
శివారెడ్డి, ఇన్నాశమ్మ(ఫైల్)
వేములవాడ అర్బన్: ఏడు పదుల వయసులో ఆ దంపతులు కలసి‘పోయారు’. పెళ్లితో ఏకమైన వారు.. మరణంలోనూ కలిసే సమాధి అయ్యారు. 18 గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి శివారులోని శాంతినగర్‌కు చెందిన అల్లం ఇన్నాశమ్మ (72) బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో మరణించింది. కుటుంబసభ్యులు హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో ఉండటంతో వాళ్లంతా రావడానికి సమయం పట్టింది.
గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అంతిమ యాత్రకు సిద్ధం చేయగా.. భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త అల్లం శివారెడ్డి(75) గుండెపోటుతో మరణించాడు. ఇన్నాశమ్మ అంతిమయాత్రకు వచ్చిన బంధువులు భార్యాభర్తలు కొద్ది గంటల్లోనే మరణించడంతో తట్టుకోలేకపోయారు. శాంతినగర్‌లో ఇన్నాశమ్మ, శివారెడ్ది దంపతుల అంతిమయాత్ర కలసి సాగింది. ఇద్దరిని ఒకే సమాధిలో ఖననం చేశారు. శివారెడ్డి గతంలో నాంపెల్లి సింగిల్‌విండో చైర్మన్‌గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment