వెంకటసుబ్బులు, మధురవాణి (ఫైల్)
ఆత్మకూరు: పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ తల్లి శ్మశానవాటికకు వెళ్లి శానిటైజర్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తల్లీ కూతురు మరణించగా కుమారుడు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. శ్రీపోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరులోని నవాబుపేట యనమలపాళేనికి చెందిన ఆదినారాయణ తన కుమార్తె వెంకటసుబ్బులు(27)ను తన అక్క కుమారుడైన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం పేర్లపేట గ్రామానికి చెందిన కొండ్రెడ్డి బాబుకి ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరికి మహేష్ బాబు (7), మధురవాణి (5) సంతానం.
బాబు కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగిరి గ్రామంలో పండ్ల తోట కౌలుకు తీసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం వెంకటసుబ్బులు పిల్లలతో కలిసి బళ్లారి నుంచి నెల్లూరుకు బయల్దేరింది. నెల్లూరుపాళెం సెంటర్‌లో శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో బస్సు దిగింది. సెంటర్‌లో టీ తాగి, అనంతరం వింజమూరు మార్గంలో ఉన్న ముస్లిం శ్మశానవాటికలోకి వెళ్లి పిల్లలతో పాటు తన ఒంటిపై శానిటైజర్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంకటసుబ్బులు, మధురవాణి మంటల్లో కాలి మరణించారు. తప్పించుకున్న మహేష్ బాబు భయంతో నెల్లూరుపాళెం సెంటర్‌కు పరుగెత్తాడు.
ఆ సమయంలో పొలాల్లోకి వెళ్తున్న వ్యవసాయ కూలీలు గమనించి కౌన్సిలర్ కామాక్షయ్యనాయుడుకు సమాచారం అందజేశారు. కౌన్సిలర్ స్థానికులతో కలిసి ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా అప్పటికే తల్లి, కుమార్తె మృతి చెంది ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సోమయ్య, ఎస్సై రవినాయక్ ఘటనా స్థలానికి చేరుకుని మహేష్ ద్వారా వివరాలు తెలుసుకుని బం«ధువులకు సమాచారం అందజేశారు. సొంత మేనల్లుడే తన అల్లుడని, కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవని మృతురాలి తండ్రి చెప్పాడు. ఇటీవల అల్లుడు మద్యానికి అలవాటు పడటంతో కుమార్తె వద్దని వారిస్తుండేదని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment