stunning facts
-
బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క!
ఈ ప్రకృతిలో ఎన్నో పర్యావరణ అద్భుతాలు ఉన్నాయి. అందులో ఉండే అత్యంత అరుదైన వృక్ష సంపద మానువుడిని విస్తుపోయాలే చేస్తుంది. ఇంతవరకు ఎన్నో వింత మొక్కలు చూసుంటారు. కానీ ఇలా లిప్‌స్టిక్ వేసిన పెదవుల్లా ఉండే అరుదైన మొక్కను గురించి విన్నారా? అదెక్కడుందంటే..? ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయా ? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే..? ఇలా మానవ పెదవులు పోలిన మొక్క ఈక్వెడార్, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. సైకోట్రియా ఎలాటా లేదా హుకర్స్ లిప్స్ ప్లాంట్‌గా పిలిచే ఈ హాట్ లిప్స్ ప్లాంట్ ఈ భూమ్మీద ఉండే వృక్షజాతుల్లో అత్యంత అరుదైన మొక్కగా పేర్కొనవచ్చు. దీన్ని బొటానికల్ వండర్‌గా పిలుస్తారు. ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే.. బ్రాక్ట్స్గా పిలిచే ఈ మొక్క ఆకులు ఎర్రటి రంగులో మానవ పెదవుల్లా కనిపిస్తాయి. ఇవి హమ్మింగ్ బర్డ్స్, సీతాకోక చిలుకలు పరాగ సంపర్కంలో ఆకర్షించడానికి ఈ ఎర్రటి ఆకుల భాగమే సహాయపడుతుంది. అయితే ఈ మొక్క ఆకులు ఉన్నంత ఆకర్షణీయంగా వాటి పువ్వులు కనిపించవు. పువ్వులు పూసే ముందే ఇలా పెదవుల ఆకారంలో ఈ మొక్క కనిపిస్తుందట. దీని లోపలి నుంచి నక్షత్రాల ఆకారంలో తెల్లని పువ్వులు పుష్పిస్తాయి. ఇవి అంతగా అట్రాక్టివ్‌గా కనిపించవు. సువాసనలు వెదజల్లే ఈ పువ్వులు డిసెంబర్, మార్చి నెలల్లో పుష్పిస్తాయి. మధ్య అమెరికాలోని ప్రజలు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట. మరీ ముఖ్యంగా వేలంటైన్స్ డే రోజు ప్రేమికులు ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట. దీని బెరడు, ఆకులను స్థానికులు చర్మ సంబంధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే ఈ మొక్క ప్రస్తుతం కనుమరుగైపోతున్న జాబితాలో ఉందట. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ హుకర్స్ లిప్స్ ప్లాంట్ తెలిసేందుకైనా..ఇది అంతరించిపోకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (చదవండి: శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తినొచ్చా? బరువు తగ్గుతారా..?) -
తవ్వకాల్లో అరుదైన సమాధి..లోపల దృశ్యం చూసి కంగుతిన్న శాస్త్రవేత్తలు!
ఇటలీలో ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అరుదైన సమాధి ఉంది. మూసివేసి ఉన్న దీని ప్రవేశమార్గాన్ని తెరిచి, లోపలకు ప్రవేశించిన శాస్త్రవేత్తలకు ఇందులో అరుదైన కుడ్యచిత్రాలు కనిపించాయి. గ్రీకు పురాణాల్లో వర్ణించిన అధోలోకానికి సంబంధించిన దృశ్యాలు ఈ కుడ్యచిత్రాల్లో ఉండటం విశేషం. ఇది కనీసం రెండువేల ఏళ్ల కిందటిదని శాస్త్రవేత్తల అంచనా. సమాధి లోపలి గోడలపై చిత్రించిన ‘సెర్బరెస్’ అనే మూడుతలల జాగిలం గ్రీకుపురాణాల్లో వర్ణించిన మాదిరిగానే ఉండటంతో, అధోలోకంపై విశ్వాసం కలిగిన పూర్వీకులు ఈ సమాధిని అధోలోక ప్రవేశమార్గంలా నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రీకు పురాణాల ప్రకారం ‘సెర్బరెస్’ అనే మూడుతలల జాగిలం అధోలోకానికి కాపలాగా ఉంటుంది. ఇటలీలోని నేపుల్స్నగర శివార్లలోని గిగ్లియానో పట్టణం వద్ద ఈ పురాతన సమాధి బయటపడింది. ఈ పరిసరాల్లోనే పురాతత్త్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఇదివరకు కూడా రోమన్ సామ్రాజ్య కాలానికి చెందిన పలు సమాధులు బయటపడ్డాయి. అవన్నీ క్రీస్తుపూర్వం 510 నుంచి క్రీస్తుశకం 476 మధ్య కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాటిలో ఇంత స్పష్టమైన కుడ్యచిత్రాలు లేవని, తాజాగా బయటపడ్డ ఈ సమాధి వాటికి భిన్నంగా ఉందని చెబుతున్నారు. ఈ సమాధికి వారు ‘టోంబ్ ఆఫ్ సెర్బరెస్’ అని పేరు పెట్టారు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కోట!) -
కట్టుబట్టలు తప్ప.. అన్నీ దోపిడీ!
► కాల్ మనీ గ్యాంగ్‌కు చిక్కితే అంతే ► ఓటర్, ఆధార్ కార్డులు కూడా వాళ్ల సొంతం ► ఆస్తి పత్రాలు పక్కాగా రాయించుకున్న వైనం ► సోదాల్లో వందల కొద్దీ డాక్యుమెంట్ల స్వాధీనం ► ప్రస్తుతానికి తూతూమంత్రంగానే దాడులు ► అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోతే.. తుస్! (సాక్షి వెబ్ ప్రత్యేకం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో జోరుగా జరుగుతున్న కాల్‌మనీ వ్యాపారంలో తవ్వినకొద్దీ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఒకసారి కాల్‌మనీ గ్యాంగ్‌లో చిక్కితే ఒక మనిషిని ఏ స్థాయిలో వేధిస్తారో ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మనిషికి ఉండే కట్టుబట్టలు తప్ప ప్రతి ఒక్క వస్తువును దోచేసుకున్నారు. మంగళవారం తాజాగా గుంటూరులోని పట్టాభిపురం, అరండల్‌పేట, కొత్తపేట, పాట గుంటూరు పోలీస్స్టేషన్ల పరిధిలోని కాల్‌మనీ గ్యాంగ్‌కు చెందిన నలుగురి ఇళ్లపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బయటపడిన డాక్యుమెంట్లను చూసి విస్మయం చెందారు. తీసుకున్న అప్పు కింద తనఖా పెట్టుకోవడానికి ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఇతర భూముల పత్రాలను తీసుకోవడమే కాకుండా ఖాళీ ప్రామిసరీ నోట్స్‌పై సంతకాలు తీసుకున్నారు. ఎప్పుడైనా, ఏ దశలోనైనా ఆ ఇంటిని వారు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి లేదా ఇతరులకు అమ్మకోవడానికి వీలుగా పత్రాలను రాయించుకునేలా బాధితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. ఇవే కాదు విచిత్రమేమంటే... అప్పు తీసుకున్నవారు సమాజంలో తానూ ఒక మనిషినే అని నిరూపించుకోవడానికి ఏ ఆధారం లేకుండా ప్రతి ఒక్కటీ తమ వద్ద తనఖా పెట్టించుకున్నారు. రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఇలా ఒకటేమిటి... ఆ ఇంట్లో ఏముంటే వాటిని కాల్ మనీ గ్యాంగ్ తమ వద్ద తనఖా పెట్టుకున్నారు. మంగళవారం నాలుగిళ్లలో పోలీసులు దాడులు చేయగా ఆ నాలుగిళ్ల నుంచి వందలాదిగా ఇలాంటి డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ప్రతి ఇంట్లో వందల కొద్దీ డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, ఆధార్ కార్డులు, నగలు, డబ్బు కట్టలు... ఇలా అనేకం వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటినీ పోలీసులు సీజ్ చేసి నలుగురు కాల్ మనీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. అసలు దోషుల ఇళ్లవైపు చూడని పోలీసులు కాల్ మనీ కేసులు తవ్వినకొద్దీ అనేక విస్మయకర విషయాలు బయటకు వస్తుండగా, ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారులు, పాత్రధారుల వైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీకి చెందిన బడా నేతల పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తున్నా.. అటువైపు వెళ్లే సాహసం కూడా చేయట్లేదు. ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తే వారిని బెదిరిస్తున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలతో.. మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా కాల్‌మనీ దౌర్జన్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించడమే కాకుండా మంగళవారం ఈ విషయంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఇరకాటంలో పడతామన్న భయంతో కాల్ మనీ వ్యవహారంలో కొందరిపై తూతూ మంత్రంగా దాడులు చేయిస్తోందన్న విమర్శలున్నాయి. 'అసెంబ్లీలో ప్రతిపక్షానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు నామమాత్రంగా కొన్ని దాడులు తప్పవు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేసులన్నింటినీ తెరవెనక్కి నెట్టేస్తారు' అని ఒక పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.