టెంట్‌హౌస్‌లు, ఆర్కిటెక్ట్‌లపైనా జీఎస్టీ! | GST for Tenthouses and Architects | Sakshi
Sakshi News home page

టెంట్‌హౌస్‌లు, ఆర్కిటెక్ట్‌లపైనా జీఎస్టీ!

Published Sun, Jul 2 2017 2:02 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

టెంట్‌హౌస్‌లు, ఆర్కిటెక్ట్‌లపైనా జీఎస్టీ!

టెంట్‌హౌస్‌లు, ఆర్కిటెక్ట్‌లపైనా జీఎస్టీ!

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, సీఏలూ పన్ను కట్టాల్సిందే
► వాణిజ్య సముదాయాల అద్దెల మీద సర్వీస్‌ జీఎస్టీ
► సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌కూ పన్ను కట్టాల్సిందే
► ప్రచురణ హక్కుల బదలాయింపు, సినిమా, టీవీ హక్కులకూ అదే పద్ధతి


సాక్షి, హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. కొత్తగా సర్వీస్‌ జీఎస్టీ కింద పన్ను పరిధిలోకి వచ్చే జాబితా బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా గతంలో సేవా పన్ను (సర్వీస్‌ ట్యాక్స్‌) పరిధిలోకి రాని చాలా అంశాలు.. తాజాగా జీఎస్టీ సేవల పన్ను కిందకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన తెలంగాణ జీఎస్టీ చట్టం ప్రకారం.. టెంట్‌హౌస్‌లు, ఆర్కిటెక్టులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, చార్టర్డ్‌ ఇంజనీర్లు వంటివారు కూడా జీఎస్టీ సేవా పన్ను పరిధిలోకి వస్తున్నారు.

అంటే ఏదైనా టెంట్‌హౌస్‌ కంపెనీ వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షల కన్నా మించితే... ఆ కంపెనీ కూడా కచ్చితంగా జీఎస్టీ కట్టాల్సిందే. ఈ లెక్కన పెద్ద పెద్ద ఫంక్షన్లకు టెంట్‌ సామగ్రి సరఫరా చేసే ఏజెన్సీలన్నీ ఈ పన్ను పరిధిలోనికి రానున్నాయి. ఇక ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ కేటగిరీలో సాహిత్య పుస్తకాల ప్రచురణ హక్కుల బదలాయింపు జరిగినా జీఎస్టీ కట్టాల్సి వస్తుంది. అయితే ఈ హక్కులు తీసుకునే సంస్థల వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షలు మించితేనే ఇది వర్తిస్తుంది. ఇదే కేటగిరీలో మ్యూజిక్‌ డెవలప్‌ మెంట్, సినిమా, టీవీ హక్కుల బదలాయింపు లు కూడా రానున్నాయి.

అద్దెలపైనా బాదుడే...
వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం ఇచ్చే భవనాలు లేదా సము దాయాలపై వసూలు చేసే అద్దెలు కూడా జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. వాణిజ్య కోణంలో అద్దెకు ఇచ్చే రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లపైనా పన్ను వసూలు చేయాలని రాష్ట్ర చట్టంలో పేర్కొన్నారు. ఈ కేటగిరీ కింద నగరాల్లో పన్నుల వసూళ్లు ఎక్కువగా ఉంటాయని, పదుల కోట్లలో ఈ ఆదాయం వస్తుందని పన్నుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఓ పెద్ద వాణిజ్య భవనాన్ని ఏదైనా బంగారు ఆభరణాల దుకాణానికి అద్దెకిస్తే.. ఆ అద్దె ఏడాదికి రూ.20 లక్షల కన్నా మించితే దానిపై సర్వీస్‌ జీఎస్టీ వసూలు చేస్తారు. అదే విధంగా ఫంక్షన్‌హాళ్లు, స్టార్‌ హోటళ్లు, బాంకెట్‌ హాళ్లు, హోమ్‌ సర్వీసెస్‌లను కూడా పన్ను పరిధిలోనికి తీసుకువచ్చారు.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు సమ్మెట పోటు!
సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ప్రోగ్రామింగ్, డిజైనింగ్‌లపైనా సర్వీసెస్‌ జీఎస్టీ విధించాలని రాష్ట్ర జీఎస్టీ చట్టంలో పేర్కొన్నారు. ఏదైనా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఒక ప్రోగ్రామ్‌ను తయారు చేసి ఇన్వాయిస్‌పై ఇతరులకు విక్రయిస్తే.. ఆ కంపెనీ వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షలకు మించితే ఆ లావాదేవీపై పన్ను వసూలు చేస్తారు. గతంలో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ మీద సర్వీస్‌ట్యాక్స్‌ మాత్రమే ఉండేది. కానీ 2013లో టీసీఎస్‌ సంస్థకు ఇచ్చిన పన్ను బిల్లులో సర్వీస్‌ ట్యాక్స్‌తో పాటు వ్యాట్‌ను కూడా విధించారు.

దానిని టీసీఎస్‌ యాజమాన్యం హైకోర్టులో సవాలు చేసింది. తమకు ద్విపన్ను విధానం వర్తించదని, సర్వీసుట్యాక్స్‌ మాత్రమే కట్టేందుకు అనుమతించాలని కోరింది. కానీ కోర్టు మాత్రం వాణిజ్య పన్నుల శాఖకు అను కూలంగా తీర్పునిచ్చి.. వ్యాట్‌ను కూడా కట్టాలని టీసీఎస్‌కు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చారు. కాగా ఏయే సర్వీసులు జీఎస్టీ పరిధిలోనికి వస్తాయనే దానిపై నాలుగైదు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement