పకీర్‌ బాషా | Looking at Milton's side, he looked at the side of his side | Sakshi
Sakshi News home page

పకీర్‌ బాషా

Published Sun, Apr 29 2018 12:33 AM | Last Updated on Sun, Apr 29 2018 8:16 AM

Looking at Milton's side, he looked at the side of his side - Sakshi

అదొక్క సమాధే అక్కడెందుకు ఉందో తెలీదు. 
అయితే అక్కడ రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందనీ, 
ఎవరూ ప్లాట్‌లు కొనేందుకు రారనీ ప్రచారం జరుగుతోంది.

‘‘అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్లి, అక్కడ తెల్లగా సున్నం కొట్టిన సమాధిపై నిమ్మకాయ ఉంచి, ఆల్రెడీ ఆ సమాధిపై ఉన్న నిమ్మకాయను తీసుకొస్తాను. నాక్కొంత డబ్బు ఇప్పిస్తావా?’’ అన్నాడు మిల్టన్‌.. అవధానితో.. ఎండకు వగరుస్తూ వచ్చి. ఆ మాటకు అవధాని, మిల్టన్‌ వైపు చూడకుండా తన పక్కనే ఉన్న పకీర్‌బాషా వైపు చూశాడు. పకీర్‌బాషా ఒక్క క్షణం మిల్టన్‌ వైపు చూసి, వెంటనే అవధానిని చూశాడు. ఆ చూడ్డంలో.. ‘వీడెవడు.. వింత మనిషి’ అనే అర్థం ఉంది. అది పకీర్‌బాషా ఇల్లు. మిల్టన్‌ మొదట అవధాని ఇంటికి వెళ్లి.. అవధాని ఇంట్లో లేడు, పకీర్‌బాషా ఇంటికెళ్లాడని తెలుసుకుని, పకీర్‌బాషా ఎవరో, అతడి ఇల్లెక్కడుందో కూడా తెలుసుకుని నేరుగా అక్కడికే వెళ్లాడు. అంతగా అతడికి అవధాని అవసరం ఏదో పడినట్లుంది. అవధాని, మిల్టన్‌ స్నేహితులు. తనకు తెలియకుండా అవధానికి పకీర్‌బాషా అనే మనిషితో పరిచయం ఉందంటే..  ఆ పరిచయమేదో ఈ మధ్యే అయి ఉంటుందని మిల్టన్‌ ఊహించాడు. పకీర్‌బాషా ఇంకా అలాగే మధ్యమధ్యలో మిల్టన్‌ని చూస్తూ, అవధాని వైపు  చూస్తున్నాడు.. ‘వీడెవడు.. వింత మనిషి’ అన్నట్లుగానే. ‘ఇతనెవరో దెయ్యాల్ని పట్టే మనిషిలా ఉన్నాడే..’ అనుకున్నాడు మిల్టన్‌.. పకీర్‌బాషాను చూసి.  వాళ్లిద్దరికీ ఒకరికొకరు నచ్చలేదని అవధానికి అర్థమైంది. 
‘‘వీడు నా చిన్ననాటి ఫ్రెండు. మిల్టన్‌’’ అన్నాడు అవధాని పకీర్‌బాషాతో. 

‘‘రేయ్‌.. మిల్టన్, ఇతను పకీర్‌బాషా. ఇద్దరం కలిసి ఓ వెంచర్‌ చేస్తున్నాం. ఫైనల్‌ అయ్యాక నీకు చెబుదామనుకున్నాను’’ అన్నాడు అవధాని. చెప్పకపోయినా హర్ట్‌ అయ్యే మనిషి కాదు మిల్టన్‌. అతడి లోకంలో ఈ వెంచర్‌లు, అడ్వెంచర్‌లు ఉండవు. చిన్న ప్రాణి. అయినా మిల్టన్‌కు ఏదీ చెప్పకుండా ఉండడు అవధాని. కాస్త ముందో, వెనకో చెబుతుంటాడు. ఆ ఇద్దరి చిన్ననాటి స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. ‘‘ఎందుకురా అంత డబ్బు?’’ అన్నాడు అవధాని మిల్టన్‌తో. మిల్టన్‌ ఎప్పుడూ ఎంత అవసరమో చెప్పడు. అవసరం ఎంతటిదో చెబ్దాడు. ఇప్పుడూ అలాగే చెప్పాడు. అర్ధరాత్రి, శ్మశానం, తెల్లసున్నం, సమాధి, నిమ్మకాయ.. అన్నాడంటే.. అతడేదో చచ్చేంత అవసరంలో ఉన్నాడని. మిల్టన్‌ మితంగా బతికే మనిషి. చెయ్యి చాచాడూ అంటే.. బతుకు ఆ మాత్రం మితంగా కూడా అతణ్ణి ఉండనివ్వడం లేదనే అనుకోవాలి. మిల్టన్‌ బతుకులో మిల్టన్, అతడి భార్యా పిల్లలు మాత్రమే లేరు. మరికొందరికి కోసం కూడా అతడు రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన బాంధవ్యాలు ఉన్నాయి. ఆ బాంధవ్యాల గురించి బయటెక్కడా చెప్పుకోడు. పుట్టుకతో చెయ్యీ కాలూ ఉన్నట్లే తన బాధ్యతల్ని కూడా దేహావయవాలే అనుకుంటాడు. కాలు, చెయ్యి ఉన్నవాళ్లు తమకు కాలుందనీ, చెయ్యుందనీ చెప్పుకుంటారా?! అలాగే తనకు బాధ్యతలు ఉన్నాయని మిల్టన్‌ చెప్పుకోడు. అలాంటి మిల్టన్‌కి అకస్మాత్తుగా కొంత డబ్బు కావలసి వచ్చింది. ఎంత డబ్బో అతడు చెప్పలేదు. కొంత అన్నాడు. ఆ కొంత ఒక కోటి అయినా, చిన్న నోటే అయినా.. అతడు మళ్లీ తీర్చలేడు. తీర్చడానికి అసలు అతను అప్పుగా ఇవ్వమని అడగడు. పని చేసిపెడతానంటాడు. పని చేశాకే  చెయ్యి చాపుతాడు. 

‘‘సరే చూద్దాంలేరా..’’ అని మిల్టన్‌కి చెప్పి పంపాక, మిల్టన్‌ గురించి పకీర్‌బాషాకు ఈ విషయాలన్నీ చెప్పాడు అవధాని. ‘‘ఎంత అడుగుతున్నాడని ఇప్పుడు మనం అనుకోవాలి?’’ అన్నాడు పకీర్‌బాషా ఆశ్చర్యంగా.‘‘ఎంతైనా అవొచ్చు’’.‘‘తెలిస్తేనే కదా ఇవ్వగలం’’‘‘వాడికీ తెలీదు. పని తీసుకుంటాడు. చేశాక ఇచ్చింది తీసుకుంటాడు’’ ‘‘ముందైతే డబ్బు తీసుకో. పనేదైనా ఉన్నప్పుడు వచ్చి చేసుకో అంటే?’’‘‘పండించకుండా తిండి తినే హక్కు తనకు లేదంటాడు’’‘వింత మనిషే’ అనుకున్నాడు పకీర్‌బాషా. ‘‘సరే.. చెప్పు. నా దగ్గర పనుందని నీ ఫ్రెండుకి చెప్పు’’ అన్నాడు. ‘‘ఏ పని?’’ అన్నాడు అవధాని.‘‘అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్లి, అక్కడ తెల్లగా సున్నం కొట్టిన సమాధిపై నిమ్మకాయ ఉంచి, ఆల్రెడీ ఆ సమాధిపై ఉన్న నిమ్మకాయను తీసుకురావాలి’’ అన్నాడు పకీర్‌బాషా. 

పెద్దగా నవ్వాడు మిల్టన్‌. ‘‘పకీర్‌బాషాగారు.. మా అవధాని మీకు చెప్పే ఉంటాడు. డబ్బు నాకు ఎంత అవసరమో చెప్పడానికి ‘శ్మశానంలోకైనా వెళ్లొస్తానని’ నేను అంటుంటానే కానీ, నిజానికి నాకదేం పెద్ద పని కాదు. అది మీకు పనికొచ్చే పనైతే నాకూ సంతోషంగా ఉంటుంది. నా సంతోషం కోసం మీరొక పని సృష్టించడం నాకేమాత్రం ఆనందాన్నివ్వదు’’ అన్నాడు మిల్టన్‌. ఆ మాట నిజం. మిల్టన్‌ ఏమిటో తెలిశాక, అతడికి ఏదో ఒక విధంగా డబ్బు సాయం చేయాలని మాత్రమే పకీర్‌బాషా అనుకున్నాడు. అలా అని మిల్టన్‌తోనూ అనలేదు, అవధానికీ చెప్పలేదు. ‘‘నీ ధైర్య సాహసాలతో నాకు పన్లేదు మిల్ట . పని కావాలంటున్నావు కాబట్టి నా దగ్గర ఉన్న పనేమిటో చెబుతున్నాను. మేము మొదలుపెడుతున్న వెంచర్‌లో ఓ సమాధి ఉంది. అదొక్క సమాధే అక్కడెందుకు ఉందో తెలీదు. అయితే అక్కడ రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందనీ, ఎవరూ ప్లాట్‌లు కొనేందుకు రారనీ ప్రచారం జరుగుతోంది. నువ్వొకసారి వెళ్లొస్తే, అక్కడేం లేదని జనానికి తెలిస్తే మంచిదే కదా’’ అన్నాడు పకీర్‌బాషా.  ఆ రాత్రి ఒక్కడే.. వెంచర్‌లో సమాధి ఉందని పకీర్‌బాషా చెప్పిన చోటుకు వెళ్లొచ్చాడు మిల్టన్‌. ఆ ఉదయాన్నే మంచం పట్టాడు! అక్కడేం జరిగిందీ అతడు ఎవరికీ చెప్పలేదు. అసలు అక్కడికి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ చెప్పలేదు. పకీర్‌బాషా ఇంటికొచ్చి మరీ మిల్టన్‌కు డబ్బు ఇచ్చి వెళ్లాడు. అతడు వెళ్తుంటే వెనక్కు పిలిచి మెల్లిగా చెప్పాడు.. మిల్టన్‌. ‘‘నిజమే. ఉంది’’ అన్నాడు. ‘‘ఎలా తెలిసింది?’’.. అడిగాడు పకీర్‌బాషా. ‘‘ఆ దెయ్యం నాకు సమాధి కూడా కనిపించకుండా చేసింది’’ అన్నాడు మిల్టన్‌ సన్నగా మూలుగుతూ. పకీర్‌బాషా బయటికి వస్తూ చిన్నగా నవ్వుకున్నాడు.

- మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement