![ఆధునిక ఆర్కిటెక్ట్ చార్లెస్ ఇకలేరు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71434530009_625x300.jpg.webp?itok=cyVnWFAQ)
ఆధునిక ఆర్కిటెక్ట్ చార్లెస్ ఇకలేరు
ముంబై: తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్‌లో పుట్టి ఆధునిక ఆర్కిటెక్చర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న చార్లెస్ కొర్రియా మంగళవారం రాత్రి ముంబై నగరంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న చార్లెస్‌కు 84 ఏళ్లు. అహ్మదాబాద్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ భవన నిర్మాణాల్లో కీలక పాత్ర వహించిన చార్లెస్ 1930, సెప్టెంబర్ ఒకటవ తేదీన సికిందరాబాద్‌లో జన్మించారు.
ముంబైలో కళాశాల విద్యను అభ్యసించిన ఆయన మిచిగాన్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశంలో బడుకువర్గాల కోసం చౌకైన ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన చార్లెస్ దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మ భూషణ్, పద్మశ్రీ అవారులతోపాటు పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. లలిత్ మోదీ తన భార్యకు క్యాన్సర్ చికిత్స చేయించిన ఫోర్చుగల్లోని లజ్బాన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్కు రూపకల్పన చేసింది ఈయనే.