మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్‌లతో పోలీసులు శుక్రవారం అరెస్టు చూపించిన కిడ్నాప్ ముఠాలో ఏ1 నిందితుడు భాస్కర్‌నాయుడు, పార్థసారధి, నారాయణస్వామి
ధర్మవరంలో గత మే నెల ఓ భూ దందాకు సంబంధించి వెంకటేశ్ అనే వ్యక్తి విషయంలో ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి, మంత్రి పరిటాల సునీత వర్గీయుల మధ్య వివాదం నడిచింది. ఓ వర్గం నేతలు వెంకటేశ్‌ను కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
బెంగళూరుకు చెందిన సలీమ్ అనే వ్యక్తిని ఓ ప్రజాప్రతినిధి అనుచరులు అనంతపురం సమీపంలో బెంగళూరు హైవేపై కిడ్నాప్ చేశారు. ఈ వ్యక్తులు రెండు రోజుల పాటు సలీం అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో నగదును తమ అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందనే ఆలోచన కూడా కిడ్నాపర్లకు లేకపోయింది. కారణం.. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కుమారుని అండదండలే.
... ఈ రెండు ఉదాహరణలే కాదు, ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే జిల్లాలో పాలేగాళ్ల రాజ్యం సాగుతోందా? అనే అనుమానం కలుగక మానదు. ఇదే సమయంలో నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన పోలీసుల తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏ నలుగురు గుమికూడినా అధికార పార్టీ దందాలపర్వమే చర్చనీయాంశం. టీ కొట్టులోకి తొంగి చూసినా.. కిడ్నాప్ వ్యవహారాలే పొగలు కక్కుతుంటాయి. ఇక పోలీసుల పనితీరు చెప్పనక్కర్లేదు. పోలీసుస్టేషన్‌కు వెళితే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోంది. అంతకన్నా.. ఏ నాయకుని కాళ్లో పట్టుకుంటే డబ్బయినా మిగులుతుందనే భావన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ సాగిస్తున్న దందాలతో జిల్లా అట్టుడుకుతోంది. అస్మదీయులకుమేలు చేకూర్చేందుకు.. ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతకైనా బరితెగిస్తుండటం చూస్తే పోలీసులు ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఎంతో ఆశతో పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కితే.. ఒక్క ఫోన్ కాల్‌తో ‘అన్యాయం’ ఇంతెత్తున లేచి పడుతోంది. జీ..హుజూర్ అంటూ నాలుగో సింహం కూడా వంగి వంగి దండాలు పెట్టడం ఖాకీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది.
ఆ మూడు నియోజకవర్గాల్లో మరీ దారుణం
ధర్మవరం, తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాలు జిల్లాలో మరింత భిన్నం. ఏదైనా సహాయం కోసం, వివాదాలతో న్యాయం చేస్తారని స్థానిక ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తారు. కానీ వారే దందాలకు తెగబడటం, సాయం చేసినందుకు భారీగా డబ్బు డిమాండ్ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. కొంతమంది తప్పని పరిస్థితుల్లో నేతలు చెప్పినట్లే వింటున్నారు. పోలీసుస్టేషన్‌కు వెళితే వారికి అక్కడి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎలా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తే ఆ విధంగానే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సామాన్యులకు ఇటు ఎమ్మెల్యేలపైన, అటు పోలీసుల పట్ల పూర్తిగా నమ్మకం సన్నగిల్లింది.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా
సలీం వ్యవహారంలో ధర్మవరానికి చెందిన భాస్కర్‌నాయుడు, సలీంలు ఇద్దరూ ‘రైస్‌పుల్లింగ్’ బిజినెస్ చేసేవారని తెలుస్తోంది. ఈ వ్యవహారం కొద్దిరోజులుగా సాగుతోంది. కిడ్నాప్ వ్యవహారంలో ఇదే కీలకం. ఈ ప్రాంతాల్లో భూ దందాలైతే చెప్పాల్సిన పనిలేదు. ప్రజాప్రతినిధులు, వారి బంధువులు ప్రాంతాలను భాగాలుగా పంచుకుని దందాలు చేస్తున్నారు. ‘భూ దందా’లకు సంబంధించి ప్రతీ పోలీసుస్టేషన్‌కు బాధితులు వస్తున్నారు. వీరిలో అధికారపార్టీ సిఫార్సుకే పెద్దపీట వేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment