టూటౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
అనంతపురం సెంట్రల్: న్యాయానికి అండగా నిలవాల్సిన పోలీసులు...చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటి సంఘటనే మంగళవారం అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో జరిగింది. హైదరాబాదుకు చెందిన కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేశారని ముగ్గురు యువకులను టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని మీడియా ఎదుట చెప్పిన కాంట్రాక్టర్.. ఆ తర్వాత అధికారపార్టీ నేతల బెదిరింపులతో మధ్యాహ్నానికి మాట మార్చాడు. దీంతో పోలీసులు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుని కుమారుడు నిఖిల్‌రెడ్డి, అనుచరులు హరిప్రసాద్, భరత్‌కుమార్, శ్రీనివాసులుపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఉరవకొండ ఎమ్మెల్సీ కేశవ్ ప్రోద్భలంతోనే అక్రమ కేసు బనాయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ఆరోపించారు.
అసలేం జరిగిదంటే...
హైదరాబాద్‌కు చెందిన క్రాంతి ఎడిఫ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ ప్రతాప్‌రెడ్డి సోమవారం జిల్లాకు వచ్చారు. నల్గొండ జిల్లా దేవరకొండ వద్ద ఎస్‌సీబీసీ కెనాల్ వర్క్‌ను సబ్‌కాంట్రాక్ట్ పనులను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడు నిఖిల్‌రెడ్డి చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి దాదాపు రూ.1.50 కోట్ల నగదు లావాదేవీలపై సోమవారం సాయంత్రం స్థానిక సూరజ్ గ్రాండ్ హోటల్‌లో చర్చించారు. రాత్రి బస చేసిన ప్రతాప్‌రెడ్డి మంగళవారం నాటకీయ పక్కీలో కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. తనను నిఖిల్‌రెడ్డి, హరిప్రసాద్, శ్రీనివాసులు కిడ్నాప్ చేస్తున్నారని పోలీసులకు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వీరు ప్రయాణిస్తున్న కారును కూడేరులో అడ్డుకున్నారు. ఆ సమయంలో నిఖిల్‌రెడ్డి లేకపోయినప్పటికీ ఆయన పేరు కూడా నమోదు చేయించారు. కంపెనీ ప్రతినిధి ప్రతాప్‌రెడ్డితో పాటు ఉన్న నిఖిల్‌రెడ్డి అనుచరులైన హరిప్రసాద్, భరత్‌కుమార్, శ్రీనివాసులును కూడేరు పోలీసులు అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
డబ్బు అడిగిన పాపానికి కిడ్నాప్ కేసు
కాంట్రాక్ట్ పనుల్లో డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు కిడ్నాప్ కేసు నమోదు చేస్తారా అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ మంగళవారం రాత్రి టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఒత్తిళ్లకు తలొగ్గిన టూటౌన్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని హైదరాబాదుకు పంపించి తమ పార్టీ వారిపై అక్రమంగా కిడ్నాప్ కేసు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు. తమను కూడా కులంపేరుతో దూషించాడని బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఈ ఘటనలో న్యాయం జరగకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కుమ్మతి హనుమంతరెడ్డి, విద్యార్థి విభాగం ఎస్కేయూ అధ్యక్షుడు భానుప్రకాష్, పలువురు ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment