ఇద్దరు | Funday horror story of the week nov 11 2018 | Sakshi
Sakshi News home page

ఇద్దరు

Published Sun, Nov 11 2018 12:50 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Funday horror story of the week nov 11 2018 - Sakshi

ధైర్యం అంటే అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానంలోకి వెళ్లి రావడం కాదు. ఉదయాన్నే ఇంటి నుండి బయల్దేరాక, లోకంలో నానా రకాలైన మనుషులతో తలపడి మనసు పాడు చేసుకోకుండా తిరిగి క్షేమంగా ఇంటికి చేరడం. పిరికితనం అంటే ‘బాబోయ్‌ దెయ్యం’ అని భయపడి పరుగెత్తడం కాదు. కష్టం రాగానే, ‘దేవుడా కాపాడు’ అని వలవల ఏడ్చేయడం.

నలుగురు మనుషులు ఆ చీకట్లో కూర్చొని ఉన్నారు. ఆ నలుగురూ నాలుగు రకాల వయసుల వాళ్లు. ఒక యువకుడు. ఒక వృద్ధుడు. ఒక మధ్యస్థుడు. నాలుగో వ్యక్తి వయసే.. సరిగ్గా తెలియడం లేదు. పుట్టినప్పట్నుంచీ అతడు ప్రతి వయసులోనూ పదేళ్లు తక్కువగానే కనిపించేవాడు.  వాళ్లు నలుగురూ కూర్చొని ఉన్న చోటు.. ఒక ప్రమాద స్థలి. అదొక మలుపు. అక్కడెప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడికి సమీపంలోనే రైలు పట్టాలు ఉన్నాయి. అక్కడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే అవి అనుకోని ప్రమాదాలు కావు. అనుకుని చేసుకునే ఆత్మహత్యలు!

యువకుడు బాధపడుతున్నాడు. అందానికి కిరీటం ఉంటుంది. తెలివికి స్కాలర్‌షిప్‌ ఉంటుంది. ధైర్యానికి పతకం ఉంటుంది. అందవిహీనులకు, తెలివిలేనివాళ్లకు, భయస్థులకు ఈ లోకంలో చోటు లేదా? వారినెవరూ గుర్తించరా? అని ఆవేదన చెందుతున్నాడు. వృద్ధుడు యువకుడి వైపు ప్రేమగా చూశాడు. ‘‘చూడబ్బాయ్‌. లోకంలో ఏదైతే తక్కువగా ఉంటుందో దానికే విలువ ఉంటుంది తప్ప, తక్కువైనదేదీ ఈ లోకానికి విలువైనది కాదు’’ అన్నాడు. అర్థం కానట్లు చూశాడు యువకుడు. వృద్ధుడు నవ్వాడు.‘‘అందం తక్కువ. లోకం పట్టించుకోదు. చదువు తక్కువ. పట్టించుకోదు. ధైర్యం తక్కువ. పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదంటే.. ఇలా తక్కువగా ఉండేవాళ్లే మనుషుల్లో ఎక్కువ. అందం, ప్రతిభ, ధైర్యం.. ఇవి ఉండేవాళ్లు మనుషుల్లో తక్కువగా ఉంటారు కనుక, ఆ తక్కువగా ఉండేవాళ్లను పట్టించుకుంటుంది. లోకం నైజమిది. ఇందులో బాధపడవలసిందీ, వెళ్లి బావిలో పడవలసిందీ ఏమీ లేదు’’ అన్నాడు యువకుడి తలపై జుత్తును చేత్తో నిమురుతూ. నాలుగో వ్యక్తి మౌనంగా వింటున్నాడు. అతడికీ ఈలోకం ఏ రూపంలోనూ గుర్తింపును ఇవ్వలేదు. అతడి జీవితం ఓ రోజు అకస్మాత్తుగా ‘మలుపు’ తిరిగే వరకు ‘వయసు తక్కువతనమే’ అతడి గుర్తింపు.   ‘‘అయినా లోకం తీరింతే? నన్ను పిరికివాడు అంది. నిజానికి నేను పిరికివాడిని కాదు’’ అన్నాడు మధ్యవయస్కుడు.. మాటల మధ్యలోకి వచ్చి. ‘‘ఒంటి మీద కండలున్నాయ్‌. కళ్లు చురుగ్గా ఉన్నాయ్‌. మీకు పిరికితనం ఏంటి?’’ అన్నాడు యువకుడు.. మధ్యస్థుడితో. వృద్ధుడు పెద్దగా నవ్వాడు. ‘‘పిరికితనం బాడీలో ఉండదబ్బాయ్‌. మైండ్‌లో ఉంటుంది’’ అని ఆ యువకుడితో అని.. ‘‘ఎందుకు నిన్ను ఈ లోకం  పిరికివాడు అంది చెప్పు? నీ బాధలు లోకానికి చెప్పుకున్నావా? లేక, లోకంలోని బాధలు నువ్వు చూడలేకపోయావా?’’ అని మధ్యస్థుడిని అడిగాడు. మధ్యస్థుడు విరక్తిగా నవ్వాడు. ‘‘అర్థం చేసుకోవలసిన వాళ్లే నన్ను పిరికివాడు అన్నారు’’ అన్నాడు. ‘‘ఎవరు ఆ అర్థం చేసుకోవలసినవాళ్లు’’.. అడిగాడు నాలుగో వ్యక్తి. 

‘‘మా డాక్టర్‌’’ చెప్పాడు మధ్యస్థుడు. ‘‘నిజమే.. డాక్టర్‌లకు వెటకారం ఎక్కువైంది ఈ మధ్య. ‘తల తిరుగుతోంది డాక్టర్‌’ అంటే.. ‘భూమి తిరుగుతోంది కదా.. అందుకే తల తిరుగుతోంది’ అంటున్నారు..’’ అన్నాడు నాలుగో వ్యక్తి. ‘‘అసలు.. డాక్టర్‌ దగ్గరకి మీరెందుకు వెళ్లారు అంకుల్‌’’ అన్నాడు యువకుడు ఆ మధ్యస్థుడిని. ‘‘ఓ రోజు ఒంట్లో గాబరాగా ఉంటే వెళ్లాను. బీపీ ఉందన్నాడు. వరుసగా నాలుగు వారాలు బీపీ చూశాక మందులు రాసిచ్చాడు. నాకిదేం ఖర్మ అనుకున్నాను. లైఫ్‌ లాంగ్‌ వాడాలన్నాడు. రోజూ ఒకే  టైమ్‌కి మాత్ర పడాలన్నాడు. మాత్రకు ముందు ఏదైనా తినాలని అన్నాడు’’ అని చెప్పాడు మధ్యస్థుడు.‘‘ఎందుకాయన మిమ్మల్ని పిరికివాడు అన్నాడు అంకుల్‌..’’ కుతూహలంగా అడిగాడు యవకుడు. ‘‘హాహ్హాహా.. పేషెంట్‌ని పిరికివాడు అంటే.. డాక్టర్‌ ధైర్యస్థుడు అయిపోతాడు. అందుకని అలా అని ఉంటాడు’’ అని పెద్దగా నవ్వాడు నాలుగో వ్యక్తి.వృద్ధుడు ఏం మాట్లాడ్డం లేదు. రయ్యిన మలుపు తిరుగుతున్న వాహనాలను చూస్తూ మౌనంగా వీళ్ల మాటలు వింటున్నాడు. అతడికనిపించింది..మలుపు దగ్గర కూడా ఈ మనుషులు రయ్యిన ఎందుకు తిరుగుతారోనని!యువకుడి వైపు చూసి చెప్పాడు మధ్యస్థుడు.. ‘‘మాత్ర వేసుకోవడం మర్చిపోయి, ఓ రోజు డాక్టర్‌ దగ్గరికి పరుగెత్తుకెళ్లాను. ‘ఏమైంది?’ అన్నాడు. ‘బీపీ మాత్ర వేసుకోవడం మర్చిపోయాను డాక్టర్‌’ అన్నాను. ‘అయితే ఏమైంది?’ అన్నాడు. ‘ఏదో తేడాగా ఉన్నట్లుంది’ అన్నాను. బీపీ చెక్‌ చేశాడు. ‘నార్మల్‌’ అన్నాడు. ‘ఒక్కరోజు టాబ్లెట్‌ వేసుకోకపోతే ఏం కాదు’ అని చెప్పాడు’’.‘‘అప్పుడన్నాడా.. మిమ్మల్ని పిరికివాడని’’ అడిగాడు యువకుడు. ‘‘అప్పుడు కాదు. ఇంకోసారి వెళ్లాను. ‘బీపీ టాబ్లెట్‌ వేసుకున్నానో, వేసుకోలేదో గుర్తుకు రావడం లేదు. ఒకవేళ వేసుకుని ఉండి, మళ్లీ వేసుకుంటే బీపీ డౌన్‌ అవుతుందా? వేసుకుని ఉంటాన్లెమ్మని ఊరుకుంటే.. బీపీ రైజ్‌ అయ్యే అవకాశం ఉందా?’’ అని డాక్టర్‌ని అడగడానికి వెళ్లాను. ‘‘అప్పుడన్నాడా నిన్ను పిరికి అని’’ అడిగాడు నాలుగో వ్యక్తి. ‘‘అప్పుడు కాదు’’ అన్నాడు మధ్యస్థుడు.

‘‘మరి!’’‘‘మళ్లీ ఓ రోజు పరుగున వెళ్లాను డాక్టర్‌ దగ్గరకి. ‘మళ్లీ ఏమైంది!’ అన్నాడు. ‘వేసుకోవలసిన టైమ్‌ కంటే ఓ గంట ముందు బీపీ టాబ్లెట్‌ వేసుకున్నాను డాక్టర్‌. ఏమైనా అవుతుందా?’ అని అడిగాను.అప్పుడన్నాడు.. ‘నీ అంత పిరికి మనిషిని నేనింత వరకూ చూళ్లేదు’ అని. అప్పట్నుంచీ నన్నంతా పిరికివాడిలా చూడ్డం మొదలుపెట్టారు. ఈ పాడులోకంలో బతకడం వేస్ట్‌ అనిపించింది.. అందుకే ఓ రోజు..’’అని ఆగి, యువకుడి వైపు చూశాడు మధ్యస్థుడు. అతడలా చూడగానే వృద్ధుడు అకస్మాత్తుగా పైకి లేచాడు. యువకుడి భుజం మీద చెయ్యి వేసి అక్కడి నుంచి చీకట్లోకి నడిపించుకు వెళ్లాడు!‘‘ఈరోజు ఎలాగైనా ఆ కుర్రాణ్ణి మోటివేట్‌ చేసి  పట్టాల మీదకు తీసుకెళ్దామనుకున్నా. ముసలాడు పడనివ్వలేదు’’ తిట్టుకున్నాడు మధ్యస్థుడు. ‘‘నేను కూడా.. మలుపులో ఎవరైనా దొరక్కపోతారా అని కూర్చున్నాను. ఆ ముసలి పీనుగ కళ్లన్నీ మలుపు మీద, నా మీదే ఉన్నాయి’’ అన్నాడు నాలుగో వ్యక్తి. ‘‘అడుగో మళ్లీ ఇటే వస్తున్నాడు చూడు’’ అన్నాడు మధ్యస్థుడు. ‘‘అవునవును ఇక రాత్రంతా ఇక్కడే డ్యూటీ చేసేస్తాడు..’’ తిట్టుకున్నారు ఇద్దరూ.  ‘‘ఏంటి? నా గురించేనా?’ అంటూ వాళ్లను సమీపించాడు వృద్ధుడు. అతడి పక్కన ఆ యువకుడు లేడు. భద్రంగా ఇంటికి పంపించేసినట్లున్నాడు. 
- మాధవ్‌ శింగరాజు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement