సాక్షి, వరంగల్ రూరల్/పరకాల: తోడుగా ఉన్న తాత మరణిం చాడు. గొడవలతో బంధువులు దూరమయ్యారు. దీంతో ఏం చేయాలో ఆ మనవడికి తోచలేదు. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. తాత పెన్షన్ డబ్బులు వచ్చాక అంత్యక్రియలు పూర్తి చేయాలని భావించాడు. మరణించిన విషయం తెలిస్తే పెన్షన్ డబ్బులు రావేమోనని తాత శవాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. కానీ మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన బైరం బాలయ్య (90)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో బాలయ్య ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.
బాలయ్య కుమారుడు హరికృష్ణ భార్య ప్రమీల తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. భార్య చనిపోవడం, సోదరుల మధ్య గొడవలు ఉండటంతో కుమారుడు నిఖిల్‌తో కలిసి హరికృష్ణ పరకాలలోని తోరండ్ల కైలాసం కాంప్లెక్స్‌కు నివా సం మార్చాడు. వాస్తు చెబుతూ వచ్చిన డబ్బులతో జీవిస్తున్నాడు. అయితే బాలయ్య కామారెడ్డిలో ఉంటున్న తన ఇద్దరు కుమారులు పట్టించుకోవడం లేదంటూ భార్య నర్సమ్మతో కలిసి హరికృష్ణ దగ్గరకు వచ్చారు. రెండేళ్ల క్రితం కామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోగా.. ఆయన కుమారుడు నిఖిల్‌తో కలిసి పరకాలలోనే ఉంటున్నారు. బాలయ్యకు నెలనెలా వచ్చే రూ.40 వేల పెన్షన్‌తో వీరి జీవితం సాఫీగానే సాగింది. సరిగ్గా ఆరు నెలల క్రితం బాలయ్య భార్య నర్సమ్మ కరోనాతో చనిపోయింది.
తల్లి లేకపోవడం, మిగిలిన కుటుంబ సభ్యులు సైతం ఒకరొకరుగా దూరం కావడంతో నిఖిల్ మానసి కంగా కుంగుబాటుకు గురయ్యాడు. అయినప్పటికీ పక్షవాతంతో మంచానపడిన తాతకు అన్ని సపర్యలూ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో బాలయ్య కూడా మరణిం చాడు. అయితే గత నెలలో బాలయ్యకు వచ్చిన రూ.40 వేల పెన్షన్‌తో రూ.30 వేల వరకు అప్పు తీర్చడంతోపాటు ఇంట్లో ఖర్చులకు ఉపయోగించాడు. దీంతో చేతిలో డబ్బులు లేకుండా పోయింది. తాత చనిపోయిన విషయం తెలిస్తే పెన్షన్ రాదని, ఆయన అంత్యక్రియలు చేయలేనని భావించిన నిఖిల్ తాత శవానికి శాలువా కప్పి, మడతబెట్టి ఫ్రిజ్‌లో దాచాడు.
దుర్వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్..
బాలయ్య చనిపోయిన ఆదివారం నుంచి ఇప్పటివరకు అ దేఇంట్లో నిఖిల్ ఉంటున్నాడు. శవం దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాడు. ఏమీ ఎరగనట్టు ప్రవర్తిస్తూ ఎవరికీ విషయం తెలియ కుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో దుర్వాసన వస్తుండటంతో కాంప్లెక్స్ యజమాని కైలాసం నిఖిల్‌ను రెండు రోజుల క్రితం ప్రశ్నించాడు. పందికొక్కు చనిపోయిందని నిఖిల్ చెప్పడంతో వెళ్లిపోయాడు. గురువారం దుర్వాసన తీవ్రం కావడంతో అనుమానం వచ్చిన కైలాసం ఇంట్లోకి వెళ్లి ఫ్రిజ్ తెరిచి చూశాడు. లోపల శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. నిఖిల్‌ని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పూర్తి విషయం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment