సాక్షి, సిద్దిపేట : కాలం మారింది.. పెద్ద ఎత్తున టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయినా కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజల్లో బలంగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి శ్మశానం వైపు వెళ్లకూడదు. అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అంటూ ఉంటారు. అయితే అలాంటి వారికి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడానికి జన విజ్ఞాన వేదిక నడుంకట్టింది. వాటిపై ప్రజల్లో ఉన్న భ్రమలను, భయాలను తొలగించడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు.
పోలీసుల సహకారంతో అభ్యుదయ వాదులు అర్ధరాత్రి సమయంలో సిద్దిపేట బైపాస్ రోడ్డులో ఉన్న శ్మశానవాటికలో గురువారం( అమావాస్య) రాత్రి అక్కడే గడిపారు. పోలీసులు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు అర్ధరాత్రి వేళ శ్మశాన వాటికలో కలియ తిరిగారు. అంతేకాకుండా శవాలను తగుల పెట్టే చోట అల్పాహారం తిన్నారు. అమావాస్య, పౌర్ణమిలు అంటే ఖగోళంలో వచ్చే మార్పులేనని, వాటిని నమ్మి మూఢనమ్మకాలకు పోవద్దని ప్రజలకు వివరించారు. మనుషులు శాస్త్రీయ పద్ధతుల్లో జీవించాలని అంతేకానీ, మూఢనమ్మకాలు జోలికి నమ్మొద్దంటూ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment