
న్యూఢిల్లీ: మరికొన్ని సెకన్లలో చితిపై పడుకోబెట్టి, నిప్పంటించబోతుంటే మృతి చెందిన వ్యక్తి ఒక్క సారిగా కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బంధువుల కథనం ప్రకారం..
నారేలాలోని టిక్రీ ఖుర్ద్ గ్రామానికి చెందిన సతీష్ భరద్వాజ్ (62) ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడిని దహన సంస్కారాల నిమిత్తం కుటుంబ సభ్యులు శ్మశానికి తరలించారు కూడా. ఐతే చితిపై పడుకోబెట్టడానికి మృతుడి శరీరంపైనున్న గుడ్డను తొలగించగానే, అకస్మాత్తుగా కళ్లు తెరిచి, ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన వారు వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఉన్న ఒక వైద్యుడు అతడిని పరీక్షించి శ్వాస తీసుకుంటున్నాడని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లో వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారని, ఈ సంఘటన ఈ రోజు మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని వృద్ధుడి బంధువులు మీడియాకు తెలిపారు.
చదవండి: 15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్!