సమాధిలోంచి తమ్ముడికి ఫోన్ చేయడంతో..
మాస్కో: ఆర్థిక వ్యవహారాల్లో నెలకొన్న విభేదాల కారణంగా రష్యాలో ఓ వ్యాపారవేత్తను బతికుండగానే శ్మశానంలో పాతిపెట్టారు. సమయానికి తమ్ముడు స్పందించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
వివరాలు.. వ్యాపార భాగస్వాములకు 30 మిలియన్ రూబుల్స్‌ను చెల్లించే విషయంలో నెలకొన్న వివాదంతో ఖిక్‌మెట్ సలేవ్(41) అనే వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతడిని మాస్కోలోని ల్యూబర్టీ శ్మశానవాటికకు తీసుకెళ్లి సజీవంగా పాతిపెట్టారు. అయితే.. అతడితోపాటు సెల్‌ఫోన్‌ను మాత్రం ఉండనిచ్చారు. దీంతో సమాధిలో నుంచి ఖిక్‌మెట్ అతికష్టం మీద తన తమ్ముడు ఇస్మాయిల్‌కు ఫోన్‌చేశాడు.
1.2 మిలియన్ రూబుల్స్‌తో పాటు తన బీఎండబ్ల్యూ 535 మోడల్ కారును కూడా ఖిక్‌మెట్ బిజినెస్ పార్ట్‌నర్‌లకు ఇచ్చిన తరువాతే ఇస్మాయిల్‌కు సమాధి ఎక్కడుందో తెలిసింది. అప్పటికే 4 గంటలు సమాధిలో ఉన్న ఖిక్‌మెట్‌ను ఇస్మాయిల్ బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దుండగుల దాడిలో కొన్ని పక్కటెముకలు విరిగిన ఖిక్‌మెట్ కోలుకుంటున్నాడు. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న గ్యాంగ్‌స్టర్‌ల ఆగడాలపై స్థానిక మీడియా తీవ్రంగా విరుచుకుపడుతోంది.