అనంతపురం,అమడగూరు: చీకిరేవులపల్లిలో వరుసకు అన్నాచెల్లెలైన పాళెం నరేష్, నయన ఆదివారం రాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. బాధితుల చిన్నాన్న రామచంద్ర తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నరేష్ కర్ణాటకలోని చింతామణిలో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. నయన అనంతపురంలో డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతోంది. పది రోజుల క్రితం వీరి తాత చనిపోయాడు. ఇందులో భాగంగానే ఆదివారం దినాల కోసం అన్నా, చెల్లెలు గ్రామానికి వచ్చారు. కార్యక్రమం ముగించుకుని రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇద్దరూ ఒక ద్విచక్రవాహనంలో, అలాగే తనకల్లు మండలం గంధోడివారిపల్లికి చెందిన బంధువులు ఇద్దరు మరొక ద్విచక్ర వాహనంలో గంధోడివారిపల్లికి బయలుదేరారు.
మార్గమధ్యంలో గంధోడివారిపల్లికి చెందిన వారు ద్విచక్రవాహనం కాస్త ముందుగా వెళ్లి కొక్కంటి క్రాస్‌లో ఆపారు. అయితే అన్నాచెల్లెలు వస్తున్న ద్విచక్రవాహనం రాకపోగా ముందు వెళ్లిన వారు మళ్లీ అదే దారి గుండా ఐదు కిలోమీటర్లు వెనక్కు వచ్చారు. ఎక్కడా కనపడకపోవడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఇంతలో నయన సెల్ నుంచి చిన్నాన్న రామచంద్రకు కాల్ వచ్చింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేయగా ‘మేము కిడ్నాపర్లం, మీ పిల్లలను ఏమీ చేయం, కావాలంటే మీ పాపతో మాట్లాడండి’ అని నయనతో మాట్లాడించి ఫోన్ లాక్కున్నారు. ‘మీరు చాలా పేద కుటుంబాలకు చెందిన వారని మీ పిల్లలు చెప్తున్నారు కాబట్టి రూ.80 వేలు తీసుకుని నేను చెప్పిన ప్రాంతానికి రండి. నీకు మరో పది నిమిషాల్లో కాల్ చేస్తాం’ అంటూ ఫోన్ పెట్టేశారు. అయితే రామచంద్ర మాట్లాడుతూ ఫోన్‌లో మాట్లాడిన వారి భాషను బట్టి కర్ణాటక ప్రాంతానికి చెందిన వారే తమ పిల్లలను కిడ్నాప్ చేసుంటారని అనుమానం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment