మంత్రగాళ్లకు మంత్రగాడు | Wizard to magicians | Sakshi
Sakshi News home page

మంత్రగాళ్లకు మంత్రగాడు

Published Mon, Mar 28 2016 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

మంత్రగాళ్లకు   మంత్రగాడు

మంత్రగాళ్లకు మంత్రగాడు

రాత్రి దుప్పటికప్పుకుని పడుకుంటే  పొద్దున లేచేటప్పటికల్లా ఒళ్లంతా గాయాలు!  చీమకుట్టినట్టయినా తెలీలేదు... కానీ అన్నీ గాట్లే... ‘నొప్పి లేదు... మంటా లేదు...  ఇదేం దెయ్యంరా బాబూ...’ అని ఊరంతా మొత్తుకుంది.  ఆ ఊరికున్న ఆస్థాన మంత్రగాళ్లు... మంత్రం మేమేస్తామంటే మేమేస్తామని... ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి దోచుకున్నారు. మరి కేసు ఎలా సాల్వ్ అవ్వాలి? మొనగాళ్లకు మొనగాళ్లలాగా... మంత్రగాళ్లకు మంత్రగాడిలా ప్రేమానంద్ వచ్చాడు! మిగతా కథకు మీరే సాక్షి!!

 

అది ఇరవై ఏళ్ల నాటి ఉరవకొండ. ఓ రోజు తెల్లవారి నిద్రలేస్తూనే ఒళ్లంతా నొప్పులుగా అనిపించి ఒళ్లు విరుచుకుంటున్నాడు కిష్టప్ప. పక్క దుప్పటి మడతపెడుతున్న కొడుకును చూస్తూనే సరోజమ్మ కళ్లలో ఆందోళన. ‘ఏందప్పా... సావాసగాళ్లతో కొట్లాడితివా ఏంటీ... ఒల్లంతా దెబ్బలు తగిలించుకున్నావు. ఎవరు కొట్టారప్పా’ అన్నది గాబరాగా. అప్పుడే చూసుకున్నాడు కిష్టప్ప కూడా. నిజమే... ఒంటి మీద గాయాల ఆనవాళ్లున్నాయి. నొప్పి పెడుతున్నాయి కూడా. ‘ఏయప్ప నిన్ను కొట్టింది చెప్పు’ అంటూ గద్దిస్తోంది సరోజమ్మ. ‘నన్నెవరూ కొట్టలే... ఈ దెబ్బలెట్టా వచ్చాయో తెల్వదు’ అంటూ తెల్లముఖం వేశాడు కిష్టప్ప. కొడుకు ఏదో దాస్తున్నాడనుకుంది సరోజమ్మ. మరి రెట్టించడం ఇష్టం లేక... ‘ముఖం కడుక్కుని రా, దెబ్బలకు వెన్నపూస రాస్తా’ అంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది.

 
కిష్టప్ప ఒంటి మీదకు గాయాలొచ్చినట్లే మరో నలుగురైదుగురి ఒంటి మీద కూడా గాయాల ఆనవాళ్లు తేలాయి. ఎవరికి వారు అవి ఎలా వచ్చాయో తెలియదనే వాళ్లే. అప్పుడు మొదలైంది... ‘ఈ ఊరికి ఏమైంది’ అనే సందేహం. ‘రాత్రిళ్లు కోతులు తిరుగుతున్నాయి, అవి రాళ్లేసి ఉంటాయి’... గడచిన నాలుగు రోజులుగా కొండవాలు నుంచి అప్పుడప్పుడూ పడుతున్న రాళ్లకు, మనుషుల ఒంటి మీద గాయాలను జోడించి తార్కికంగా తేల్చేశారు కొందరు. అయితే గాయాలు ఆ ఒక్కరోజుతో ఆగలేదు, ప్రతిరోజూ కనీసం నలుగురైనా గాయాలతో నిద్రలేస్తున్నారు.

 
‘ఎంత కోతిచేష్టలైతే మాత్రం రాయి తగిలినట్లు తెలుస్తుంది కదా... అలాంటిదేమీ లేకనే గాయాలవుతుంటే చేతబడి కాకపోతే ఇంకేంటి’ తమకు తోచిన సమాధానంతో కూడిన ప్రశ్నలను రేకెత్తిస్తున్నారు గ్రామస్తులు. గాయాలైన వాళ్లు చేతబడిని పారదోలమని ఆ ఊళ్లోనే ఉన్న మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. గాయాలు కాని వాళ్లు ముందు జాగ్రత్తగా...  వాళ్ల మీద చేతబడి జరగకుండా ఉండడానికి మంత్రగాళ్లను శరణుకోరుతున్నారు. మంత్రగాళ్లు నాగప్ప, శీనప్పలకు చేతినిండా పని. శీనప్ప అయితే వచ్చిన వాళ్లకు భూతవైద్యం చేసి అంతటితో సరిపెట్టుకోవడం లేదు. ‘ఈ రాత్రికి ఫలానా వీథిలో కూడా ఇలాగే గాయాలవుతాయి’ అంటూ జోస్యం చెప్పసాగాడు. అతడన్నట్లే జరిగేది.

  

ఊరి పెద్దలంతా సమావేశమయ్యారు. ఏదో ఒకటి చేయాలి... ఊరికి పట్టిన పీడ విరగడవ్వాలంటే గ్రామదేవత చౌడమ్మకు తిరునాళ్లు చేయాలని తీర్మానించారు. ఈ సంగతి తెలిసిన శీనప్ప ‘ఇది ఎవరి పాపమో చెప్పడానికి మనమెవరం... చౌడమ్మ తల్లే తేలుస్తుంది’ అని నర్మగర్భంగా ఒక సంకేతాన్ని జారీ చేశాడు. ‘చౌడమ్మ పల్లకీ ఊరికి చేతబడి చేసిన వారింటి ముందు ఆగుతుంది’ అనే ప్రచారం ఊపందుకుంది. ఆ రోజు రానే వచ్చింది. చౌడమ్మ పల్లకీ ఊరేగుతోంది. ఆసక్తిగా ఇళ్ల ముందుకొచ్చి చూస్తున్నారు జనం. కొందరు పల్లకీతోపాటు నడుస్తున్నారు. దాదాపుగా సగం ఊరు పూర్తయింది. జనంలో ఉత్కంఠ పెరుగుతోంది. ‘చౌడమ్మ తప్పకుండా సత్యం చూపిస్తుంది’ అని మరింతగా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. పల్లకీ ఎవరో ఒకరి ఇంటి ముందు ఆగకపోతే నిరుత్సాహపడేటట్లు కూడా ఉంది పరిస్థితి. ఇంతలో ఓ ఇంటి ముందు ఆగింది. బోయీలు అక్కడే ఆగిపోయారు, పల్లకీని దించేశారు. ఇక జనం ఆగలేకపోయారు. ఆ ఇంటిలోకి చొచ్చుకుని పోయి, దొరికిన వస్తువును దొరికినట్లు పగులకొడుతున్నారు. ఆ విధ్వంసానికి గ్యాస్ సిలిండర్ పేలింది. ఇల్లు భగ్గుమన్నది. ఇంట్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మిగిలిన వాళ్లు గాయపడ్డారు.

  

జిల్లా కలెక్టర్ కార్యాలయం. కలెక్టర్ ముందు కూర్చుని ఉన్నాడో పెద్దమనిషి. పేరు ప్రేమానంద్. ‘మీరు అనుమతిస్తే ఉరవకొండ సమస్యను పరిష్కరిస్తాను’ స్థిరంగా, స్పష్టంగా చెబుతున్నాడాయన. దెయ్యాలు, చేతబడులు లేవు అంటూ ఊరిలోకి అడుగుపెట్టాలంటే... కుదిరేటట్లు లేదు. ఇది దెయ్యం పని లేదా చేతబడేనని అని గట్టిగా నమ్ముతున్నారు జనం. వ్యూహాత్మకంగా పరిష్కరించాల్సిందే. వాళ్లు నమ్ముతున్న బాటలో వెళ్లి పరిష్కరించడమే మార్గం. శాంతిభద్రతలను, రాజ్యాంగాన్ని, వ్యక్తుల భద్రతను పరిరక్షించాల్సిన పెద్ద బాధ్యతలో ఉన్న తాను తీసుకునే నిర్ణయం... సమస్యను మరింత జటిలం చేయకూడదు. మరి... ఇప్పుడీ వ్యక్తిని నమ్మాలా వద్దా అనే మీమాంస కలెక్టర్‌ను వేధిస్తోంది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఏదో ఒకటి చేయడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రేమానంద్‌కు రక్షణగా ఉంటూ జనం సమస్య తీర్చడానికి ఏర్పాట్లు చేయమని పోలీసు అధికారులకు ఆదేశించారు. ‘గొప్ప మలయాళ మాంత్రికుడు వచ్చి దెయ్యాలను పారదోలుతారు’ అని ప్రచారం చేసి జనాన్ని పోగేశారు పోలీసులు.

  

ఊరంతా సమావేశమైంది. గాయాలపాలైన వారందరినీ ముందు వరుసలో కూర్చోబెట్టారు పోలీసులు. ఒక్కొక్కరిని, వారి గాయాలను నిశితంగా పరిశీలించారు ప్రేమానంద్. ఏం జరిగిందో చెప్పమని అందరి చేత మాట్లాడించారు. తర్వాత ఓ కుర్రాడిని వేదిక మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి హిప్నటైజ్ చేసి నిద్రపుచ్చారు ప్రేమానంద్. దుప్పటిలో నుంచి చేయిపెట్టి అతడి ఒంటి మీద గాయాలు చేశారు. నిద్ర నుంచి లేపి గాయాల గురించి అడిగితే తనకేమీ కాలేదన్నాడా యువకుడు. ఒంటి మీద చూపిస్తే తప్ప అతడికి గాయమైనట్లు తెలియలేదు. ‘ఇలాగే ఎవరో పని గట్టుకుని గాయాలు చేస్తున్నారు. అలా చేస్తున్నది ఎవరో కనిపెట్టండి. చేతబడులు లేవు, దెయ్యాలు లేవ’ంటూ మరికొన్ని మాయలను వేదిక మీద చేసి చూపించారాయన. అపోహలను తొలగించుకుని హాయిగా జీవించండని ధైర్యం చెప్పి వెళ్లిపోయారు ప్రేమానంద్. వెళ్తూ వెళ్తూ పోలీస్ అధికారులతో ‘చౌడమ్మ పల్లకీ మోసిన బోయిలను విచారించండి’ అని హెచ్చరించారు.


ప్రేమానంద్ ఇచ్చిన సంకేతమే డొంకను కదిలించింది. పల్లకీ మోసే బోయీలలో వెనుక వైపున్న వాళ్లు ఎలా కావాలంటే అలా సాగుతుంది పల్లకి ప్రయాణం. వాళ్లు ఏ దిక్కుకు తిరగాలనుకుని దిశ మారిస్తే, ముందు వాళ్లు తమకు తెలియకనే అలా మలుపు తీసుకుంటారు. ఆ ప్రణాళికలో భాగంగానే పల్లకి నాగప్ప ఇంటి ముందు ఆగింది. అయితే పోలీసు దర్యాప్తు వేగవంతం అయితే తన కింద భూమి కదిలిపోతుందని గ్రహించాడు శీనప్ప. అంతే... ఆ ఊళ్లో ఇక ఎవ్వరికీ గాయాలు కాలేదు. రాళ్లు దొర్లి పడలేదు. వందమంది పోలీసులు, నలుగురు సబ్‌ఇన్‌స్పెక్టర్‌లు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లు, ఓ డి.ఎస్.పిని ముప్పు తిప్పలు పెట్టిన గాయాల జాడ్యం అంతటితో సమసిపోయింది. ఈ ఇరవై ఏళ్లలో ఎవరూ చేతబడి అని, దెయ్యం అని మంత్రగాళ్లను ఆశ్రయించ లేదు.

 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 

గమనిక: మంత్రగాళ్ల పేర్లు మార్చాం
ఎందుకిలా!

ఉరవకొండలో అప్పట్లో నాగప్ప, శీనప్ప అనే మంత్రగాళ్లదే హవా. ఇద్దరికీ మంచి స్నేహం కూడా ఉండేది. కొన్నాళ్లకు నాగప్పకు ఆదరణ ఎక్కువైంది, శీనప్పకు తగ్గింది. జనాదరణ పెంచుకోవడానికి శీనప్ప తన మనుషుల చేత ఆడించిన నాటకమే ఇది. కొండ రాళ్లు దొర్లడం, నిద్రపోయే వాళ్లకు గాయాలవడం, చౌడమ్మ పల్లకి  నాగప్ప ఇంటి ముందు ఆగడం... అంతా శీనప్ప వ్యూహమే.

 

గాయాల మర్మమేంటి?
పిల్లలు గోళ్లకు రేగుముల్లు అమర్చుకుని ‘నేను పులిని’ అంటూ భయపెడుతూ ఆడుకుంటుంటారు. గుచ్చినప్పుడు నొప్పి తెలియదు, కానీ తర్వాత చర్మం మీద గాటు పడుతుంది. ఇది ఔషధమొక్క కాబట్టి గాటు వల్ల హాని జరగదు. ఇదే ఫార్ములాని వాడారు. నిద్రపోయేటప్పుడు దుప్పటి మీద నుంచి ముల్లుతో గీరి వెళ్లిపోయేవారు. తెల్లవారే సరికి గాయాలు కనిపించేవి.

 

ప్రేమానంద్ ఎవరు?
ఇతడు పుట్టింది, పెరిగింది కేరళలో, మొదట తాంత్రిక శక్తుల పట్ల ఆకర్షితుడై మాంత్రికులు చేసే విద్యలు నేర్చుకున్నారు. హిమాలయాల్లోనూ సాధన చేశారు. వాటన్నింటిలో ఉన్నది సైన్స్ మాత్రమేనని తెలుసుకున్నారు. జనం బలహీనతల మీద ఆడుకోవడానికి, డబ్బు సంపాదించడానికి సైన్స్ ఆధారంగా సాగుతున్న మోసాలే ఇవన్నీ అని గ్రహించారు. ‘సైన్స్ వర్సెస్ మిరకిల్స్’ పుస్తకం రాశారు. దేశమంతటా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా ఆ సమయంలో అనంతపురం జిల్లాలో ఉన్నారు. అప్పట్లో పుట్టపర్తి బాబా చేసే మిరకిల్స్‌ను కూడా చేసి చూపించేవారాయన. దేశంలో తొలితరం హేతువాదులు, జనవిజ్ఞానవేదిక వంటి భావసారూప్యం కలిగిన వారిలో చాలా మంది ఆయనకు ఏకలవ్య శిష్యులున్నారు.

 - ఎస్. శంకర శివరావు,

జనవిజ్ఞానవేదిక జాతీయ మేజిక్ కమిటీ కన్వీనర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement