శ్మశాన  సౌందర్యం | sitting alone in the cemetery | Sakshi
Sakshi News home page

శ్మశాన  సౌందర్యం

Published Sun, Dec 24 2017 1:12 AM | Last Updated on Sun, Dec 24 2017 1:12 AM

 sitting alone in the cemetery - Sakshi

చలి ఎక్కువైంది. ఎముకలు కొరికే చలి. ‘దెయ్యాలకు ఎముకలు ఉండవు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ చలికి చచ్చి, మనుషులయ్యేవి’.. అని చిన్న స్లిప్పులో బాల్‌పెన్‌తో రాసుకుని ఆ స్లిప్పునీ, పెన్నునీ తిరిగి జేబులో పెట్టుకున్నాడు కల్పేశ్‌.ఆ ముక్క రాసుకోడానికి కాస్త ముందు, కల్పేశ్‌ అదే స్లిప్పులో ఇంకో ముక్క కూడా రాసుకున్నాడు. ‘వెన్నెలే లేకపోయుంటే ఇంత శ్మశాన సౌందర్యం మనిషికి దక్కేది కాదేమో!’ అని. శ్మశానంలో అంత రాత్రప్పుడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు కల్పేశ్‌. ఎంత రాత్రప్పుడో కల్పేశ్‌ చూసుకోలేదు. ‘అంత రాత్రప్పుడు’ అని మనం అనుకోవడమే కానీ, కల్పేశ్‌కి అది అంత రాత్రి, ఇంత రాత్రి కాదు. రాత్రి మాత్రమే! మనుషుల్ని చూసినవాడు చీకటిని కొలుచుకుని, చీకటిని తలచుకుని భయపడడు. బాగా చలిగా ఉంది. బాగా చలిగా ఉన్నట్లనిపించడం చలి ఎక్కువై కాదు.. ఆ రోజు అక్కడ.. మండుతున్న చితి ఒక్కటి కూడా లేకపోవడం అని కల్పేశ్‌ గ్రహించాడు. కల్పేశ్‌ బాగుంటాడు. శ్మశానంలో రాత్రి పూట, అదీ.. సమాధి అరుగు మీద ఒంటరిగా కూర్చొని, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న మనిషి గురించి ఇలా చెప్పడం అసందర్భంగా ఉంటుంది. అయినా చెప్పాలి. కల్పేశ్‌ బాగుంటాడు. బాగుండడం అంటే లోపల ఎలాగుంటాడో బయటికీ అలాగే ఉంటాడు. ‘‘ఇంత చలిలో బయటికెందుకొచ్చావ్‌? వెళ్లు లోపలికి..’’ ఉలిక్కిపడి చూశాడు కల్పేశ్‌.ఎవరో మనిషి! దెయ్యంలా ఉన్నాడు. చేతిలో కర్ర ఉంది కాబట్టి అతడిని మనిషిగా పోల్చుకున్నాడు కల్పేశ్‌. కర్ర పట్టుకుని ఉన్న దెయ్యాన్ని అతడు ఏ పుస్తకంలోనూ చూడలేదు. అందుకే అతడు మనిషి అని తేలిగ్గా గుర్తుపట్టేశాడు.

‘‘ఇంత చలిలో బయటికెందుకొచ్చావ్‌? వెళ్లు లోపలకి..’’ అని మళ్లీ గదమాయించాడు ఆ మనిషి. ‘‘బయటికి రావడం ఏంటి? లోపలికి వెళ్లడం ఏంటి?’’ అన్నాడు కల్పేశ్‌.‘‘నీలాంటి పిల్ల దెయ్యాలను చాలా చూశాను కానీ, శకలు మానెయ్‌. నన్ను భయపెట్టడానికి సమాధిలోంచి బయటికి వచ్చి కూర్చున్నట్లున్నావ్‌. చలికి ఛస్తావ్‌. వెళ్లు లోపలికి’’ అన్నాడు.పెద్దగా నవ్వాడు కల్పేశ్‌. ‘‘నేను దెయ్యాన్ని కాదు. మనిషిని’’ అన్నాడు. ఆ మనిషి కూడా నవ్వాడు. అయితే కల్పేశ్‌ నవ్వినంత పెద్దగా మాత్రం నవ్వలేదు.‘‘మనిషివైతే శ్మశానంలో ఎందుకు కూర్చున్నావ్‌? మీవాళ్లెవరైనా పోయారా’’ అని అడిగాడు. ‘‘మావాళ్లెవరూ పోలేదు. నేనే పోవాలనుకుంటున్నాను’’ అన్నాడు కల్పేశ్‌. ఆ మనిషి బిత్తరపోయాడు. ‘‘పోయిన తర్వాతే ఎవరైనా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి పోవాలనుకోరు’’ అన్నాడు. ‘‘పోయేవరకైనా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ ప్లేస్‌ నచ్చింది’’ అన్నాడు కల్పేశ్‌. జాలిగా చూశాడు ఆ మనిషి కల్పేశ్‌ని. కల్పేశ్‌కి డౌటొచ్చింది. మనిషిని చూసి మనిషి జాలిపడడం తనెప్పుడూ చూడలేదు. ఈ మనిషి తనపై జాలిపడుతున్నాడంటే.. నిజంగా మనిషే అయివుంటాడా?!  ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్‌?’’ అన్నాడు ఆ మనిషి.‘‘నేనేం భయపడను కానీ, నిజంగా నువ్వు మనిషివేనా.. చెప్పు’’ అన్నాడు కల్పేశ్‌. ఆ మనిషి ఈసారి పెద్దగా నవ్వాడు.‘‘ఎందుకు నవ్వుతున్నావ్‌?’’‘‘మనం అడగాలనుకున్నది మనల్నే అడిగితే నవ్వు రాదా’’ అని మళ్లీ పెద్దగా నవ్వాడు ఆ మనిషి. ‘‘ఇలా మాటిమాటికీ నవ్వడం కూడా మనిషి లక్షణంలా లేదు’’ అన్నాడు కల్పేశ్‌. 

‘‘సరే, ఇక్కడెందుకు కూర్చున్నావ్‌?’’ అన్నాడు ఆ మనిషి. ‘‘రోజూ వచ్చి, ఇక్కడి లైఫ్‌ ఎలా ఉంటుందో అబ్జర్వ్‌ చేసి వెళ్తున్నాను’’‘‘లైఫ్‌ లేనివాళ్లుండే చోటు కదా ఇదంతా. ఇక్కడ లైఫ్‌ ఎందుకుంటుంది?’’ ‘‘కానీ ఈ లైఫ్‌ నాకెందుకో బెటర్‌గా అనిపిస్తోంది. నేనున్న ప్రపంచం నాకు నచ్చడం లేదు.’’‘‘ఏం నచ్చడం లేదు?’’‘‘అదంతా అబద్ధాల ప్రపంచం. ఒక్కరూ నిజమైన మనిషిలా బతకడం లేదు’’.‘‘నీకొచ్చిన నష్టం ఏంటి?’’‘‘నన్నూ వాళ్ల అబద్ధాల్లో కలిపేసుకుంటున్నారు. నేనెవరో తెలియనివాళ్లు కూడా నాపై అబద్ధాలు చెబుతున్నారు. నేనేంటో బాగా తెలిసినవాళ్లు కూడా  ఆ అబద్ధాలనే నిజం అని నమ్ముతున్నారు.’’‘‘నీకొచ్చిన నష్టం ఏంటి?’’‘‘నిజాన్ని చంపడమూ, మనిషిని చంపడమూ ఒకటే అని నా ఫీలింగ్‌. బతికి ఈ అబద్ధాలతో పడలేకపోవడం కన్నా.. చచ్చి, నా మీద అబద్ధాలను పడనివ్వకపోవడం నయం కదా’’ అన్నాడు కల్పేశ్‌.పెద్దగా నవ్వాడు ఆ మనిషి. ‘‘చనిపోయాకైనా నీ గురించి అబద్ధాలు చెప్పుకోరని ఎందుకు అనుకుంటున్నావ్‌?’’ అన్నాడు. కల్పేశ్‌ ఆ మనిషి వైపే కన్నార్పకుండా చూశాడు.‘‘చనిపోయి వచ్చాక, ఇక్కడైనా అబద్ధాలు చెప్పేవాళ్లు ఉండరని ఎందుకనుకుంటున్నావ్‌?’’ అన్నాడు.కల్పేశ్‌ ఆ మనిషినే చూస్తున్నాడు. ‘‘ఇవన్నీ కాదు.. ఇంకా నువ్వు బతికే ఉన్నావని ఎందుకనుకుంటున్నావ్‌?’’ అన్నాడు. ‘‘అదేంటి?’’ అన్నాడు కల్పేశ్, తనని తను చూసుకుంటూ. ఆ మనిషి నవ్వాడు. ఈసారి చిన్నగా నవ్వాడు. తాత్వికంగా నవ్వాడు. మనవడితో మాట్లాడుతున్న తాతయ్యలా నవ్వాడు. ‘‘అబద్ధాలూ నిజాలూ కాదు. అవతలివాళ్లు నీ గురించి ఏమనుకుంటున్నారోనని నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు బతికిలేనట్లే’’ అన్నాడు ఆ మనిషి. విస్మయంగా చూశాడు కల్పేశ్‌.‘‘ఒకటి చెప్పు.. నువ్వు నిజంగా మనిషివేనా? మనిషి అని నమ్మించడానికి కర్ర పట్టుకుని తిరుగుతున్న దెయ్యానివా?’’ అని అడిగాడు ఆ మనిషిని.ఆ మనిషేం చెప్పకుండా వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ కల్పేశ్‌తో అన్నాడు..‘‘లోపలికెళ్లు.. చలికి చచ్చిపోతావు.’’ ‘‘ఇంతకీ ఆ ఇద్దరిలో ఎవరు పెద్దమ్మా.. మనిషి?’’ అని అడిగాడు వరుణ్‌. వాడికి పన్నెండేళ్లు. పెద్దమ్మ ప్రతిరోజూ వాడికో దెయ్యం కథ చెప్పాల్సిందే. ‘‘అదేమిట్రా.. వాళ్లిద్దర్లో దెయ్యం ఎవరని అడుగుతావని అనుకున్నానే’’ అని ఆశ్చర్యపోయింది పెద్దమ్మ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement