
వల్లకాట్లో కొత్త సంవత్సరం..!
లండన్: కొత్త ఆశలు, ఆశయాలతో మొదలయ్యే న్యూ ఇయర్ సంబరాలను బంధుమిత్రులతో కలసి ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీ. అలాంటి శుభ వేడుకను ‘ఊరంతా ఒకదారి, ఉలిపికట్టెది మరొకదారి’ అన్నట్లు వల్లకాట్లో జరుపుకుంటే? వింతల్లో వింతేగా మరి. అందుకే ఈ ఉల్టా వ్యవహారం ప్రపంచ వింత ఆచారాల జాబితాలో తొలిస్థానం దక్కించుకుంది. బాదూ అనే సోషల్ వెబ్‌సైట్ ఆన్‌లైన్ సర్వే ద్వారా ఈ జాబితాను రూపొందించింది. చిలీ మధ్యభాగంలోని తాల్కా నగర ప్రజలు జనవరి 1న శ్మశానంలోకి వెళ్లి, చచ్చిపోయిన తమ బంధుమిత్రుల సమాధుల మధ్య తిష్టవేసి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. బాదూ సర్వేలో పాల్గొన్న నెటిజన్లు ఈ వింతకు విస్తుబోయి అందలమెక్కించారు. 18 దేశాల ఆచారాలపై నవంబర్, డిసెంబర్‌లలో నిర్వహించిన ఈ సర్వేలో దేశానికి 400 మంది చొప్పున 7,500 మంది పాల్గొన్నారు. టాప్ 10లో నిలిచిన వింత ఆచారాల్లో మిగతా తొమ్మిది వరుసగా..
జంతువుల ‘మాటలు’ వినేందుకు ప్రయత్నించడం. మాటలు అర్థం కాకపోతే శుభసూచకమట(రుమేనియా) దుష్టశక్తులను తరిమికొట్టేందుకు బ్రెడ్లను గోడలకేసి కొట్టడం(ఐర్లాండ్) కిటికీలోంచి బల్లలు, కుర్చీలు బయటకు విసిరేయడం(జొహన్నెస్‌బర్గ్-దక్షిణాఫ్రికా) చెట్టును చేతిలో ఉంచుకుని గడ్డకట్టిన సరస్సులోకి డైవింగ్ చేయడం(సైబీరియా) కిక్కిరిసిన జనం మధ్యలోకి పైనుంచి పోజం (పిల్లిజాతి జంతువు)ను జారవిడవడం(అమెరికా) పాత కక్షలను పిడిగుద్దులతో తీర్చుకోవడం(పెరూ) అగ్నిగోళాల(ఫైర్‌బాల్స్) మధ్య వీధిలో పరిగెత్తడం(స్కాట్లాండ్) ఒంటరిగా భోంచేయడాన్ని చిత్రించిన పాత బ్రిటిష్ టీవీ కామెడీ షోను చూడడం(జర్మనీ) వాటర్ బెలూన్లు, బకెట్లతో మూడు రోజులపాటు ‘వాటర్ ఫైట్’ చేసుకోవడం (థాయ్‌లాండ్).