విశ్వాసి నిప్పులా బతకాలి
సువార్త
బేతనియలో యేసు గొప్ప అద్భుతం చేశాడు. ఆయనకు ఎంతో దగ్గరి వాడైన లాజరు చనిపోగా అతని సోదరీమణులైన మరియ, మార్తను పరామర్శించేందుకు యేసు ఆ గ్రామానికొచ్చాడు. అంతేకాదు, నేరుగా లాజరు సమాధి వద్దకు వెళ్లి ‘లాజరూ! బయటికి రా!’అని పిలవగా అప్పటికే చనిపోయి నాలుగురోజులైన లాజరు సజీవుడై బయటికొచ్చాడు. గొర్రెలమందను కాసే కాపరుల్లో, జీతగాళ్లుంటారు. వాటి యజమానులు కూడా ఉంటారని, మందపై తోడేళ్లు దాడి చేస్తే, జీతగాడు ప్రాణభయంతో వాటిని వదిలి పారిపోతాడని, యజమానుడైన కాపరి మాత్రం తన ప్రాణాలొడ్డి వాటితోనే పోరాడి మందను కాపాడుకుంటాడని, తాను కూడా యావత్ మానవాళి రక్షణకోసం ప్రాణార్పణ చేయబోతున్న ‘పరమ కాపరి’నని కొద్దిరోజుల క్రితమే ఆయన చేసిన సంచలన బోధ విని ఛాందస యూదులాయన్ను రాళ్లతో కొట్టబోయారు. ‘‘నీవు మంచి కాపరివి, మేము పారిపోయే జీతగాళ్లమా?’’ అంటూ ఆయన మీద వ్యసన పడ్డారు. (యోహాను 10వ అధ్యాయం) రాళ్లతో కొడితే చనిపోవడానికి తాను అందరివాyì లాగా మానవమాత్రుణ్ణి కానని, తానే స్వచ్ఛందంగా ప్రాణ ం పెట్టబోతున్నానని వారికి యేసు స్పష్టం చేశాడు (10:18). ఈ సంచలనాత్మక బోధతో ఆయనకు ఛాందస యూదుల్లో చాలామంది శత్రువులయ్యారు కానీ సామాన్యుల్లో అంతకన్నా ఎక్కువమంది అనుచరులు, మిత్రులయ్యారు (10:42). తాను మాట్లాడిన ప్రతి మాటనూ ఆచరణలో రుజువు చేసే యేసు, మరణం మీద తనకున్న దైవాధికారాన్ని వెల్లడించేందుకే బేతనియలో లాజరుని ఆ తర్వాత కొద్దిరోజులకే సజీవుణ్ణి చేశాడు. ఆ తర్వాత రెండువారాలకు సిలువలో తన ప్రాణ ం పెట్టి మానవాళికంతటికీ ‘మంచి కాపరి’ అయ్యాడు
లాజరు అద్భుతానికి ముందు మరియమార్తల గ్రామంగా చెప్పుకునే బేతనియ (యోహాను 11:1) ఆ తర్వాత లాజరు నివసించే గ్రామంగా మారింది (12:1). ఎందుకంటే వంగా మారిన తనలో మళ్లీ ఊపిరిని పోసి బతికించడం ద్వారా దేవుడు అద్భుతాన్ని చేస్తే, అలా పునఃప్రారంభమైన జీవితాన్ని దేవునికే అంకితం చేసి, పరివర్తనతో జీవించి దేవునికి మహిమకరంగా జీవించడం ద్వారా లాజరు తన జీవితాన్ని మహాద్భుతంగా మార్చుకున్నాడు. యేసు ఆరోహణానంతరం లాజరు చేసిన పరిచర్యతో యూదయ ప్రాంతమంతా ఆశీర్వదించబడిందని, చివరికి అతను యేసుకోసం హతసాక్షి అయ్యాడని చరిత్ర చెబుతోంది. యేసు చేసిన అద్భుతానికి లాజరు రుణం తీర్చుకున్న విధానమది.
యేసు నా జీవితంలో అద్భుతం చేశాడంటూ చంకలు గుద్దుకోవడం కాదు, ఆ తర్వాత యేసుకోసం, ఆయన ప్రజల కోసం మనం మరెంత అద్భుతంగా జీవిస్తున్నామన్నది ప్రాముఖ్యమైన అంశం. యేసు అద్భుతాలు చేయాలన్న శ్రద్ధ మంచిదే కాని పరివర్తన పొంది యేసుకోసం మహాద్భుతంగా బతకాలన్న శ్రద్ధ మరీ మంచిది. నిప్పుకణికల్లాగా మండాల్సిన చాలా జీవితాలు, చర్చిలు బూడిదలా చల్లబడి చప్పబడి పోవడానికి కారణం ఆ శ్రద్ధ లోపించడమే! బూడిదలా వందేళ్లు బతకడం కాదు, నిప్పులా నిమిషంపాటు కణకణలాడినా చాలు!!
– రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్