ఇటలీలో ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అరుదైన సమాధి ఉంది. మూసివేసి ఉన్న దీని ప్రవేశమార్గాన్ని తెరిచి, లోపలకు ప్రవేశించిన శాస్త్రవేత్తలకు ఇందులో అరుదైన కుడ్యచిత్రాలు కనిపించాయి. గ్రీకు పురాణాల్లో వర్ణించిన అధోలోకానికి సంబంధించిన దృశ్యాలు ఈ కుడ్యచిత్రాల్లో ఉండటం విశేషం. ఇది కనీసం రెండువేల ఏళ్ల కిందటిదని శాస్త్రవేత్తల అంచనా. సమాధి లోపలి గోడలపై చిత్రించిన ‘సెర్బరెస్’ అనే మూడుతలల జాగిలం గ్రీకుపురాణాల్లో వర్ణించిన మాదిరిగానే ఉండటంతో, అధోలోకంపై విశ్వాసం కలిగిన పూర్వీకులు ఈ సమాధిని అధోలోక ప్రవేశమార్గంలా నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
గ్రీకు పురాణాల ప్రకారం ‘సెర్బరెస్’ అనే మూడుతలల జాగిలం అధోలోకానికి కాపలాగా ఉంటుంది. ఇటలీలోని నేపుల్స్‌నగర శివార్లలోని గిగ్లియానో పట్టణం వద్ద ఈ పురాతన సమాధి బయటపడింది. ఈ పరిసరాల్లోనే పురాతత్త్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఇదివరకు కూడా రోమన్ సామ్రాజ్య కాలానికి చెందిన పలు సమాధులు బయటపడ్డాయి. అవన్నీ క్రీస్తుపూర్వం 510 నుంచి క్రీస్తుశకం 476 మధ్య కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాటిలో ఇంత స్పష్టమైన కుడ్యచిత్రాలు లేవని, తాజాగా బయటపడ్డ ఈ సమాధి వాటికి భిన్నంగా ఉందని చెబుతున్నారు. ఈ సమాధికి వారు ‘టోంబ్ ఆఫ్ సెర్బరెస్’ అని పేరు పెట్టారు.
(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కోట!)
Comments
Please login to add a commentAdd a comment