అంతుచిక్కని అందగత్తె కథ | Meet Lara Debbane, Egypt's new beauty queen | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని అందగత్తె కథ

Published Sun, Oct 25 2015 1:46 AM | Last Updated on Tue, May 8 2018 11:24 AM

అంతుచిక్కని అందగత్తె కథ - Sakshi

అంతుచిక్కని అందగత్తె కథ

* ఆమె ఓ అందాల రాణి.
* ఈజిప్టు తలరాతనే మార్చింది.
* మరి ఎందుకు అదృశ్యమైంది?
డిసెంబర్ 6, 1913... ఈజిప్ట్...
అమర్నా ప్రాంతంలోని ఎడారి అంతా సందడి సందడిగా ఉంది. ఆర్కియాల జిస్టుల బృదం పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి నేలను తవ్వుతోంది. అందరూ కలిసి దేని  దేని కోసమో తీవ్రంగా అన్వేషిస్తున్నారు. అంతలో ఉన్నట్టుండి ఓ కేక వినిపించింది... ‘‘సర్... ఓసారి ఇలా రండి’’ అంటూ.
 
మరో చోట దేనినో పరిశీలిస్తోన్న జర్మన్ ఆర్కియాలజిస్టు లుడ్విగ్ బోర్షార్‌‌ట గబగబా అటువైపు నడిచాడు. అక్కడున్న తన అసిస్టెంట్ చేతిలో ఉన్నదాన్ని చూసి ఆశ్చర్యపోయాడతను.
 లైమ్‌స్టోన్‌తో చేసిన మహిళ శిల్పం అది. శిల్పమే అయినా అందులో జీవకళ ఉట్టి పడుతోంది. తల నుంచి ఛాతి వరకు మాత్రమే ఉందా శిల్పం. దాన్ని చూస్తుంటే... ఆమె చాలా అందగత్తె అయి ఉంటుందని అనిపిస్తోంది.
 
‘‘వండర్‌ఫుల్. ఈమె ఎవరో రాణి అనిపిస్తోంది. అంటే మనం అనుకుంటు న్నట్టు ఈ నేల కింద ఏదో సామ్రాజ్యం ఉండే ఉంటుంది’’ అన్నాడు లుడ్విగ్ హుషారుగా.
 వెంటనే అతడు ఆ విగ్రహం ఎవరిదో తెలుసుకునే ప్రయత్నాలు మొదలెట్టాడు. ఆ ప్రయత్నం చివరికి ఓ పెద్ద చరిత్రనే వెలికి తీస్తుందని అతనికప్పుడు తెలియదు. తనకు దొరికిన శిల్పం ఓ రాణిదని, ఆమె ఒకప్పుడు ఈజిప్టును తన కనుసన్నల్లో నడిపిందని, ఆమె ఈజిప్టు చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ అని అంత కన్నా తెలియదు. ఇంతకీ ఎవరామె?
     
ఈజిప్టులోని థీబ్స్... పద్నాలుగో శతాబ్దం...
రాజప్రాసాదం ముందు జనం నిలబడి ఉన్నారు. రాజుగారు తమతో ఏదో చెప్పాలనుకుంటున్నారన్న కబురు అంది వాళ్లంతా వచ్చారు. ఆయనేం చెప్పబోతున్నారోనని ఆతృతగా ఎదురు చూస్తూ నిలబడ్డారు. కొన్ని నిమిషాల తర్వాత ఫరో అకనాటన్ బయటకు వచ్చాడు. అందరూ ఆయనకు నమస్కరించారు. అభివాదం ఆయనకు చేశారే కానీ, ఆయన పక్కన ఉన్న రాణి మీదే ఉన్నాయి అందరి కళ్లూ.
 
అతిలోక సౌందర్యరాశి దిగి వచ్చిందా అన్నట్టు ఉంది... అకనాటన్ భార్య నెఫర్‌తితీ. కలువ రేకులను పక్కపక్కనే అమర్చినట్టుగా ఉన్న కళ్లు, చక్కగా చెక్కినట్టుగా ఉన్న నాసిక, లేత గులాబీ రంగులో మెరిసిపోతోన్న పెదవులు, బంగారు మేనిఛాయ... పోత పోసిన అందం ఆమె! వెండి తీగెలతో ఎంబ్రాయిడరీ చేసిన దుస్తుల్లో దేవకన్యలాగా కనిపిస్తోంది. ఫరో పక్కన ఆమె నిలబడిన తీరు ఎంతో హుందాగా ఉంది.
 
‘‘ఫరో మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నారు. దాని కోసమే మిమ్మల్నందరినీ ఇక్కడికి పిలిపించారు.’’
 రాణి నెఫర్‌తితీ గంభీరమైన స్వరంతో మాట్లాడుతుంటే అందరూ చెవులు రిక్కించి వింటున్నారు.
 ‘‘ఇప్పటి వరకూ థీబ్స్‌నే రాజగనరిగా భావిస్తున్నాం. అయితే ఇప్పుడీ రాజనగరిని ఇక్కడి నుంచి తరలించాలని, నైలు నైదికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నా ప్రాంతంలో సరికొత్తగా నిర్మించాలని అనుకుంటున్నాం. ఈ విషయం తెలియజేయడానికే మిమ్మల్ని పిలిపించాం.’’
 అందరూ ముఖాలు చూసుకున్నారు. ఇంత అర్జంటుగా రాజనగరిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. కొందరు మౌనంగా తలాడించారు. కొందరు మాత్రం ముఖాలు మాడ్చుకున్నారు.

ఈ రాణి ఎప్పుడూ ఇంతే... ఎప్పుడూ ఏవో కొత్త కొత్త ప్రణాళికలు వేస్తూ ఉంటుంది, ఎంతసేపూ తమ సుఖం, సౌఖ్యం చూసుకుంటుంది, ఇంకెంత విలాసంగా బతుకుదామా అని ఆలోచిస్తుంది అని మనసుల్లోనే గొణుక్కుంటూ అక్కడ్నుంచి కదిలారు.
 ఒక్కసారి ఏదైనా అనుకున్నదంటే ఆగదు నెఫర్‌తితీ. అందుకే రాజనగరిని కొద్ది రోజుల్లోనే అక్కడ్నుంచి మార్చేసింది. కొత్త ప్రదేశంలో, కొత్త కొత్త హంగులతో, కొన్ని ఎకరాల స్థలంలో నిర్మింపజేసింది. ఆ నిర్మాణ శైలికి, వైభవానికి ప్రజల కళ్లు చెదిరిపోయాయి.
 ఇతర దేశాల రాజులు, స్నేహితులు, బంధువులందరినీ పిలిచి విందు చేసింది నెఫర్‌తితీ. వచ్చినవాళ్లంతా ఆమె ప్లానింగ్‌ని పొగిడారు. ఏం చేసినా అద్భుతంగా చేస్తావని ప్రశంసలతో ముంచెతారు.
 
నెఫర్‌తితీ కన్నా ఆమె భర్త అకనాటన్ ఎక్కువ మురిసిపోయాడు. ఆమె తన భార్యగా దొరకడమే తన అదృష్టం అనుకున్నాడు. అనుకుని ఊరుకోలేదు... ఆ విషయాన్ని అందరి ముందూ సగర్వంగా వెల్లడించాడు కూడా. అతనెప్పుడూ అంతే. నెఫర్‌తితీ అంటే అతడికి ప్రాణం. ఆమె మాటంటే వేదం. ఆమె ఏం చేయమన్నా చేస్తాడు. నడవ మన్నట్టే నడుస్తాడు.
 
నెఫర్‌తితీ అన్న పేరుకు ‘అందగత్తె వచ్చింది’ అని అర్థం. ఆ పేరుకు తగ్గట్టు గానే అద్భుతమైన అందం నెఫర్‌తితీది. ఆమెని చూసిన ఏ ఒక్కరూ చూపు తిప్పుకో లేకపోయేవారు. ఇతర దేశాల రాజులు సైతం ఆమె మీద మోహపడేవారు. అంత అందాన్ని సొంతం చేసుకున్న అకనాటన్‌ని చూసి అసూయ పడేవారు. అవన్నీ చాలా గర్వంగా అనిపించేవి అకనాటన్‌కి. తనెంతో అదృష్టవంతుడినని పొంగి పోతుండేవాడు.

ఆమె అడుగలకు మడుగు లొత్తేవాడు. పేరుకి అతడు రాజు అయినా, పాలన సాగించేది మాత్రం నెఫర్‌తితీయే. ఆలోచనలన్నీ ఆమెవే. వాటిని అతడు తు.చ. తప్పకుండా పాటిస్తాడంతే.
 అంతగా అకనాటన్ జీవితంలో, ఈజిప్టు పాలనలో ప్రధాన పాత్ర పోషించింది నెఫర్‌తితీ. అలాంటి ఆమె... ఒకరోజు ఉన్నట్టుండి మాయమైపోయింది. భర్తతో పాటు ఎవ్వరికీ కనిపించకుండా పోయింది. ఎంతకీ అర్థం కాని ఓ మిస్టరీగా చరిత్రలో మిగిలిపోయింది. అసలామె ఏమైంది?
     
అకనాటన్ ఈజిప్టును పదిహేడేళ్ల పాటు పాలించాడు. అయితే పన్నెండో యేడు నడుస్తున్నప్పుడే నెఫర్‌తితీ అదృశ్యమైంది. ఆమె కోసం ఎంతో వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఆమె ఏమయ్యింది అన్న ప్రశ్నకు అకనాటన్ కూడా సమాధానం చెప్పలేకపోయాడు. తనను ఎవరైనా ఎత్తుకుపోయారా, ఎక్కడైనా దాచిపెట్టారా లేక చంపేశారా... ప్రశ్నలు బోలెడు పుట్టాయి. సమాధానం ఒక్కటి కూడా దొరకలేదు. దాంతో అకనాటన్‌తో పాటు మెల్లమెల్లగా జనం నెఫర్‌తితీని మర్చిపోయారు. అకనాటన్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ప్రజలంతా ఆమెనే రాణిగా అంగీకరించారు.
 
కాలం మారింది. రాజరికం అంతమయ్యింది. ఈజిప్టు రాజుల గాథలు చరిత్ర పుటల్లోకి చేరాయి. అయితే ఏ ఒక్క పుటలోనూ నెఫర్‌తితీ గురించి లేకపోవడం అన్నిటికంటే పెద్ద మిస్టరీ.
 1913లో ఆర్కియాలజిస్టు లుడ్విగ్ బృందానికి నెఫర్‌తితీ శిల్పం దొరికి నప్పుడు అది ఎవరిదో కూడా అర్థం కాలేదు. ఆ శిల్పం ఎవరిదో తెలుసుకోవా లని పరిశోధనలు మొదలయ్యాయి. మరో ప్రముఖ ఆర్కియాలజిస్టు ఫ్లెచర్ ద్వారా అసలు నిజం బయటకు వచ్చింది.
 
ఈజిప్టు రాజుల చరిత్రపై నిశితమైన పరిశోధన చేసింది ఫ్లెచర్. ఆమె నెఫర్‌తితీ శిల్పాన్ని పూర్తిగా పరిశీలించింది. దాన్ని చూస్తూనే అది ఒక రాణి శిల్పం అని చెప్పేసింది ఫ్లెచర్. తలపై ఉన్న కిరీటం, హెయిర్ స్టయిల్, కంఠాభరణాల డిజైన్ వంటి వాటిని బట్టి కచ్చితంగా ఎవరో రాణియే అని నిర్ధారించింది. నాటి నుంచీ ఆ రాణి ఎవరో కనిపెట్టేందుకే కృషి చేసింది. ఎంతో కష్టపడితే అప్పుడు ఆమెకు నెఫర్‌తితీ గురించి తెలిసింది.
 
తర్వాత కొన్నాళ్లకి ఈజిప్టులో పరిశోధనలు జరుపుతున్నప్పుడు ఓ సమాధిలో మూడు మమ్మీలు కనిపిం చాయి ఫ్లెచర్‌కి. వాటిలో ఒకటి ఓ యువ కుని మమ్మీ, రెండోది ఓ చిన్నపిల్ల మమ్మీ, మూడోది ఓ మధ్య వయస్కురాలి మమ్మీ. ఆ మూడో మమ్మీ నెఫర్‌తితీదే అనిపిం చింది ఫ్లెచర్‌కి. అయితే ఆ మమ్మీ పరిస్థితి ఘోరంగా ఉంది. తలపై జుత్తు లేదు. ఒంటిలో కత్తిపోట్లు ఉన్నాయి. ముఖాన్ని పచ్చడి చేసేశారు. పళ్లు విరగ్గొట్టేశారు. అంటే ఆమెను ఎవరో అత్యంత దారుణంగా చంపారని అర్థమయ్యింది. దాంతో నెఫర్‌తితీ పట్ల ఏం జరిగివుంటుందో అర్థమైంది.
 
ఈజిప్టు చరిత్రలో నెఫర్‌తితీ అంత అందగత్తెయే కాదు, అంత శక్తిమంతమైన మహిళ మరొకరు లేరు. తను చెప్పిందే వేదంగా, చేసిందే చట్టంగా అందరూ భావించేట్టుగా చేసిందామె. భర్త చాటున ఉంటూనే పాలన తన మాట చొప్పున జరిగేలా చేసింది. రాజనగరిని తనకు నచ్చిన చోటికి మార్పించింది. తనకు నచ్చినట్టుగా నిర్మించింది. అంతవరకూ ఈజిప్టులో ఉన్న దేవుళ్లందరినీ కాదని ఓ కొత్త దేవుడిని సృష్టించింది. అందరూ ఆ దేవుడికే మొక్కాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ప్రతి విషయంలోనూ ఆమె అన్నదే జరిగేది. అదే ఆమెను ఎంతో మందికి శత్రువుల్ని చేసిందంటారు ఫ్లెచర్.
 
ఈజిప్టు పాలనలో ఓ మహిళ ఇంతగా ఎప్పుడూ కల్పించుకున్నది లేదు. ఇంతగా ఆధిపత్యం చెలాయించిందీ లేదు. దాంతో నెఫర్‌తితీ ప్రవర్తన కొందరికి మింగుడు పడలేదు. ఆమె పద్ధతి చాలామందికి నచ్చలేదు. దాంతో తనపై పగబట్టారు. ఆమెను ఎలాగైనా అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆమెను చంపేసి రహస్యంగా సమాధి చేశారు. ఆమెను ఎవరూ గుర్తు పట్టకూడదని ముఖాన్ని ఛిద్రం చేశారు. పళ్లు విరగ్గొట్టారు.

ఆమె పేరు ఎక్కడా కనిపించకుండా చేశారు. ఆమె చిత్రాల్ని, విగ్రహాల్ని తీసి పారేశారు. మొత్తంగా ఆమెను ఈజిప్టు చరిత్ర నుంచి తుడిచిపెట్టేశారు. కానీ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అందుకే నెఫర్‌తితీ పేరు తుడిచి పెట్టుకుపోలేదు. ఆమె శిల్పం దొరికిన తర్వాత, ఆమె గురించి పరిశోధనలు మొదలయ్యాయి. ఆ మమ్మీ నెఫర్‌తితీదేనా, ఫ్లెచర్ చెప్పినట్టే నెఫర్‌తితీ హత్యకు గురయ్యిందా అన్నది చెప్పడం నేటికీ కష్టంగానే ఉంది. దాన్ని నిర్ధారించ డానికే ఫ్లెచర్ ఇంకా కష్టపడుతోంది. మరి నిజం ఎప్పటికి నిర్ధారణ అవుతుందో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement