ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై(తమిళనాడు): చెన్నైలోని కొళత్తూరులో వృద్ధ దంపతుల మరణం మిస్టరీగా మారింది. వీరు ఆత్మహత్య చేసుకున్నారా..లేదా ఎవరైనా బలవంతంగా పురుగుల మందు తాగించారా.? అన్న అనుమానాలు బయలు దేరాయి. ఇందుకు బలం చేకూర్చే విధంగా ఇంట్లో ఉన్న కుమారుడు, కుమార్తె అదృశ్యం కావడంతో కేసును చేదించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.
చెన్నై కొళత్తూరు బాలాజీ నగర్ ఐదో క్రాస్ వీధిలో గోవిందరాజులు (62), భారతి(59) నివాసం ఉన్నారు. గోవిందరాజులు ప్రముఖ నిర్మాణ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయనకు కుమారుడు దినేష్, కుమార్తె భాగ్యలక్ష్మి(40) ఉన్నారు. భాగ్యలక్ష్మి ఇది వరకు భర్త ప్రకాష్‌తో పాటుగా పుదుచ్చేరిలో ఉండేది.
అయితే, ఆమె కుమార్తె హరిణికి చెన్నైలోని ఓ కళాశాలలో సీటు దక్కడంతో మకాంను ఇటీవల తల్లిదండ్రుల ఇంటికి మార్చేసింది. ప్రకాష్ అంబత్తూరులోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే, దినేష్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చాడు.
బలన్మరణమా..? లేదా..?
ప్రకాష్ ఆదివారం ఉదయాన్నే నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య కనిపించక పోవడం, అత్త, మామలు అచేతన స్థితిలో పడి ఉండడంతో ఆందోళన చెందాడు. ఇరుగు పొరుగు వారి ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. ఇన్‌స్పెక్టర్ అర్జున్‌కుమార్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, గోవింరాజులు, భారతీ మరణించినట్టు తేలింది.
ఇంట్లో రెండు పురుగుల మందు బాటిల్స్ ఉండటం, అందులో ఒకటి ఖాళీగా ఉండటంతో ఆ ఇద్దరు సేవించి ఉండవచ్చన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అదే సమయంలో ఇంట్లో ఉండాల్సిన దినేష్, భాగ్యలక్ష్మి కనిపించక పోవడం అనుమానాలకు దారి తీశాయి. అలాగే భాగ్యలక్ష్మి మెడలో ఉండాల్సిన తాళి బొట్టు దేవుడిచిత్ర పటం వద్ద వేలాడుతుండటాన్ని గుర్తించారు.
ఇంట్లో ఉన్న హరిణి వద్ద జరిగిన విచారణ మేరకు శనివారం రాత్రి అవ్వతాత, అమ్మ, మామయ్య మధ్య ఏదో నగదు విషయంగా గొడవ జరిగినట్టు, ఆ తర్వాత వివాదం సద్దుమనిగి అందరూ నిద్రకు ఉపక్రమించినట్టు తేలింది. మృత దేహాల్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు, అదృశ్యమైన దినేష్, భాగ్యలక్ష్మి కోసం గాలిస్తున్నారు.
చదవండి: మాజీ కేంద్ర మంత్రి ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
Comments
Please login to add a commentAdd a comment