మట్టి ఇళ్లను.. ప్రింట్‌ చేసుకుందాం.. | Latest Opportunity To Print Mud Houses Using Modern Technology Is Coming | Sakshi
Sakshi News home page

మట్టి ఇళ్లను.. ప్రింట్‌ చేసుకుందాం..

Published Sun, Dec 5 2021 4:29 AM | Last Updated on Sun, Dec 5 2021 5:15 AM

Latest Opportunity To Print Mud Houses Using Modern Technology Is Coming - Sakshi

మట్టి గోడలు.. చౌడు మిద్దెలు.. పర్యావరణానికి ఏమాత్రం నష్టం కలిగించని ఒకప్పటి ఇళ్లు. మిద్దె తయారీలో దూలాలు, కలప తప్ప ఏమాత్రం ప్రకృతి హానికారకాలు లేని నిర్మాణాలవి. మళ్లీ అవే ఇళ్లు మనకు భవిష్యత్‌ చూపబోతున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించి, మట్టి ఇళ్లను ‘ప్రింట్‌’ చేసుకునే సరికొత్త అవకాశం వచ్చేస్తోంది. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా..     
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

వందల ఏళ్ల కిందట కేవలం మట్టితో ఇళ్లు కట్టుకునేవారు. పునాదుల కోసమో, మరో అవసరానికో రాళ్లు వాడేవారు. ఆధారం కోసం దూలాలను, పైకప్పు కోసం కలపను వాడేవారు. స్థానికంగా దొరికే మట్టికి సున్నపురాయి కలిపి, ఒకరోజు ముందు నానబోసి, ఎద్దులతో తొక్కించి.. ముద్దలుగా పేర్చుతూ గోడలు కట్టేవారు. ప్రకృతికి ఏమాత్రం హాని చేయని నిర్మాణాలు అవి.

ఇప్పుడదే తరహాలో ఆధునిక మట్టి ఇళ్లు కట్టుకునే అవకాశాన్ని ఇటలీ ఆర్కిటెక్ట్, విద్యావేత్త మారియో క్యూసినెల్లా అందుబాటులోకి తెచ్చారు. శతాబ్దాల కిందటి ఎడారి నాగరికతల నాటి ఇళ్లను తలపించేలా.. గుండ్రని ఆకృతిలో వీటి మోడల్‌ను రూపొందించారు. పూర్తిగా ఆధునికమైన త్రీడీ ప్రింటింగ్‌ విధానంలో ఇటీవలే ఇటలీలో ఈ మోడల్‌ ఇళ్లను నిర్మించారు.  

దగ్గర్లో దొరికిన మట్టితోనే.. 
మారియో డిజైన్‌ చేసిన త్రీడీ ఇళ్ల నిర్మాణంలో స్థానికంగా దొరికిన మట్టి, ఇతర వనరులనే వాడారు. అదనంగా ఉపయోగించింది తలుపులు, కుర్చీలు వంటివే. ఈ ఇళ్లలో లివింగ్‌ రూమ్, బెడ్‌రూమ్, బాత్‌రూం వంటి సదుపాయాలన్నీ ఉంటాయి. ‘‘ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు తలెత్తి ఇళ్లు కోల్పోయినవారు నివాసం ఉండటానికి ప్రస్తుతం వేగంగా కల్పించగల ప్రత్యామ్నాయం ఇదే.

ప్రకృతి విపత్తులు సంభవించిన చోటుకి ఈ త్రీడీ ప్రింటర్‌ను పంపిస్తే చాలు.. మట్టి తవ్వడం నుంచి పూర్తి నివాసయోగ్యమైన ఇల్లు కట్టడం దాకా పూర్తవుతుంది. భవిష్యత్తులో ఈ మట్టి ఇళ్లే కీలకంగా మారనున్నాయి’’ అని మరియో చెప్తున్నారు. 

త్రీడీ ప్రింటింగ్‌తోనే ఫర్నిచర్‌ కూడా.. 
మట్టి, సాంకేతిక మేళవించిన ఈ ఇళ్లకు మారియో.. ‘టెక్లా’ పేర్లు పెట్టారు. కందిరీగ ఇల్లు కట్టుకోవడం ఎప్పుడైనా గమనించారా? బురదమట్టిని పోతపోసి ఉబ్బెత్తుగా నిర్మాణం చేసుకొని అందులోకి వెళ్తుంది. గుడ్లు పెట్టి పిల్లలైన తరువాత బయటికొస్తాయి. ఆ మట్టి నిర్మాణాలు గట్టిగా ఉంటాయి. వేరే కీటకాలూ వాటిని వినియోగించుకుంటాయి. అచ్చం అలాగే.. పొరలు పొరలుగా రెండు వృత్తాలు కలిసి ఉండే ఆకారంలో ఉబ్బెత్తుగా ఇళ్లను నిర్మిస్తారు.

సెంట్రింగ్‌ పనిముట్లు అవసరం లేకుండానే.. 200 గంటల్లో 645 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటిని నిర్మించవచ్చని మరియో తెలిపారు. చుట్టూ గోడలు, లోపలి గోడలతోపాటు గోడకు ఆనుకుని ఉండే టేబుల్‌ వంటి నిర్మాణాలూ త్రీడీ ప్రింటర్‌తోనే రెడీ అయిపోతాయన్నారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన ‘కాప్‌ 26 క్లైమెట్‌ చేంజ్‌’ సదస్సులో కర్బన ఉద్గారాలు లేని ప్రాజెక్టుగా ‘టెక్లా’ ఎంపికవడం గమనార్హం.

విపత్తులను తట్టుకునేలా నిర్మాణం 
ఈ మట్టి ఇళ్ల నిర్మాణం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఉద్గారాలు లేని యూరప్‌ను నిర్మించడమే తన లక్ష్యమని మారియో చెప్పారు. మట్టి ఇల్లు కదా.. వానలు, వరదలను తట్టుకుంటుందా అన్న ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా.. వానలు, వరదలు, భూకంపాలను తట్టుకునేలా త్రీడీ ప్రింటింగ్‌లో డిజైన్‌ చేశామన్నారు. అయితే ఈ ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement