న్యూ’ జోష్!
గ్రేటర్‌లో న్యూ ఇయర్ సందడి షురూ
భారీగా ఏర్పాట్లు..వెయ్యి చోట్ల ఈవెంట్స్
మద్యం అమ్మకాలు రూ.100 కోట్లకు పైనే?
సిటీబ్యూరో: కొత్త సంవత్సరం వేడుకలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దుర్గంచెరువు, హైటెక్‌సిటీ, శిల్పకళావేదిక, హైటెక్స్ నోవాటెల్ సహా నగరంలోని పలు పబ్‌లు, రిసార్టులు జోష్ పార్టీలకు వేదికకానున్నాయి. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో మహానగరంలో సుమారు వెయ్యి ఈవెంట్స్ జరగనున్నాయి. గ్రాండ్ పార్టీలు, మ్యూజికల్ రాక్‌నైట్స్, డీజే స్పెషల్స్ తదితర ఈవెంట్లకు సంబంధించిన ప్రచారాలు ఇప్పటికే హోరెత్తుతున్నాయి.
జోష్ పార్టీలకు జై..
దుర్గం చెరువుతోపాటు తాజ్ బంజారా, మౌర్యాస్ తదితర ప్రాంతాల్లో రాక్, పాప్‌నైట్స్ నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు సెలబ్రిటీ డీజే, వీజేలు పాల్గొననున్నారు. మౌర్యాస్‌లో బాలివుడ్ డీజే లెమన్,అంతర్జాతీయ డీజే కేథరిన్‌లు తమ ఆటపాటలతో హుషారెత్తించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో డీజే అఖిల్, ఆస్ట్రేలియా డీజే రోహిత్‌లు సందడి చేయనున్నారు. ఈవెంట్, అందులో ప్రదర్శన ఇవ్వనున్న డీజే,వీజేల స్థాయిని బట్టి ఇందులో ప్రవేశం పొందేవారి నుంచి ఒక్కొక్కరికి రూ.రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు చేయనున్నట్లు ఈవెంట్స్ నిర్వాహకులు తెలిపారు.
గతేడాది రూ.100 కోట్ల మద్యం విక్రయాలు
మహానగరంలో కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు గతేడాది డిసెంబరు 31తోపాటు జనవరి 1వ తేదీల్లో వెయ్యికి పైగా జోష్ పార్టీలు నిర్వహించారు. ఈ పార్టీల్లో మద్యం ఏరులై పారింది. గ్రేటర్ పరిధిలో ఈ రెండు రోజులే సుమారు వందకోట్ల విలువైన లిక్కర్ అమ్ముడైనట్లు నగర ఆబ్కారీశాఖ లెక్కలు వేసింది. డిసెంబరు 31న సుమారు రూ.60 కోట్లు జనవరి 1న మరో రూ.40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అంచనా వేశారు. ఈ వేడుకల్లో ఐఎంఎల్ మద్యం ఐదు లక్షల లీటర్లు, నాలుగు లక్షల లీటర్ల బీరును మందు బాబులు తాగేసినట్లు తెలిసింది. ఇక ఈ ఏడాది సుమారు రూ.110 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగనున్నట్లు ఆబ్కారీశాఖ అంచనా వేస్తోంది. . సాధారణంగా రోజువారీగా రెండు జిల్లాల పరిధిలో నిత్యం సుమారు 25 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయని..కానీ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో అమ్మకాలు రెట్టింపయ్యే అవకాశాలుంటాయని తెలిపింది.