వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులను ఏం చేస్తాం?.. బయట చెత్తలో పడేస్తాం.. మరి ఈ ప్లాస్టిక్ చెత్తంతా ఎక్కడికిపోతోంది?.. అటూ ఇటూ తిరిగి అంతా సముద్రాల్లోకి చేరుతోంది. ఇటు మనుషులకు, అటు సముద్ర జీవులకు ఇదో పొల్యూషన్ సమస్య. ఈ ఇబ్బందిని ఎంతో కొంత తగ్గిస్తూనే.. అదే సమయంలో ఆహ్లాదం కలిగించేలా.. ప్లాస్టిక్ చెత్తతో సముద్రంపై ఓ రిసార్ట్ కట్టేస్తే..! అలలపై అలా అలా తేలుతూ ఎంజాయ్ చెయ్యగలిగితే..! భలే ఐడియా కదా.
ఆ్రస్టేలియాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ మార్గోట్ క్రసోజెవిక్ నీటిమీద తేలుతూ ఉండే ఈ సరికొత్త ఐలాండ్ రిసార్ట్‌ను డిజైన్ చేశారు. దీనికి ‘రీసైకిల్డ్ ఓసియన్ ప్లాస్టిక్ రిసార్ట్’గా పేరు పెట్టారు. ఆస్ట్రేలియా ఖండానికి కాస్త దూరంలో ఉన్న కీలింగ్ (కొకోస్) దీవుల దగ్గర సముద్రంలో దీన్ని కట్టేందుకు ఇప్పటికే ప్లానింగ్ మొదలుపెట్టారు. హిందూ మహా సముద్రంలో చేరిన ప్లాస్టిక్ చెత్తతో దీన్ని నిర్మించనున్నామని.. 2025 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.
చెత్త దొరికే కొద్దీ.. దీవి పెరుగుతూ..
‘ఫ్లోటింగ్ ఐలాండ్ రిసార్ట్’ కోసం.. ముందు కలప, బయో డీగ్రేడబుల్ ఫైబర్ కాంక్రీట్ మెష్ (మెల్లగా క్షీణిస్తూ పర్యావరణంలో కలిసిపోయే ఫైబర్ వల)తో ప్రధాన నిర్మాణాన్ని కడతారు. దానికి చుట్టూ మెష్‌తో వాక్ వేలు (నడిచే దారులు) నిర్మిస్తారు. ఐలాండ్ రిసార్ట్ నీటిపై తేలుతూ, స్థిరంగా ఉండటానికి ఆయిల్ రిగ్స్ (చమురు తవ్వితీసే కేంద్రాల) తరహాలో ప్రత్యేక పరికరాలను అమర్చుతారు. ఈ ఐలాండ్ సముద్రంలో తేలుతూ కదులుతున్న కొద్దీ ఈ వలలో ప్లాస్టిక్ చెత్త చిక్కుతూ ఉంటుంది. దానిని గట్టిగా సంచుల్లో నింపి.. ఈ వాక్‌వేలలోనే గట్టిగా బిగిస్తారు. వాటిపై కాస్త ఇసుక, మట్టి వంటివి పరిచి, దారుల్లాగా మార్చుతారు. ఈ వాక్‌వేలు పూర్తయ్యాక చుట్టూ మరిన్ని మెష్‌లు ఏర్పాటు చేస్తారు. వాటిల్లో చిక్కుకునే ప్లాస్టిక్ చెత్తతో వాక్‌వేలను రూపొందిస్తారు. ఇలా దీవిని విస్తరించుకుంటూ వెళ్లవచ్చని రూపకర్తలు చెప్తున్నారు.
చదవండి: అగ్నిపర్వతంలో పడిపోయిన డ్రోన్ కెమెరా.. దానికి ముందు
Comments
Please login to add a commentAdd a comment