- వచ్చేనెల 11లోగా బిడ్లు దాఖలు చేయండి
- ఆర్కిటెక్ట్, ల్యాండ్‌స్కేప్ సంస్థలకు సీఆర్‌డీఏ ఆహ్వానం
విజయవాడ
రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలోని నిర్మాణాలకు సంబంధించి కన్సల్టెన్సీ సేవలందించేందుకు ముందుకు రావాలని ఆర్కిటెక్ట్, ల్యాండ్‌స్కేప్, ఇంటీరియర్ డిజైన్ సంస్థలను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఆహ్వానించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. నిర్దేశిత అర్హతలున్న సంస్థలు వచ్చేనెల 11 లోపు బిడ్లను దాఖలు చేయాలని సూచించింది.
అదేరోజు సీఆర్‌డీఏ కార్యాలయంలో బిడ్లను తెరుస్తారు. 14వ తేదీన అర్హతలను బట్టి మార్కులు కేటాయించి, మూడు రంగాల్లో మూడు సంస్థలను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి ప్రీ బిడ్ సమావేశాన్ని వచ్చేనెల 4న నిర్వహించనునున్నారు. ప్రభుత్వ భవనాల సముదాయ స్వరూపం ఎలా ఉండాలనే దానిపై 3 అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ బృందాల మధ్య పోటీ పెట్టిన సీఆర్‌డీఏ దానికనుగుణంగా పనిచేసేందుకు ఈ సంస్థలను ఎంపిక చేయనుంది.
అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల రూపకల్పనను పోటీలో గెలిచే ఆర్కిటెక్ట్ బృందానికి అప్పగించనుంది. మిగిలిన భవనాల డిజైన్లను జాతీయ ఆర్కిటెక్ట్‌లతో రూపొందించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకవసరమైన సేవలందించేందుకు ఈ కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సీఆర్‌డీఏ భావిస్తోంది.
57.1 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం, 0.4 లక్షల చదరపు అడుగుల విసీర్ణంలో రాజ్‌భవన్, 0.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి నివాసం, 0.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర అతిథి గృహం, 14.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీఐపీల నివాస భవనాలు, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగుల భవన సముదాయాలు నిర్మించాలని ప్రతిపాదించింది. అందుకవసరమైన సేవలందించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.