‘‘బ్రేకప్‌కి ముందు నిన్నొక మనిషిగా నేను ప్రేమించాను. బ్రేకప్ అయ్యాక నేనొక మనిషినై నిన్ను ప్రేమిస్తున్నాను.’’ ‘‘గాడ్.. ఆపుతావా! వద్దనుకున్నాం కదా విహాన్.. నాకు నువ్వు. నీకు నేను. నీ మాటలు నాకు అర్థం కావు. మాటలే అర్థం కానప్పుడు మనిషితో రిలేషన్ నిలుస్తుందా చెప్పు’’.. తల పట్టుకుంది. మణిచందన. ‘‘నాకూ ఇష్టం లేదు చందనా నువ్వంటే. కానీ నిన్ను ప్రేమిస్తున్నా. ఇష్టాన్నీ, ప్రేమను వేరు చేసి చూడలేవా నువ్వు?’’ ‘‘చంపుతున్నావ్ విహాన్. ఇష్టాన్నీ, ప్రేమను వేర్వేరుగా ఎలా చూస్తారు చెప్పు?’’ ‘‘ఎలానా?! నేనంటే నీకు ఇష్టం లేదు. నువ్వంటే నాకూ ఇష్టం లేదు. మన ఇష్టాల్ని పక్కన పడేద్దాం. ప్రేమకు ఇష్టాలు ఉండవా? వాటిని మనం గౌరవించలేమా చందనా?’’ ‘‘ప్రేమకు ఇష్టాలేంటి విహాన్? మనుషులకు కదా ఉండేది ఇష్టాలైనా, ప్రేమలైనా?’’‘‘పొరపాటు చందనా. ప్రేమ నన్ను ఎంపిక చేసుకుంది నిన్ను ఇష్టపడమని. అదే ప్రేమ నిన్ను ఎంపిక చేసుకుంది.. నాపై నీ ఇష్టాన్ని తెంపేసుకోమని’’‘‘అంటే.. విహాన్?!’’ ‘‘మన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా.. మనల్ని కలపడానికో, విడదీయడానికో ప్రేమ మన ఇద్దరినీ ఒక సెట్‌గా ఎంపిక చేసుకుంది చందనా’’ అన్నాడు విహాన్. చందన భయపడింది.
‘‘విహాన్.. మనం ఎందుకు విడిపోయామో తెలుసా? ఇదిగో ఈ క్యాచ్ ట్వంటీటూ లాంగ్వేజ్ నాకు అర్థం కాకనే! నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడలేవా విహాన్. ఇప్పుడైనా, విడిపోయాకైనా..’’ వేడుకుంటోంది చందన. ‘‘ఓకే చందనా. నువ్వు నన్ను ప్రేమించొద్దు. కానీ నేనింకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానని నువ్వు తెలుసుకుంటే చాలు నాకు’’. ‘‘అప్పుడేమౌతుంది విహాన్?’’ ‘‘ఏం కాదు. ఏం కాకపోవడమే కదా మీ అమ్మాయిలకు కావలసింది. ఏం కాదు కాబట్టే కాఫీ తాగడానికి వస్తారు. ఏం కాదు కాబట్టే మాటల వరకు వస్తారు. ఏం కానంత వరకూ.. ఎంత దూరమైనా వస్తారు’’.‘‘ఇప్పుడు నీకేం కావాలి విహాన్?’’ ‘‘నాకేం కావాలి అని అడక్కు చందనా. నా ప్రేమకు ఏం కావాలీ అని అడుగు.’’ ‘‘సరే.. నీ ప్రేమకు ఏం కావాలట?’’ ‘‘నీ చెంప పగలగొట్టాలట! కొట్టేదా?’’ అన్నాడు విహాన్. ‘‘నిజంగా ప్రేమ ఉన్నవాళ్లు అడిగి ఏదీ చెయ్యరు విహాన్. నా బర్త్‌డేకి గిఫ్ట్ ఇచ్చావు. అడిగే ఇచ్చావా?’’. పెద్దగా నవ్వాడు విహాన్. చందన కూడా నవ్వింది. విహాన్ చందనను దగ్గరకు తీసుకునేలోపే, చందన విహాన్ గుండెల్లోకి వెళ్లిపోయింది. నూటా నలభై మూడోసారి వాళ్లలా కలుసుకోవడం.
‘‘ఏంటి చందనా నాతో మాట్లాడవు?! మొహం మొత్తేశానా? ఇంకెవడినైనా లవ్ చేస్తున్నావా? చెప్పు మీ ఇద్దరికీ పెళ్లి చేసేసి, నేను తప్పుకుంటా. నా ఫోన్‌లో నీ నెంబరు కూడా ఉంచుకోను. డిలీట్ చే సేస్తా’’.
‘‘పెళ్లి మేమిద్దరం చేసుకుంటాం కానీ, నువ్వు నా నెంబరు డిలీట్ చేస్కో... చాలు.’’‘‘ఎవడు వాడు?’’‘‘నువ్వే చెప్పాలి ఎవడో వాడు. అన్నావ్ కదా.. ఇంకెవడినో లవ్ చేస్తున్నానని!’’‘‘సారీ.. ఏమైంది చెప్పు’’‘‘అయిందని నేను చెప్పానా?’’‘‘మాట్లాడ్డానికి ఏమయ్యిందీ అంటున్నా చందనా.. నీకేదో అయిందని కాదు?’’‘‘నాకు స్పేస్ కావాలి విహాన్. కొన్నాళ్లు నీ నుంచి స్పేస్ కావాలి’’ ‘‘వాట్’’ అన్నాడు విహాన్.‘‘ఎస్’’ అంది చందన.‘‘నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా నుంచి స్పేస్ కోరుకుంటావా చందనా. నీ జీవితానికి నేను అంత ఇరుకైపోయానా?’’‘‘నిజంగా నిన్ను ప్రేమించాను కనుకే.. నువ్వు నాకు ఇరుకైపోయావని నీతో మాత్రమే చెప్పుకోగలుగుతున్నాను విహాన్’’‘‘నువ్విప్పుడు మాట్లాడేది క్యాచ్ ట్వంటీటూ లాంగ్వేజ్ కాదా చందనా?’’ ‘‘ఏ లాంగ్వేజో నాకు తెలీదు. అర్థం అయ్యేలా చెప్పగలిగానని మాత్రం అనుకుంటున్నా. నీ ప్రేమ బరువును నేను మోయలేకపోతున్నాను విహాన్’’.‘‘చావు’’ అన్నాడు విహాన్. మూడొందలా నలభై ఒకటోసారి వాళ్లలా విడిపోవడం. ‘‘అబ్బ.. చంపుతున్నావ్ విహాన్. ఇష్టాన్ని, ప్రేమను వేర్వేరుగా చూసి ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పు. చచ్చిపోనా? ఎప్పుడూ అంటూంటావుగా చావమని’’ అంది చందన. ‘‘చచ్చిపోవద్దు’’ ‘‘మరి!’’ ‘‘బతికించు’’ ‘‘ఎవర్ని?!’ ‘‘నన్నే’’ ‘‘బాగానే ఉన్నావ్‌గా, నన్ను చంపుకు తినడానికి. ఇంకా ఏం బతికించాలి నిన్ను’’.‘‘మనిషిగా నన్ను బతికించు చందనా. ప్లీజ్.
ఏడుస్తోంది చందన. విహాన్ సమాధి పక్కనే కూర్చొని. ‘‘వెళ్దాం పద.. చీకటి పడుతోంది’’ అంది యోగిత. ఇద్దరూ నడుస్తున్నారు. ‘‘మనిషిగా బతికించమని అంటే ఏంటి చందనా?! విహాన్ ఎందుకలా అన్నాడు’’
‘‘తెలీదు యోగిత. కానీ మనిషిగా ఉన్నప్పుడు మాత్రం విహాన్ అలా అనలేదు.’’ ఉలిక్కిపడింది యోగిత. ‘‘అంటే..?! ‘‘ఆ రోజు ఇద్దరం బాగా గొడవ పడ్డాం. ఎప్పుడూ నన్ను చావు.. చావు.. అనేవాడు. ఆరోజు మాత్రం ఫస్ట్ టైమ్ నేను అన్నాను విహాన్‌ని చావమని’’. కన్నీళ్లు ఆగట్లేదు చందనకి. ‘‘ఊరుకో చందనా.. ప్లీజ్’’ అంటోంది యోగిత. ‘‘చావమనగానే చావడానికి వెళ్లిపోయాడు స్టుపిడ్. చచ్చిపోయాక వచ్చి బతికించమన్నాడు. ఇప్పుడు కూడా వాడు ఇక్కడ ఎక్కడో నా పక్కనే ఉండి ఉంటాడు. బతికించు చందనా.. బతికించు చందనా.. అని బెగ్ చేస్తూ ఉండి ఉంటాడు’’.. ఏడుస్తోంది చందన. ‘‘ఆత్మలు నిజంగానే ఉంటాయంటావా చందనా?’’ అడిగింది యోగిత, చందన చేతిని గట్టిగా పట్టుకుంటూ. చందన వెనక్కి తిరిగి విహాన్ సమాధి వైపు చూసింది. ‘‘తెలీదు యోగితా. కానీ ప్రేమ ఉంటుంది’’ అంది.
నూటా నలభై మూడోసారి
Published Sun, Dec 3 2017 12:08 AM | Last Updated on Sun, Dec 3 2017 1:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment