కోటల కంటే ఇల్లే కష్టం | Architect Aishwarya Special Story | Sakshi
Sakshi News home page

వైభవోద్ధరణ

Published Mon, Jul 22 2019 11:54 AM | Last Updated on Mon, Jul 22 2019 12:08 PM

Architect Aishwarya Special Story - Sakshi

మాహిద్‌పూర్‌ కోట దర్వాజా దగ్గర ఐశ్వర్య

రోజుకు ఇరవై నాలుగ్గంటలు ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులు ఏళ్లకు ఏళ్లు బరువు మోసిన అలసిన స్తంభాలు కత్తి యుద్ధాలు... ఫిరంగి దాడులతో... నెత్తురోడిన గోడలు... ఇంకే ఘోరాలు చూడాల్సి వస్తుందోనని భయపడే పైకప్పులు నేలకు వాలి మట్టిలో కలిసిపోవడానికి సిద్ధమవుతుంటాయి. అదే జరిగితే... వాటిని అలాగే వదిలేస్తే...‘ఇదీ మా గొప్పతనం’ ఏమి చూపించాలి? భవిష్యత్తు తరాలకు...మన ముఖం ఎలా చూపించాలి? అందుకే వాటిని పునరుద్ధరిస్తోంది ఐశ్వర్య వందల ఏళ్ల నాటి కట్టడాలకు...కొత్తగా పాతరూపుని తెస్తోంది. మన భవన నిర్మాణ కౌశలాన్ని పరిరక్షిస్తోంది.వారసత్వ కట్టడాల వైభవాన్ని పునరుద్ధరిస్తోంది.

‘ఇల్లు కట్టి చూడు– పెళ్లి చేసి చూడు’ అనే నానుడి ఎందుకొచ్చి ఉంటుంది? ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం రెండూ అత్యంత కష్టమైన పనులు కాబట్టి. ఇప్పుడీ పనులన్నీ వ్యవస్థీకృతమైపోయాయి. పెళ్లి చేయాలంటే ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందోననే బెంగ అక్కర్లేదు, పూల మండపం ఎవరు బాగా కడతారని ఆరాలు తీసే పనీ లేదు. మంగళవాయిద్యాల బృందం ఎక్కడ దొరుకుతుందోనని చూడాల్సిన పనీ లేదు. మంచి వంటవాళ్లు ఎవరోనని వాకబు చేయాల్సిన పని అంతకంటే లేదు. ఈ పనులన్నీ ఈవెంట్‌ నిర్వహకులు చేసి పెట్టేస్తున్నారు. అలాగే ఇల్లు కట్టాలన్నా సరే... స్థలం చూపించి మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్‌ జాబితా ఇచ్చి, ఇంత మొత్తం అని వాళ్ల చేతిలో పెడితే ఇల్లు రెడీ అయిపోతోంది. ఇంటి వారు చేయాల్సింది గృహ ప్రవేశం ఒక్కటే. కొత్త ఇల్లు కట్టడం ఓకే, మరి... ఎప్పుడో కట్టిన ఇంటిని తిరిగి కట్టాల్సి వస్తే? అది మాత్రం చిన్న పని కాదు, దానికంటే కొత్త ఇల్లు కట్టుకోవడం చాలా సులభం. నిజమే, అలాగని ఉన్న ఇంటిని నేల కూల్చడానికి మనసంగీకరిస్తుందా? చూసే వారికి ఆ ఇల్లు కేవలం గోడలు, కిటికీలు, పైకప్పు మాత్రమే కావచ్చు... ఆ గోడలతో మనకు కొన్ని జ్ఞాపకాలు అల్లుకుని ఉంటాయి. అమ్మ కిటికీలో నిలబెట్టి గోరుముద్దలు తినిపిస్తుంటే... ఆకాశంలో చందమామను చూస్తూ కిటికీ చువ్వలు పట్టుకుని ఊగిన బాల్యం గుర్తుకు వస్తుంది. ఆ ఇంటిని కట్టిన తాతయ్య కళ్ల ముందు మెదలుతాడు.

‘నువ్వు కట్టిన ఈ ఇంటిని నా కంఠంలో ప్రాణం ఉండగా కూల్చను తాతయ్యా, దీనికి మరమ్మత్తులు చేసి ఆధునిక సౌకర్యాలతో నా పిల్లలకు అనువుగా మలుచుకుంటాను’ అని తాతయ్య ఫొటో ముందు మాట ఇచ్చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం పాత ఇంటిని పునరుద్ధరించే పనిలో పడతాం. చూసిన వాళ్లు ‘ఇంత కష్టపడడం ఎందుకు? కొత్త ఇల్లు కట్టుకోవచ్చు’ అని మూతి విరిచినా సరే... ఆ విరుపులేమాత్రమూ బాధించవు. సరికదా... పాత గోడలను తాకినప్పుడు మనల్ని తడిమే జ్ఞాపకాలు మనల్ని ఉయ్యాలలూగిస్తాయి. ఇంటితో ఉండే అనుబంధం అంత గట్టిది. మరి మన పెద్దవాళ్లు మనకోసం మిగిల్చిన జ్ఞాపకాల సంపద వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడమైతే? ఎవరెన్ని అన్నా సరే, తప్పని సరిగా పరిరక్షించుకోవాల్సిందే. ఆ కట్టడం అందులో నివసించే వాళ్లకు మాత్రమే కాదు, దేశానికి కూడా అది జ్ఞాపకాల సంపదే. ఢిల్లీలోని సేత్‌ రామ్‌ లాల్‌ ఖేమ్‌కా హవేలీలో నివసిస్తున్న దేవకీ నందన్, నేహా దంపతులు కూడా అలాగే అనుకున్నారు. దేవకీ నందన్‌కి ఢిల్లీ, కశ్మీరీ గేట్‌ సమీపంలో ఉన్న హవేలీ  175 ఏళ్ల నాటి కట్టడం. మొఘలుల కాలం నాటి నిర్మాణం. ఆ హవేలీకి మరమ్మత్తులు చేసుకున్నారు, అప్పుడు ఎలా కట్టారో అచ్చం అలాగే మళ్లీ కట్టారా అనిపించేటట్లు పునరుద్ధరించుకున్నారు. ఢిల్లీ చాందినీ చౌక్‌లోని ధరంపురా హవేలీ కూడా అలాంటిదే. ఈ రకంగా పాతనిర్మాణాలకు కొత్తదనం తెస్తున్న ఆర్కిటెక్ట్‌ ఐశ్వర్య తిప్నీస్‌. 

మాహిద్‌పూర్‌ కోట
పాతతరం కట్టడాలను పరిరక్షిస్తున్న నవతరం ఆర్కిటెక్ట్‌ ఐశ్వర్యా తిప్నీస్‌. మధ్యప్రదేశ్‌లోని మాహిద్‌పూర్‌ కోట, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చదువుకున్న డెహ్రాడూన్‌ స్కూలు, కోల్‌కతా చందన్‌ నగర్‌లోని ఫ్రెంచ్‌ చర్చ్‌... ఇలా ప్రత్యేకమైన నిర్మాణకౌశలానికి ఆనవాళ్లుగా నిలిచిన కట్టడాలను పటిష్టపరిచారామె. మాహిద్‌పూర్‌ కోట ఉజ్జయిని జిల్లాలో ఉజ్జయిని పట్టణానికి 50 కి.మీ.ల దూరాన ఉంది. మధ్యయుగం నాటి ఈ నిర్మాణానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. ఈస్టిండియా కంపెనీకి మరాఠా సమాఖ్యకు మధ్య 1817లో భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని మాహిద్‌పూర్‌ యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో స్థానిక హోల్కర్‌ రాజులు, యువరాజుల నుంచి సామాన్యుల వరకు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ యుద్ధంలో కోట దాదాపుగా ధ్వంసమైందనే చెప్పాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత చాలాకాలం భారత ప్రభుత్వం కోటల నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో నిర్మాణాలు మరింతగా శిథిలం కాసాగాయి. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ సర్వే రిపోర్టుల ఆధారంగా చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకునే పని మొదలైంది. అంతటి కీలకమైన, అత్యంత సంక్లిష్టమైన పనిని చేపట్టిన ఆర్కిటెక్ట్‌ ఐశ్వర్య. దేశంలో పేరు మోసిన ఆర్కిటెక్టుల్లో ఎక్కువ మంది మగవాళ్లే ఉన్నారు. ఓ ఇరవై ఏళ్లుగా అమ్మాయిలు ఎక్కువ మంది ఆర్కిటెక్చర్‌ కోర్సు చేస్తున్నారు. అయితే వాళ్లలో ఎక్కువ మంది సీనియర్‌ ఆర్కిటెక్ట్‌ దగ్గర సహాయకులుగానే ఉంటున్నారు. కొంతమంది సొంతంగా కెరీర్‌లో నిలదొక్కుకున్నప్పటికీ ఇంత భారీ స్థాయి కోటల పునరుద్ధరణ బాధ్యత తలకెత్తుకున్నది ఐశ్వర్య మాత్రమే.


సేత్‌ రామ్‌ లాల్‌ ఖేమ్‌కా హవేలీలో దేవకీ నందన్, నేహా దంపతులు

మన సంప్రదాయమే
ఐశ్వర్య ‘న్యూ ఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌’ స్టూడెంట్‌. గ్రాడ్యుయేషన్‌ 2003లో పూర్తయింది, తర్వాత స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీ నుంచి ‘యూరోపియన్‌ అర్బన్‌ కన్జర్వేషన్‌’లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఇప్పుడామె సొంత సంస్థ నిర్వహిస్తూ (ఐశ్వర్య తిప్నీస్‌ ఆర్కిటెక్ట్స్‌) ఆమె చదివిన స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో విజిటింగ్‌ ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారసత్వ కట్టడాల పునరుద్ధరణ ఆమెకు ఇష్టమైన వ్యాపకం. ‘ఆ ఇష్టమే ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టడానికి దారి తీసింది’ అంటారు ఐశ్వర్య. ‘‘పరిరక్షణ అనేది మనకు తెలియని విద్యేమీ కాదు. ఒక వస్తువుని పరిరక్షించడం అనేది మన భారతీయ సంప్రదాయంలోనే ఉంది. యూజ్‌ అండ్‌ త్రో విధానం మనది కాదు. ఒక వస్తువుని ఎన్ని రకాలుగా వాడవచ్చో అన్ని రకాలుగా మలుచుకుంటూ ఉపయోగిస్తాం. దానినే ఇప్పుడు ‘గోయింగ్‌ గ్రీన్‌ అని, సస్టెయినబులిటీ’ అనీ అంటున్నాం. భవననిర్మాణ రూపకల్పనను వృత్తిగా ఎంచుకోవడం వరకే నా చాయిస్‌. ఆ తర్వాత నా ఇష్టం ఎటువైపు తీసుకెళ్తే అటు సాగింది నా ప్రయాణం. మన సంప్రదాయ నిర్మాణాలు, చారిత్రక కట్టడాల మీద నాకున్న ఇష్టమే... వాటిని పరిరక్షించడాన్ని కెరీర్‌గా తీసుకునేలా ప్రభావితం చేసింది’’ అన్నారామె. ఐశ్వర్య హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ ఆర్కిటెక్చర్‌లో తాను అధ్యయనం చేసిన అంశాలను వార్తా పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. ‘వెర్నాక్యులర్‌ ట్రెడిషన్, కాంటెంపరరీ ఆర్కిటెక్చర్‌’ అనే పుస్తకం కూడా రాశారు.

పునరుద్ధరణ ఓ ఉద్యమం
చందన్‌ నగర్‌ పట్టణం కోల్‌కతాకు దగ్గరగా ఉంటుంది. అక్కడ ఫ్రెంచ్‌ కాలనీ ఉంది. ఫ్రెంచ్‌ వాస్తుశైలి భవనాలు వంద వరకున్నాయి. అవన్నీ వారసత్వంగా కాపాడుకోవాల్సిన నిర్మాణాలే. అయితే వాటి గొప్పతనం పట్ల స్థానికులకు పెద్దగా పట్టింపు లేదు. స్థానిక యువతను చైతన్యవంతం చేయడంతోపాటు వారసత్వ కట్టడాల మీద ఆసక్తి ఉన్న యువ ఆర్కిటెక్ట్‌లను సమీకరించి, వారందరి సహకారంతో ప్రాజెక్ట్‌ పూర్తి చేయగలిగాను. నిజానికి అదొక సోషల్‌ మూవ్‌మెంట్‌ అనాలి. అంత ప్రయాస పడిన తర్వాత మాత్రమే ఆ పట్టణానికి ఉన్న చారిత్రక నిర్మాణ నైపుణ్యాన్ని తిరిగి తీసుకురాగలిగాను. గత ఏడాది జనవరిలో ఫ్రెంచ్‌ అంబాసిడర్‌ అలెగ్జాండ్రె జిగ్లర్‌ నుంచి అవుట్‌ స్టాండింగ్‌ కమిట్‌మెట్‌ అవార్డు అందుకున్నాను. ఇది ఫ్రెంచ్‌లో కళ, సాంస్కృతిక రంగాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఇండియాలో ఉన్న ఫ్రెంచ్‌ వారసత్వ కట్టడాలను పునరుద్ధరించినందుకు ఈ అవార్డు వచ్చింది. డెహ్రాడూన్‌లోని డూన్‌ స్కూల్‌ పునరుద్ధరణను పూర్తి చేసినందుకు యునెస్కో నుంచి ప్రశంసాపత్రం అందుకోవడం కూడా నాకు అత్యంత సంతోషకరమైన సందర్భమే అయితే నేను చేపట్టిన నిర్మాణ పునరుద్ధరణ పనులన్నీ ఏ ఒక్కరిద్దరితోనో పూర్తయ్యేవి కావు, సమష్టి కృషితోపాటు అందరిలో నాకున్నంతటి పట్టుదల లేకపోతే సాధ్యమయ్యే పనులు కానే కాదు. అందుకే ఏ పురస్కారమైనా నా టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ చెందుతుంది.
– ఐశ్వర్య తిప్నీస్, కన్జర్వేషన్‌ ఆర్కిటెక్ట్‌


చందన్‌ నగర్‌లోని ఫ్రెంచ్‌ చర్చ్‌

కోటల కంటే ఇల్లే కష్టం
కోటలకు మరమ్మత్తులు చేసి పటిష్టపరచడం కష్టం అనుకుంటాం. కానీ ఇళ్లను పరిరక్షించడమే కష్టమైన పని అంటారు ఐశ్వర్య. ‘‘కోటల ఒరిజినల్‌ డిజైన్‌కు అనుగుణంగా పని చేస్తే సరిపోతుంది. అప్పుడు వాడిన లైమ్, సాండ్‌ స్టోన్‌ల స్థానంలో అదే లుక్‌ తీసుకురావడానికి కొంత వరకు ప్రత్యామ్నాయాలను కూడా వాడవచ్చు. ఇళ్లను పునరుద్ధరించేటప్పుడు ఏ మాత్రం రాజీ పడడానికి వీల్లేదు. ఉదాహరణకు ఆ భవనం కట్టినప్పుడు కిటికీలకు రంగు అద్దాలను వాడినట్లయితే ఇప్పుడా డిజైన్, షేడ్‌ కోసం మార్కెట్‌లు గాలించాల్సిందే. మోడల్‌ అద్దాన్ని పట్టుకుని నెలలపాటు గాలించిన సందర్భాలూ ఉన్నాయి. దానికి తోడు ఆ ఇంట్లో నివసిస్తున్న వాళ్లు ఇప్పటి అవసరాలకు అనుగుణంగా వాళ్లంతట వాళ్లే కొన్ని మార్పులు చేసుకుని ఉంటారు. గ్రైండర్, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్‌ వంటి ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల కోసం టెంపరరీ వైరింగ్‌ చేసుకుని ఉంటారు. కొన్ని వైర్లు బయటకు వేళ్లాడుతూ ఉంటాయి. ఈ ఇరవై ఒకటో శతాబ్దపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంటీరియర్‌ అంతా రీ డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. అటాచ్‌డ్‌ టాయిలెట్, క్లోజెట్, మాడ్యులార్‌ కిచెన్‌తో ఇంటికి మోడరన్‌ టచ్‌ ఇవ్వాలి. అదే సమయంలో ఆ భవనం నిర్మాణ కాలం నాటి మనోహరరూపాన్ని కాపాడాలి. నమ్ముతారో లేదో కానీ మాకు మాహిద్‌ కోట పునరుద్ధరణకు మూడేళ్లు పడితే సేత్‌ రామ్‌ లాల్‌ ఖేమ్‌కా హవేలీకి దాదాపుగా ఎనిమిదేళ్లు పట్టింది. ఒకటే ప్రాజెక్టు మీద అన్నేసి సంవత్సరాలు పని చేయాలంటే చాలా ఓపిక ఉండాలంటా’’రామె. తన విజయ రహస్యం గురించి చెబుతూ... ‘‘ఆర్కిటెక్ట్‌ మిత్రులు... ఒక్కో ప్రాజెక్ట్‌ కోసం ఇన్నేసి సంవత్సరాలు గడపాలంటే బోర్‌ అంటారు. చిన్నప్పుడు చదువుకున్న ‘కుందేలు– తాబేలు’ కథలోని తాబేలు గెలుపే నాకు స్ఫూర్తి. ఎన్ని ప్రాజెక్టులు చేశాననే సంఖ్య కంటే ఎంతమంచి ప్రాజెక్టులు చేశాననే సంతృప్తే నాకు ముఖ్యం’’ అన్నారు ఐశ్వర్య తిప్నీస్‌ సంతోషంగా.
– మంజీర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement