ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ప్రతిపాదిత స్థలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాధి
సాక్షి, చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనాకేంద్రం ప్రతిపాదిత స్థలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట గుర్తు తెలియని వ్యక్తులు సమాధి కట్టడం కలకలం రేపింది. బుధవారంరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మట్టితో సమాధిని కట్టి, పూలదండలు వేసి, జేపీ నడ్డా ఫొటో పెట్టి, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం అంటూ ఫ్లెక్సీ పెట్టారు. గురువారం ఉదయం పోలీసులు దీనిని తొలగించారు. ఈ ఉదంతంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక బీజేపీ నాయకులు సంఘటనాస్థలానికి వెళ్లి ఇది అధికార పార్టీ పనేనని మండిపడ్డారు. పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఫ్లోరైడ్ బాధితులే ఈ పనిచేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నా, ప్రత్యర్థి పార్టీలే ఈ పని చేసి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, కొన్నేళ్ల క్రితం జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో మర్రిగూడ మండలంలో పర్యటిస్తూ ఫ్లోరైడ్ బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. తదనంతర పరిణామాల్లో ఈ కేంద్రం పశ్చిమబెంగాల్‌కు తరలిపోయింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నడ్డా పేరిట సమాధి కట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment