‘‘జీవితంలో ఏదీ అసాధ్యం కాదు. అన్నీ సుసాధ్యమే. నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధించవచ్చు. నీ కలను నిజం చేసుకోవడానికి నీవే శ్రమించాలి. లక్ష్యాన్ని చేరే వరకు నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. అప్పుడు విజయం నీదై తీరుతుంది. అనారోగ్యం నిన్ను చూసి పారిపోతుంది. ఇందుకు అసలైన నిర్వచనం ఈ సాహసి జీవితం.
‘‘సాహసం చేయకపోతే జీవితంలో అనేక అనుభవాలకు, ఆనందాలకూ దూరంగా ఉండిపోతాం. అందుకే సాహసించాల్సిందే’’ అంటున్న ఈ సాహసి పేరు సవితారెడ్డి. ఆమె ఫ్యాషన్ డిజైనర్, అడ్వెంచరస్ టూరిస్ట్. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటారు. మసాబ్ ట్యాంకు నుంచి రాజేంద్రనగర్, హెచ్‌సీయూ, నార్సింగి, రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా, ఖాజాగూడల్లో ఉదయం పూట జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్ల మీద సైక్లింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈమె గత ఏడాది రెండు కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు. ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించుకోవడానికి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ కశ్మీర్‌లోని ‘గ్రేట్ లేక్స్ ఆఫ్ కశ్మీర్’ట్రెకింగ్ టూర్‌కి సిద్ధమవుతున్నారు.
మహిళకు సెలవేది?
ఒక సామాన్యమైన కుటుంబం లో మహిళ జీవితం ఎలా ఉంటుంది? పిల్లల స్కూళ్లకు, కాలేజ్‌లకు సెలవులుంటాయి. భర్త ఆఫీస్‌కి సెలవులుంటాయి. తనకు మాత్రం సెలవు ఉండదు. తనకంటూ ఒక ఆటవిడుపు ఉండాలని కోరుకున్నా సరే సాధ్యపడదు. ఆ మహిళ గృహిణి అయినా ఉద్యోగి అయినా, ఎంటర్‌ప్రెన్యూర్ అయినా సరే... ఈ కుటుంబచిత్రమ్‌లో పెద్ద తేడా ఏమీ ఉండదు.
మహిళలు ఆ రొటీన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా రెక్కలు తగిలించుకోవాలంటారు సవిత. ఈ విషయంలో హైదరాబాద్ మహిళ ఓ అడుగు ముందుకేసిందని కూడా అన్నారామె. మహిళ తన సంతోషం కోసం ఇంకా ఇంకా గొంతు విప్పాలనేదే నా కోరిక. అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను. మరింత మందిని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు సవిత.
దేశమంతా పెరిగాను!
సవిత తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడంతో ఆమె బాల్యం దేశంలోని అనేక ప్రదేశాల్లో సాగింది. దాదాపుగా ముప్పై ఏళ్ల కిందట ఫ్యాషన్ డిజైనింగ్ ఒక కోర్సు రూపంలో యూనివర్సిటీ కరిక్యులమ్‌లో చేరిన తొలి రోజుల్లో, ఏ మాత్రం ఉపాధికి భరోసా కల్పించలేని ఆ కోర్సులో చేరాలనుకోవడమే పెద్ద సాహసం. అలాంటి రోజుల్లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారామె.
పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సొంతంగా తన పేరుతోనే ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ ప్రారంభించారు. ‘‘పాతికేళ్ల పాటు చాలా సీరియెస్‌గా ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం పని చేశాను. నా యూనిట్ చూసుకుంటూ మధ్యలో కార్ ర్యాలీలు, ట్రెక్కింగులతో జీవితాన్ని సంతోషంగా గడిపాననే చెప్పాలి. 2017లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించాను. అయితే అన్ని రోజులూ ఒకేరకంగా ఉండవు కదా! ఆ తర్వాతి ఏడాది కాళ్లు నాకు పరీక్ష పెట్టాయి.
మాల్ అలైన్‌మెంట్ సమస్యతో బౌడ్ లెగ్స్‌గా మారిపోయాయి. ట్రెకింగ్ కాదు కదా మామూలుగా నడవడం కూడా కష్టమైంది. ఆ క్షణంలో నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధమయ్యాను. హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ చేయించుకున్నాను. మోకాళ్ల నుంచి మడమల మధ్య ఉండే ఎముకను వంపు తీసి సరిచేసి ప్లేట్ అమర్చి స్క్రూలతో బిగిస్తారన్నమాట. గత ఏడాది ఆగస్టులో ఒక కాలికి, నవంబరులో మరో కాలికి సర్జరీ అయింది.
కొంతకాలం వీల్ చెయిర్‌కి పరిమితమయ్యాను. తర్వాత వాకర్‌తో రోజులు గడిచాయి. ఇక ఇప్పుడు నా ఫిట్‌నెస్‌ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకే ఈ సైక్లింగ్. వారంలో మూడు రోజులు సైక్లింగ్ రోజుకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు, మరో మూడు రోజులు గంటపాటు వాకింగ్... ఇదీ ఇప్పుడు నా రొటీన్. ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కశ్మీర్‌లో ట్రెకింగ్‌కి సిద్ధమవుతున్నాను’’ అని చెప్పారు సవిత.
ఇంత సాహసం అవసరమా?
‘‘నలభై ఎనిమిదేళ్ల వయసులో ఆ సర్జరీ అవసరమా, మందులతో రోజులు వెళ్లదీయవచ్చు కదా’ అని అడిగే వాళ్లకు నేను చెప్పే సమాధానం ‘అవసరమే’ అని. ఏ వయసులోనైనా మనిషి జీవితం తన చేతుల్లోనే ఉండాలి. అనారోగ్యం కారణంగా మరొకరి మీద ఆధారపడే పరిస్థితిలోకి జారిపోకూడదు. పైగా నలభై ఎనిమిది అంటే... అభిరుచులను కట్టిపెట్టి జీవితాన్ని నిస్సారంగా గడిపే వయసు కాదు. నాకు ఇష్టమైన కార్ ర్యాలీ, ట్రెకింగ్ వంటివేవీ చేయలేనప్పుడు, భారంగా అడుగులేసుకుంటూ రోజులు గడిపే జీవితం నాకు అవసరమా... అనేది నా ప్రశ్న.
అందుకే ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఫిఫ్టీ– ఫిఫ్టీ అని తెలిసినప్పటికీ నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడ్డాను. మనం అనుకున్నట్లు జీవించడానికి అనారోగ్యాన్ని అధిగమించడానికి మొదట మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్‌ఫెక్ట్‌గా, ఫిట్‌గా ఉన్నాను. నా డిజైనింగ్ స్టూడియోని నడుపుకుంటున్నాను. నా ట్రెకింగ్ ఇంటరెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోగలను కూడా’’ అని ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వుతో చెప్పారు సవిత.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment