Manushi Ashok Jain- Urban Design- నిర్మాణానికి పర్యావరణహితం తోడైతే...సమాజానికి ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది! ఆర్కిటెక్ట్, సిటీ ప్లానర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 29 సంవత్సరాల మానుషీ అశోక్ జైన్ (చెన్నై) పర్యావరణహిత నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రశంసలు అందుకుంటుంది...
‘నీ గురించి మాత్రమే కాదు, పొరుగువారి గురించి కూడా ఆలోచించు’‘ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి నీ వంతుగా ఇవ్వు’....ఇలాంటి మంచి మాటలు బాల్యంలోనే మానుషీ జైన్ మనసులో బలంగా నాటుకుపోయాయి.
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గోల్డ్‌మెడలిస్ట్ అయిన జైన్ ఆర్కిటెక్ట్‌గా బెంగళూరు, ముంబై, చెన్నై నగరాలతో పాటు సింగపూర్, న్యూయార్క్‌లలో పనిచేసింది. యూఎస్‌లో ససకి అసోసియేట్స్(ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, ప్లానింగ్ అండ్ అర్బన్ డిజైన్,ప్లేస్ బ్రాండింగ్...మొదలైన విభాగాలలో పనిచేసే సంస్థ)తో కలిసి పనిచేసింది. ఫలితంగా అర్బన్ డిజైనర్‌గా తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం దొరికింది.
ఈ అనుభవంతో అఫ్గానిస్థాన్ యుద్ధంలో దెబ్బతిన్న అయిదు నగరాలలో స్ట్రాటిజిక్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ చేసే అవకాశం లభించింది. ‘ప్రపంచం ఎదుర్కొంటున్న అసలైన సమస్యలు ఏమిటో అక్కడ తెలుసుకోగలిగాను’ అంటుంది జైన్.
‘ఫ్యూచర్ సిటీ ఆఫ్ కోచి’కి బాటలు వేసే అర్బన్ డిజైన్ పోటీ కేరళలో జరిగింది. జైన్ తన టీమ్‌మెట్స్‌తో ఒక కన్సార్టియంగా ఏర్పడి ఈ పోటీలో పాల్గొంది. పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ, వరదలను తట్టుకునేలా జైన్ బృందం రూపకల్పన చేసిన ‘లో కాస్ట్ అల్టర్‌నేటివ్ డిజైన్’ మొదటి బహుమతి గెలుచుకుంది.
‘అర్బన్ డిజైన్‌ను అర్థం చేసుకోవడం, అర్బన్ డిజైనర్ విలువ గురించి తెలియడం మన దగ్గర తక్కువే’ అంటున్న జైన్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 60 నగరాల్లో పనిచేసింది. ఏ ప్లస్ డి మ్యాగజైన్ ‘క్రియేటివ్ థీసిస్ డిజైన్ మెడల్’ అవార్డ్ అందుకుంది. ‘ప్రతిభకు వృత్తినిబద్ధత, పర్యావరణ స్పృహ తోడైతే ఎలా ఉంటుందో చెప్పడానికి జైన్ బలమైన ఉదాహరణ’ అని చెబుతున్నారు ససకి సీనియర్ అసోసియెట్ రోసెన్ క్రాంజ్.
ఆశావాదం, భవిష్యత్ దార్శనికత నుంచే ఏ డిజైనర్‌కు అయినా శక్తి వస్తుంది...అని బలంగా నమ్మే జైన్ ‘పచ్చటి భవిష్యత్’కు అవసరమైన నిర్మాణాలకు సృజనాత్మక ఆలోచనలు అందిస్తుంది.
ఆర్కిటెక్చర్ అనేది స్థలకాలాల గురించి మాట్లాడటమే కాదు...పర్యావరణ హితమై ఉండాలి. భవిష్యత్ దార్శనికతను ప్రతిబింబించాలి.– మానుషీ జైన్
చదవండి: Samrat Nath: శెబ్బాష్ సామ్రాట్.. ఈ సైకిల్‌ను ఎవరూ దొంగిలించలేరు!
Comments
Please login to add a commentAdd a comment