జూదం భూతం | Gambling demon | Sakshi
Sakshi News home page

జూదం భూతం

Published Tue, Feb 23 2016 6:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

జూదం భూతం

జూదం భూతం

యువకులు అన్ని ఊళ్లలో ఉంటారు...
అన్యాయం... అక్రమాల మీద తిరగబడేది వీళ్లే!
సత్యం పలకడం...సత్యం కోసం తెగబడడం...
దేనికైనా సరే యువతదే ముందంజ!
ఇలాంటి యువకులు ఉన్న
ఊళ్లో జాదూ ఆటలు చెల్లవు.
 జూదాల భూతాలు మనలేవు.
అందుకే... యువతకు కవాతు చేద్దాం!

 
చౌడమ్మగుడి... సామాన్యుల గుడి. పూజారులు ఉండరు. సంస్కృత శ్లోకాలు, మూలమంత్ర పఠనంతో అర్చన హారతులేవీ ఉండవు. ఎవరికి వారే అమ్మవారిని పూజించుకోవచ్చు. తాము తెచ్చిన పండో, కాయో అమ్మవారి ముందు పెట్టి మనసు లగ్నం చేసి ఓ దణ్ణం పెట్టుకుని రావచ్చు. సామాన్యుల కోసం, సామాన్యుల చేత ప్రతిష్ఠితమైన సామాన్యుల దేవత చౌడమ్మ. ఆ ఆలయంలో కొద్దికాలంగా ఓ మధ్యవయసు మహిళ కనిపిస్తోంది. పేరు ఎల్లమ్మ. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. ఎవరితోనూ మాట్లాడదు. తైలసంస్కారం లేక జడలు కట్టిన జుట్టు, మెడలో రుద్రాక్షల దండలు, పెద్ద కుంకుమ బొట్టుతో చూడగానే ఎవరికైనా సరే భయంతో కూడిన భక్తి జనించే రూపం ఆమెది. ఊరివాళ్ల మాటల్లో ఎల్లమ్మ ప్రస్తావన తరచుగా వినిపిస్తోంది.
   
ఉదయం తొమ్మిది గంటలు. పెద్దవాళ్లు పొలం పనులకెళ్లారు. పిల్లలు బడికెళ్లేవాళ్లు బడికి, పశువులు మేపుకునే వాళ్లు అడవికి వెళ్లారు. ఆడవాళ్లు ఇంటిపనులు, వంట పనులు చూసుకుంటున్నారు. ఇక ఏ పనీపాటా లేని బేకార్ బ్యాచ్ మాత్రం చెట్టు నీడన ఓ ఇంటి అరుగును చూసుకుని పులిజూదం ఆడుతోంది. కావమ్మ, రాములమ్మ పూలబుట్టతో ఆ దారిన వెళ్లడం వారి కంట పడింది. ‘అదేంట్రా! పేడ గంపతో పొలం వెళ్లకుండా వీళ్లు పూలబుట్టలతో పేరంటానికెళ్తున్నట్లు ఎక్కడికెళ్తున్నారు’ మేకను పులి బారిన పడకుండా పావు కదుపుతూ అన్నాడు వీరు. ‘వీళ్లంతా చౌడమ్మ గుడికే. ఎల్లమ్మకు పూనకం వస్తోంది. చౌడమ్మ తల్లి పూని సగినం చెప్తోందట’ అన్నాడు వెంకటేశు. ఆ మాట వినగానే రాజప్పకు ఓ ఐడియా తళుక్కున మెరిసింది. ‘రేయ్! మీరు ఆట ఆడండి. నేనిప్పుడే వస్తా’ అంటూ క్షణంలో మాయమయ్యాడు. మరో ఐదు నిమిషాల్లో కృష్ణ ‘నాకు ఆకలేస్తోందిరా’ అంటూ ఆట నుంచి వెళ్లిపోయాడు. వెళ్లిన వాడు నేరుగా తన ఇంటికి వెళ్లకుండా రాజప్ప ఇంటి వైపు మళ్లాడు. రాజప్ప నీటి తొట్టె దగ్గర స్నానం చేస్తున్నాడు. ఇంట్లోకి వెళ్లకుండా దూరం నుంచి రాజప్పనే గమనించసాగాడు కృష్ణ. రాజప్ప ఉతికిన దుస్తులు వేసుకుని చౌడమ్మ ఆలయానికి వెళ్తున్నాడు. అతడినే వెంబడించాడు కృష్ణ.
   
రాజప్ప వెళ్లేటప్పటికే చౌడమ్మ గుడి ఆవరణలో రాములమ్మ, కావమ్మతోపాటు ఐదారుగురున్నారు. ప్రతి ఒక్కరినీ తీక్షణంగా చూస్తోంది ఎల్లమ్మ. కళ్లు మూసుకుని మెల్లగా జపమాలను తిప్పసాగింది ఎల్లమ్మ. క్రమంగా జపమాల వేగంగా కదులుతోంది. ఇది మొదటి సిగ్నల్. అంటే... ఇక ఎల్లమ్మను చౌడమ్మ పూనుతుందేమోననే ఉత్కంఠత అక్కడున్న అందరిలోనూ. పిన్‌డ్రాప్ సెలైన్స్‌లోంచి ‘వే...పా...కు’ అంటూ ఎల్లమ్మ గొంతు ఖంగుమన్నది. గుడి ఆవరణలో ఉన్న వేపచెట్టు మీదకు ఉరికారు భక్తుల్లో ఇద్దరు యువకులు. ఎల్లమ్మ ఉచ్వాసనిశ్వాసాల వేగం పెరుగుతోంది. ఇది రెండవ సిగ్నల్... వేపాకు రెమ్మలను అందుకుని ఒక్కసారిగా నోట్లో కుక్కుకుని పరపర నమిలేసింది. అంతా తదేకంగా ఎల్లమ్మనే చూస్తున్నారు. ‘చేదాకును కలకండ తిన్నట్లు నమిలేసిందంటే మహిమ కాకపోతే ఇంకేంటి’ ఎవరికి వారు మనసులోనే తాదాత్మ్యతకు లోనవుతున్నారు.

కావమ్మ ముందుకెళ్లి ఎల్లమ్మ ఎదురుగా కూర్చుంది. ఏమిటన్నట్లుగా చూసింది ఎల్లమ్మ. ఇప్పుడామెను ఎల్లమ్మ అనాలా చౌడమ్మ అనాలా? సందిగ్ధం కావమ్మలో. సర్దుకుని ‘అమ్మా! మా కోడలికి మూడోనెల. మగపిల్లాడు పుడతాడా?’ మాటల్లో ఉద్వేగం, ఆత్రుత అణుచుకోలేకపోతోంది. నిశ్చలంగా కావమ్మ కళ్లలోకి చూసింది ఎల్లమ్మ. జపమాల వైపు చూసింది. ఆటోమేటిగ్గా కావమ్మ దృష్టి కూడా జపమాల మీదకే మళ్లింది. ఆశ్చర్యంగా జపమాల ముందుకు వెనక్కు ఊగింది. ఎల్లమ్మ ముఖం ప్రసన్నంగా మారింది. ‘కోరుకున్నట్లే జరుగుతుంది’ అన్నది గుంభనంగా. ఇదంతా చూస్తున్న రాములమ్మ ఇక ఆగలేకపోయింది. కావమ్మ పక్కకు తోస్తూ ఎల్లమ్మ ఎదురుగా జరిగి కూర్చుంది. ‘మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందామ్మా’ అడిగేసింది. ఎల్లమ్మ ముఖం అప్రసన్నంగా మారిపోయింది. కళ్లు మూసుకుని జపమాలను మెల్లగా కదిలిస్తూ ధ్యానం చేసింది. కళ్లు తెరిచి రాములమ్మ ముఖంలోకి తీక్షణంగా చూసింది. జపమాలను, రాములమ్మను మార్చి మార్చి చూసింది. కావమ్మ విషయంలో జరిగినట్లు జపమాల ఊగలేదు. వృత్తాకారంలో తిరిగింది. ‘ఇంకా సమయముంది’ అన్నది ఎల్లమ్మ ముక్తసరిగా. ‘ఎన్నాళ్లకు...’ మాట పూర్తయ్యేలోపు ఎల్లమ్మ దృష్టి మరొకరి మీదకు మళ్లింది. రాములమ్మ మాట సగంలోనే ఆపేసి నిరాశగా తలూపింది. ఇక రాజప్ప వంతు. ‘నేననుకున్న నంబరు వస్తుందా’ సూటిగా ఉంది ప్రశ్న. జపమాల ఊగింది. ‘రాజప్ప కళ్లలోకి చూసింది ఎల్లమ్మ. ‘వస్తుంది’ అన్నది. ఇదంతా చూస్తున్న కృష్ణకు రాజప్ప ఏమడిగాడో లీలగా అర్థమైంది.
   
మూడవ రోజు రాజప్ప మళ్లీ గుడికొచ్చాడు. ఆనందంగా ఎల్లమ్మకు డబ్బు ఇవ్వబోయాడు. ‘నాకేం వద్దు, చౌడమ్మకు చీరపెట్టి, బంగారు తాళిబొట్లు సమర్పించుకో’ అన్నదామె వినమ్రంగా(పూనకం వచ్చినప్పుడు ఆ దుస్తులు, ఆభరణాలను ధరించేది ఎల్లమ్మే). ఆ సంగతి కృష్ణ నోటి వెంట రహస్యంగానే అయినా ఊరిలోని పులిజూదం బ్యాచ్ అంతటికీ చేరింది. ఇక ఊళ్లో బాధ్యతరహితంగా తిరిగే యువకులు చౌడమ్మ ఆలయానికి రెగ్యులర్ భక్తులయ్యారు. చుట్టుపక్కల గ్రామాల యువకులు కూడా రాసాగారు. పోలీసులకు తలనొప్పి ఎక్కువైంది. జూదాన్ని అరికట్టడం వారికి తలకు మించిన పనవుతోంది. అది పులిజూదం కాదు. మట్కా. పులిజూదం పైకి కనిపించే టైమ్ పాస్ ఆట మాత్రమే. అంతర్లీనంగా మట్కా సాగిపోతుండేది. పందెం కాయాలనుకున్న నంబరు సగినంలో అడిగి మరీ జూదం ఆడుతున్నారు యువకులు. నమ్మకాలు పెరిగాయి. నమ్మేవారు ఎక్కువయ్యారు. ఎల్లమ్మ ఒంటి మీదకు కొత్త చీరలు, బంగారు ఆభరణాలు చేరుతున్నాయి.
   
ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఎల్లమ్మ జపమాలతొ ధ్యానం చేస్తోంది. ఆమె కళ్లు తెరిచే క్షణాల కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. కళ్లు తెరవకనే మనిషి కొద్దిగా ఊగుతూ ‘వేపాకు, నిమ్మకాయలు...’ అంటోంది. యువకులు వేపచెట్టెక్కి రెమ్మలు కోసి చేతికందించారు. కళ్లు తెరకనే వేపాకు నోట్లో కూరి నమిలేసింది. అందులో దాచిన పచ్చి మిరపకాయలు ఘాటెత్తిస్తున్నాయి. కారం అని ఉమ్మేయడానికి వీల్లేదు. పూనకం స్థితి నుంచి బయటకు రావడానికీ వీల్లేదు. పూర్తిగా నమలక తప్పనిసరి. ‘ఆవు పంచితం’ అంటూ కూర్చున్న స్థితిలోనే ఊగిపోసాగింది. ఓ కుర్రాడు ఇత్తడి చెంబులో ఆవు పంచితం అందించాడు. గటగట తాగేసింది. పెదవుల నుంచి గొంతు వరకు ఒకటే దురద. కడుపులో వికారం. తన ఎత్తుకు పై ఎత్తు వేశారెవరో అని గ్రహించిందామె. అయితే అంతే యుక్తిగా ‘నేను తరిమెల గ్రామం వచ్చిన పనయిపోయింది. చౌడమ్మ ఆన. ఆమె పిలిస్తే వచ్చిన, వెళ్లమంటోంది వెళ్తున్నా’ అని ఉన్నఫళంగా ఊరు వదిలి వెళ్లిపోయింది.
 
తినగ తినగ వేము తియ్యగనుండు!
చౌడమ్మ గుడిలో ఉన్న వారి ప్రత్యక్ష సాక్ష్యంతో తరిమెల హరిజన వాడంతా ఏకమైంది. మీరిచ్చిన వేపాకు, ఆవుపంచితం వల్లనే చౌడమ్మకు కోపం వచ్చింది. దేవతను ఊరి నుంచి వెళ్లగొట్టారంటూ వేపాకు కోసిచ్చిన కుర్రాడిని, ఆవు పంచితం ఇచ్చిన కుర్రాడిని కొట్టబోయారు. వారిని శాంతపరిచి ఎల్లమ్మ బూటకాన్ని బయటపెట్టారు చదువుకున్న యువకులు. గొర్రెల కాపరికి ఉద్యోగం వస్తుందని చెప్పిన సగినాన్ని వివరించారు. వేపాకు తినడం కష్టమేమీ కాదని సమాధానపరిచారు. జపమాల ఎలా కదులుతుందో చేసి చూపించారు.
 జూదం వలయం, సగినాల మూఢవిశ్వాసంతో ఊరు భ్రష్టుపడుతోందని గ్రహించారు చదువుకున్న యువకులు. మోసానికి, వ్యసనానికి తెరదించి ఊరి వారిని చైతన్యవంతం చేయాలనుకున్నారు. ఊరిని బాగు చేయాలనుకున్నారు. మంచి కోసం చేసిన వారి ప్రయత్నం సఫలీకృతమైంది.
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి.
 
 గొర్రెల కాపరికి ఉద్యోగ సగినం!
ఇంటర్ సెలవుల్లో ఊరికి వచ్చినప్పుడు ఈ తంతు మాకు తెలిసింది. స్టూడెంట్స్‌కు కూడా మట్కా అలవాటైంది. అమ్మానాన్నలిచ్చిన డబ్బును జూదంలో కోల్పోతున్నారు. ఏం చెప్పాలో తెలియక దొంగతనాలకు పాల్పడుతున్నారు. జపమాల సగినం మోసాన్ని బయటపెట్టాలనుకున్నాం. నల్లప్ప, వెంకట నారాయణతోపాటు మరికొంతమందిమి కలిసి గొర్రెలు కాసుకునే ఓ కుర్రాడికి ప్యాంటు, షర్టు వేసి ఎల్లమ్మ దగ్గరకు తీసుకెళ్లాం. ‘ఉద్యోగం వస్తుంద’ని చెప్పింది. ఊరి వారిని సమాధానపరచడానికి ఈ ఆధారం చాలు. ఇక ఆమె ఆటలు కట్టిద్దాం అని దురదగుంటాకు రసం, పచ్చిమిర్చి ఉపాయంతో తరిమికొట్టాం.
 - తరిమెల రాజు, ఉపాధ్యక్షులు
 జెవివి, అనంతపురం జిల్లా
 
జపమాల ఇలా తిరిగేది!

 జపమాలను చేతివాటంతో కదిలిస్త్తే చాలు. దండ ముందుకు వెనక్కు ఊగుతుంది, వలయాకారంగా తిరుగుతుంది. నిశ్చలంగా ఉంచాలనుకుంటే అలాగే ఉంటుంది. దండ ఊగే దూరం... దాని పొడవు, బరువు మీద ఆధారపడి ఉంటుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement