గాయాల మర్మమేంటి? పిల్లలు గోళ్లకు రేగుముల్లు అమర్చుకుని ‘నేను పులిని’ అంటూ భయపెడుతూ ఆడుకుంటుంటారు. గుచ్చినప్పుడు నొప్పి తెలియదు, కానీ తర్వాత చర్మం మీద గాటు పడుతుంది. ఇది ఔషధమొక్క కాబట్టి గాటు వల్ల హాని జరగదు. ఇదే ఫార్ములాని వాడారు. నిద్రపోయేటప్పుడు దుప్పటి మీద నుంచి ముల్లుతో గీరి వెళ్లిపోయేవారు. తెల్లవారే సరికి గాయాలు కనిపించేవి. ప్రేమానంద్ ఎవరు? ఇతడు పుట్టింది, పెరిగింది కేరళలో, మొదట తాంత్రిక శక్తుల పట్ల ఆకర్షితుడై మాంత్రికులు చేసే విద్యలు నేర్చుకున్నారు. హిమాలయాల్లోనూ సాధన చేశారు. వాటన్నింటిలో ఉన్నది సైన్స్ మాత్రమేనని తెలుసుకున్నారు. జనం బలహీనతల మీద ఆడుకోవడానికి, డబ్బు సంపాదించడానికి సైన్స్ ఆధారంగా సాగుతున్న మోసాలే ఇవన్నీ అని గ్రహించారు. ‘సైన్స్ వర్సెస్ మిరకిల్స్’ పుస్తకం రాశారు. దేశమంతటా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా ఆ సమయంలో అనంతపురం జిల్లాలో ఉన్నారు. అప్పట్లో పుట్టపర్తి బాబా చేసే మిరకిల్స్‌ను కూడా చేసి చూపించేవారాయన. దేశంలో తొలితరం హేతువాదులు, జనవిజ్ఞానవేదిక వంటి భావసారూప్యం కలిగిన వారిలో చాలా మంది ఆయనకు ఏకలవ్య శిష్యులున్నారు. - ఎస్. శంకర శివరావు, జనవిజ్ఞానవేదిక జాతీయ మేజిక్ కమిటీ కన్వీనర్ -
జూదం భూతం
యువకులు అన్ని ఊళ్లలో ఉంటారు... అన్యాయం... అక్రమాల మీద తిరగబడేది వీళ్లే! సత్యం పలకడం...సత్యం కోసం తెగబడడం... దేనికైనా సరే యువతదే ముందంజ! ఇలాంటి యువకులు ఉన్న ఊళ్లో జాదూ ఆటలు చెల్లవు. జూదాల భూతాలు మనలేవు. అందుకే... యువతకు కవాతు చేద్దాం! చౌడమ్మగుడి... సామాన్యుల గుడి. పూజారులు ఉండరు. సంస్కృత శ్లోకాలు, మూలమంత్ర పఠనంతో అర్చన హారతులేవీ ఉండవు. ఎవరికి వారే అమ్మవారిని పూజించుకోవచ్చు. తాము తెచ్చిన పండో, కాయో అమ్మవారి ముందు పెట్టి మనసు లగ్నం చేసి ఓ దణ్ణం పెట్టుకుని రావచ్చు. సామాన్యుల కోసం, సామాన్యుల చేత ప్రతిష్ఠితమైన సామాన్యుల దేవత చౌడమ్మ. ఆ ఆలయంలో కొద్దికాలంగా ఓ మధ్యవయసు మహిళ కనిపిస్తోంది. పేరు ఎల్లమ్మ. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. ఎవరితోనూ మాట్లాడదు. తైలసంస్కారం లేక జడలు కట్టిన జుట్టు, మెడలో రుద్రాక్షల దండలు, పెద్ద కుంకుమ బొట్టుతో చూడగానే ఎవరికైనా సరే భయంతో కూడిన భక్తి జనించే రూపం ఆమెది. ఊరివాళ్ల మాటల్లో ఎల్లమ్మ ప్రస్తావన తరచుగా వినిపిస్తోంది. ఉదయం తొమ్మిది గంటలు. పెద్దవాళ్లు పొలం పనులకెళ్లారు. పిల్లలు బడికెళ్లేవాళ్లు బడికి, పశువులు మేపుకునే వాళ్లు అడవికి వెళ్లారు. ఆడవాళ్లు ఇంటిపనులు, వంట పనులు చూసుకుంటున్నారు. ఇక ఏ పనీపాటా లేని బేకార్ బ్యాచ్ మాత్రం చెట్టు నీడన ఓ ఇంటి అరుగును చూసుకుని పులిజూదం ఆడుతోంది. కావమ్మ, రాములమ్మ పూలబుట్టతో ఆ దారిన వెళ్లడం వారి కంట పడింది. ‘అదేంట్రా! పేడ గంపతో పొలం వెళ్లకుండా వీళ్లు పూలబుట్టలతో పేరంటానికెళ్తున్నట్లు ఎక్కడికెళ్తున్నారు’ మేకను పులి బారిన పడకుండా పావు కదుపుతూ అన్నాడు వీరు. ‘వీళ్లంతా చౌడమ్మ గుడికే. ఎల్లమ్మకు పూనకం వస్తోంది. చౌడమ్మ తల్లి పూని సగినం చెప్తోందట’ అన్నాడు వెంకటేశు. ఆ మాట వినగానే రాజప్పకు ఓ ఐడియా తళుక్కున మెరిసింది. ‘రేయ్! మీరు ఆట ఆడండి. నేనిప్పుడే వస్తా’ అంటూ క్షణంలో మాయమయ్యాడు. మరో ఐదు నిమిషాల్లో కృష్ణ ‘నాకు ఆకలేస్తోందిరా’ అంటూ ఆట నుంచి వెళ్లిపోయాడు. వెళ్లిన వాడు నేరుగా తన ఇంటికి వెళ్లకుండా రాజప్ప ఇంటి వైపు మళ్లాడు. రాజప్ప నీటి తొట్టె దగ్గర స్నానం చేస్తున్నాడు. ఇంట్లోకి వెళ్లకుండా దూరం నుంచి రాజప్పనే గమనించసాగాడు కృష్ణ. రాజప్ప ఉతికిన దుస్తులు వేసుకుని చౌడమ్మ ఆలయానికి వెళ్తున్నాడు. అతడినే వెంబడించాడు కృష్ణ. రాజప్ప వెళ్లేటప్పటికే చౌడమ్మ గుడి ఆవరణలో రాములమ్మ, కావమ్మతోపాటు ఐదారుగురున్నారు. ప్రతి ఒక్కరినీ తీక్షణంగా చూస్తోంది ఎల్లమ్మ. కళ్లు మూసుకుని మెల్లగా జపమాలను తిప్పసాగింది ఎల్లమ్మ. క్రమంగా జపమాల వేగంగా కదులుతోంది. ఇది మొదటి సిగ్నల్. అంటే... ఇక ఎల్లమ్మను చౌడమ్మ పూనుతుందేమోననే ఉత్కంఠత అక్కడున్న అందరిలోనూ. పిన్‌డ్రాప్ సెలైన్స్లోంచి ‘వే...పా...కు’ అంటూ ఎల్లమ్మ గొంతు ఖంగుమన్నది. గుడి ఆవరణలో ఉన్న వేపచెట్టు మీదకు ఉరికారు భక్తుల్లో ఇద్దరు యువకులు. ఎల్లమ్మ ఉచ్వాసనిశ్వాసాల వేగం పెరుగుతోంది. ఇది రెండవ సిగ్నల్... వేపాకు రెమ్మలను అందుకుని ఒక్కసారిగా నోట్లో కుక్కుకుని పరపర నమిలేసింది. అంతా తదేకంగా ఎల్లమ్మనే చూస్తున్నారు. ‘చేదాకును కలకండ తిన్నట్లు నమిలేసిందంటే మహిమ కాకపోతే ఇంకేంటి’ ఎవరికి వారు మనసులోనే తాదాత్మ్యతకు లోనవుతున్నారు. కావమ్మ ముందుకెళ్లి ఎల్లమ్మ ఎదురుగా కూర్చుంది. ఏమిటన్నట్లుగా చూసింది ఎల్లమ్మ. ఇప్పుడామెను ఎల్లమ్మ అనాలా చౌడమ్మ అనాలా? సందిగ్ధం కావమ్మలో. సర్దుకుని ‘అమ్మా! మా కోడలికి మూడోనెల. మగపిల్లాడు పుడతాడా?’ మాటల్లో ఉద్వేగం, ఆత్రుత అణుచుకోలేకపోతోంది. నిశ్చలంగా కావమ్మ కళ్లలోకి చూసింది ఎల్లమ్మ. జపమాల వైపు చూసింది. ఆటోమేటిగ్గా కావమ్మ దృష్టి కూడా జపమాల మీదకే మళ్లింది. ఆశ్చర్యంగా జపమాల ముందుకు వెనక్కు ఊగింది. ఎల్లమ్మ ముఖం ప్రసన్నంగా మారింది. ‘కోరుకున్నట్లే జరుగుతుంది’ అన్నది గుంభనంగా. ఇదంతా చూస్తున్న రాములమ్మ ఇక ఆగలేకపోయింది. కావమ్మ పక్కకు తోస్తూ ఎల్లమ్మ ఎదురుగా జరిగి కూర్చుంది. ‘మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందామ్మా’ అడిగేసింది. ఎల్లమ్మ ముఖం అప్రసన్నంగా మారిపోయింది. కళ్లు మూసుకుని జపమాలను మెల్లగా కదిలిస్తూ ధ్యానం చేసింది. కళ్లు తెరిచి రాములమ్మ ముఖంలోకి తీక్షణంగా చూసింది. జపమాలను, రాములమ్మను మార్చి మార్చి చూసింది. కావమ్మ విషయంలో జరిగినట్లు జపమాల ఊగలేదు. వృత్తాకారంలో తిరిగింది. ‘ఇంకా సమయముంది’ అన్నది ఎల్లమ్మ ముక్తసరిగా. ‘ఎన్నాళ్లకు...’ మాట పూర్తయ్యేలోపు ఎల్లమ్మ దృష్టి మరొకరి మీదకు మళ్లింది. రాములమ్మ మాట సగంలోనే ఆపేసి నిరాశగా తలూపింది. ఇక రాజప్ప వంతు. ‘నేననుకున్న నంబరు వస్తుందా’ సూటిగా ఉంది ప్రశ్న. జపమాల ఊగింది. ‘రాజప్ప కళ్లలోకి చూసింది ఎల్లమ్మ. ‘వస్తుంది’ అన్నది. ఇదంతా చూస్తున్న కృష్ణకు రాజప్ప ఏమడిగాడో లీలగా అర్థమైంది. మూడవ రోజు రాజప్ప మళ్లీ గుడికొచ్చాడు. ఆనందంగా ఎల్లమ్మకు డబ్బు ఇవ్వబోయాడు. ‘నాకేం వద్దు, చౌడమ్మకు చీరపెట్టి, బంగారు తాళిబొట్లు సమర్పించుకో’ అన్నదామె వినమ్రంగా(పూనకం వచ్చినప్పుడు ఆ దుస్తులు, ఆభరణాలను ధరించేది ఎల్లమ్మే). ఆ సంగతి కృష్ణ నోటి వెంట రహస్యంగానే అయినా ఊరిలోని పులిజూదం బ్యాచ్ అంతటికీ చేరింది. ఇక ఊళ్లో బాధ్యతరహితంగా తిరిగే యువకులు చౌడమ్మ ఆలయానికి రెగ్యులర్ భక్తులయ్యారు. చుట్టుపక్కల గ్రామాల యువకులు కూడా రాసాగారు. పోలీసులకు తలనొప్పి ఎక్కువైంది. జూదాన్ని అరికట్టడం వారికి తలకు మించిన పనవుతోంది. అది పులిజూదం కాదు. మట్కా. పులిజూదం పైకి కనిపించే టైమ్ పాస్ ఆట మాత్రమే. అంతర్లీనంగా మట్కా సాగిపోతుండేది. పందెం కాయాలనుకున్న నంబరు సగినంలో అడిగి మరీ జూదం ఆడుతున్నారు యువకులు. నమ్మకాలు పెరిగాయి. నమ్మేవారు ఎక్కువయ్యారు. ఎల్లమ్మ ఒంటి మీదకు కొత్త చీరలు, బంగారు ఆభరణాలు చేరుతున్నాయి. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఎల్లమ్మ జపమాలతొ ధ్యానం చేస్తోంది. ఆమె కళ్లు తెరిచే క్షణాల కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. కళ్లు తెరవకనే మనిషి కొద్దిగా ఊగుతూ ‘వేపాకు, నిమ్మకాయలు...’ అంటోంది. యువకులు వేపచెట్టెక్కి రెమ్మలు కోసి చేతికందించారు. కళ్లు తెరకనే వేపాకు నోట్లో కూరి నమిలేసింది. అందులో దాచిన పచ్చి మిరపకాయలు ఘాటెత్తిస్తున్నాయి. కారం అని ఉమ్మేయడానికి వీల్లేదు. పూనకం స్థితి నుంచి బయటకు రావడానికీ వీల్లేదు. పూర్తిగా నమలక తప్పనిసరి. ‘ఆవు పంచితం’ అంటూ కూర్చున్న స్థితిలోనే ఊగిపోసాగింది. ఓ కుర్రాడు ఇత్తడి చెంబులో ఆవు పంచితం అందించాడు. గటగట తాగేసింది. పెదవుల నుంచి గొంతు వరకు ఒకటే దురద. కడుపులో వికారం. తన ఎత్తుకు పై ఎత్తు వేశారెవరో అని గ్రహించిందామె. అయితే అంతే యుక్తిగా ‘నేను తరిమెల గ్రామం వచ్చిన పనయిపోయింది. చౌడమ్మ ఆన. ఆమె పిలిస్తే వచ్చిన, వెళ్లమంటోంది వెళ్తున్నా’ అని ఉన్నఫళంగా ఊరు వదిలి వెళ్లిపోయింది. తినగ తినగ వేము తియ్యగనుండు! చౌడమ్మ గుడిలో ఉన్న వారి ప్రత్యక్ష సాక్ష్యంతో తరిమెల హరిజన వాడంతా ఏకమైంది. మీరిచ్చిన వేపాకు, ఆవుపంచితం వల్లనే చౌడమ్మకు కోపం వచ్చింది. దేవతను ఊరి నుంచి వెళ్లగొట్టారంటూ వేపాకు కోసిచ్చిన కుర్రాడిని, ఆవు పంచితం ఇచ్చిన కుర్రాడిని కొట్టబోయారు. వారిని శాంతపరిచి ఎల్లమ్మ బూటకాన్ని బయటపెట్టారు చదువుకున్న యువకులు. గొర్రెల కాపరికి ఉద్యోగం వస్తుందని చెప్పిన సగినాన్ని వివరించారు. వేపాకు తినడం కష్టమేమీ కాదని సమాధానపరిచారు. జపమాల ఎలా కదులుతుందో చేసి చూపించారు. జూదం వలయం, సగినాల మూఢవిశ్వాసంతో ఊరు భ్రష్టుపడుతోందని గ్రహించారు చదువుకున్న యువకులు. మోసానికి, వ్యసనానికి తెరదించి ఊరి వారిని చైతన్యవంతం చేయాలనుకున్నారు. ఊరిని బాగు చేయాలనుకున్నారు. మంచి కోసం చేసిన వారి ప్రయత్నం సఫలీకృతమైంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. గొర్రెల కాపరికి ఉద్యోగ సగినం! ఇంటర్ సెలవుల్లో ఊరికి వచ్చినప్పుడు ఈ తంతు మాకు తెలిసింది. స్టూడెంట్స్‌కు కూడా మట్కా అలవాటైంది. అమ్మానాన్నలిచ్చిన డబ్బును జూదంలో కోల్పోతున్నారు. ఏం చెప్పాలో తెలియక దొంగతనాలకు పాల్పడుతున్నారు. జపమాల సగినం మోసాన్ని బయటపెట్టాలనుకున్నాం. నల్లప్ప, వెంకట నారాయణతోపాటు మరికొంతమందిమి కలిసి గొర్రెలు కాసుకునే ఓ కుర్రాడికి ప్యాంటు, షర్టు వేసి ఎల్లమ్మ దగ్గరకు తీసుకెళ్లాం. ‘ఉద్యోగం వస్తుంద’ని చెప్పింది. ఊరి వారిని సమాధానపరచడానికి ఈ ఆధారం చాలు. ఇక ఆమె ఆటలు కట్టిద్దాం అని దురదగుంటాకు రసం, పచ్చిమిర్చి ఉపాయంతో తరిమికొట్టాం. - తరిమెల రాజు, ఉపాధ్యక్షులు జెవివి, అనంతపురం జిల్లా జపమాల ఇలా తిరిగేది! జపమాలను చేతివాటంతో కదిలిస్త్తే చాలు. దండ ముందుకు వెనక్కు ఊగుతుంది, వలయాకారంగా తిరుగుతుంది. నిశ్చలంగా ఉంచాలనుకుంటే అలాగే ఉంటుంది. దండ ఊగే దూరం... దాని పొడవు, బరువు మీద ఆధారపడి ఉంటుంది. -
నేనసలు అద్దమే చూడను...
అంతర్వీక్షణం ఏ రంగంలో స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? అలాంటిదేమీ అనుకోలేదు, రచయితగా స్థిరపడడం కూడా అనుకోకుండా జరిగిపోయింది. అలాగే ఫలానా ప్రదేశంలోనే స్థిరపడాలనే ఆలోచనలు అప్పట్లో పెద్దగా ఉండేవి కాదు. ఇప్పటికి ఎన్ని నవలలు, కథలు రాసి ఉండవచ్చు? 150 నవలలు, మూడు వేలకు పైగా కథలు. మీ రచనల్లో మీకు అత్యంత ఇష్టమైనవి? రెండు రెళ్లు ఆరు, చంటబ్బాయి, విధాత ఏదైనా ఒక పాత్రను మలిచిన తర్వాత కొన్నాళ్లకు ఆ పాత్రను మరోలా రూపొందించి ఉండాల్సింది అనుకున్న సందర్భం ఉందా? లేదు. రచన మొదలు పెట్టే ముందే సమగ్రమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. మొదలు పెట్టాక మార్చకూడదు. నాకెప్పుడూ మార్చాల్సిన అవసరం కూడా రాలేదు. మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? ఏ రకంగా ప్రభావం చూపారు? కొమ్మూరి సాంబశివరావు గారు. ఆయన రచనలే నాకు స్ఫూర్తి. ఆయన లేకపోతే మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఉండేవాడు కాదు. మీకు ఇష్టమైన పుస్తకాలు... అమ్మ ఒడిలోకి పయనం, ఒక యోగి ఆత్మకథ. ఇన్నేళ్లుగా ఎన్నడూ మీ ఫొటో ప్రచురించడానికి ఇష్టపడకపోవడానికి ప్రత్యేక కారణం ఉందా? నాలో కీర్తి కాంక్ష కొద్దిగా కూడా లేదు. ఫొటోలు తీసుకుని చూసుకోవాలనే కోరిక కూడా లేదు. నా జీవితంలో తీసుకున్న ఫొటోలు బస్ పాసు, పాస్ పోర్టు, స్కూలు రికార్డుల కోసమే. మీ అభిమాన పాఠకులలో ఒకరి పేరు చెప్తారా? వైజాగ్ నుంచి ఎం. ఎన్. దేవి అనే పాఠకురాలు, తాడేపల్లి గూడెం నుంచి రాము అనే పాఠకుడు క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తుండే వారు. ఎలాంటి విషయాలకు భయపడతారు? ఒక సాధారణమైన మనిషికి ఉండే భయాలన్నీ నాకూ ఉన్నాయి. పామును చూసి భయపడడం మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చినట్లుంది. ఆధ్యాత్మిక మార్గంలో తరచూ పాములుండే ప్రదేశాల్లో సంచరిస్తుండడంతో ఇప్పుడా భయం పోయింది. అబద్ధం చెప్పాల్సి వస్తే ఏం చేస్తారు? ఒకప్పుడు స్వీయరక్షణ కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అబద్ధం చెప్పేసే వాడిని. ఆధ్యాత్మికంలో సత్యానికి దగ్గరగా ఉండడాన్ని సాధన చేయడం మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా మానేశాను. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు? నేనసలు అద్దమే చూడను. తల దువ్వడానికి కూడా చూడను. షేవింగ్ సమయంలో కూడా చెంపల మీదే తప్ప ముఖం మీద నా దృష్టి పడదు. మీరు ఎన్నడైనా మీ శ్రీమతిని క్షమాపణ అడగాల్సి వచ్చిందా? చాలాసార్లు వచ్చింది. కానీ గతంలో మగాడిననే అహంతో క్షమాపణ చెప్పేవాడిని కాదు. ఇప్పుడు చెప్తున్నాను. శ్రీమతికే కాదు బయటి వాళ్లకు కూడా గతంలో వాళ్లకు కలిగించిన అసౌకర్యాలను గుర్తు చేసుకుని మరీ క్షమాపణ చెప్తున్నాను. పిల్లల గురించి... నాకు ముగ్గురమ్మాయిలు. పెద్దమ్మాయి కావ్య అమెరికాలోని హ్యూస్టన్‌లో, రెండో అమ్మాయి ఊహ ఇండియానాపోలిస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మూడో అమ్మాయి లిపి... విచిటా స్టేట్ యూనివర్శిటీలో ఎం.ఎస్ చేస్తోంది. ఈ తరాన్ని చూస్తే ఏమనిపిస్తుంటుంది? సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటున్నారు. వారి కారణంగా ఎదుటి వారికి ఇబ్బంది కలిగితే దానికి కనీసంగా కూడా స్పందించడం లేదు. పొరపాటు జరిగిందనే భావన మనసులోకే రానివ్వడం లేదు. ఆ ధోరణి మారాలి. మీరు పశ్చాత్తాప పడిన సందర్భం ఉందా? జీవితం నిండా అవే ఉన్నాయి. సంస్కరించుకునే ప్రయత్నం జరిగిందా? జరిగింది. అందులో భాగంగానే మద్యం, మాంసం,మగువల జోలికెళ్లడం పూర్తిగా మానేశాను. దేవుడు ప్రత్యక్షమై ‘నీ జీవితంలో ఒక్కరోజే ఉంద’ంటే.. మీ చివరి కోరిక..? మోక్ష సాధన కోసం ఏమేమి చేయాలో ఆ దేవుణ్ణే అడిగి, ఆయన చెప్పినట్లు చేస్తాను. - వాకా మంజులారెడ్డి