ఆర్ట్ సైంటిస్ట్ ఆర్ట్, ఫ్యాషన్‌ను కలిపి తనదైన కళను ఆవిష్కరించింది ఢిల్లీకి చెందిన పాయల్ జైన్. ఫ్యాషన్ రంగంలో పేరుగాంచిన పాయల్ జైన్ మంచి ఆర్టిస్ట్ కూడా. ఆమె తాజా ఎగ్జిబిషన్....సోల్ ఆఫ్ ఏ ఉమెన్. ఎగ్జిబిషన్‌లో కనిపించే 30 పీస్‌లలో ప్రతిదాంట్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. చరిత్ర నుంచి కవిత్వం వరకు ఏదో ఒక అంశ ధ్వనిస్తుంది. ‘ఆర్ట్‌లో సైన్స్ ఉంటుంది. సైన్స్‌లో ఆర్ట్ ఉంటుంది’ అనే పాయల్ జైన్‌ను ఆర్ట్ సైంటిస్ట్‌గా పిలుచుకోవచ్చు.
ఫ్యాషన్ ఇండస్ట్రీలో తన మూడు దశాబ్దాల ప్రయాణానికి ‘సోల్ ఆఫ్ ఏ ఉమెన్’ ప్రతిబింబం అంటుంది పాయల్. ఈ ఎగ్జిబిషన్‌లోని ముప్ఫై పీస్‌లలో ప్రతి పీస్‌కు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మెక్సికన్ పెయింటర్ ప్రీదా ఖాలోను స్ఫూర్తిగా తీసుకొని ‘ఫర్‌బిడెన్ లవ్’ కలెక్షన్ రూపొందించింది. పాయల్ అభిమానించే ఖాలో పెయింటర్, మ్యాజికల్ సర్రియలిస్ట్, ఫెమినిస్ట్, రెవల్యూషనరీ.
పాయల్ ఆర్కిటెక్చర్ నుంచి ఫ్యాషన్ రంగంలోకి రావడానికి కారణం చిత్రకళ పట్ల తనకు ఉన్న అనురక్తి. స్కెచ్చింగ్ తనకు ఇష్టమైన పని. ఆమె తల్లి కూడా ఆర్టిస్టే. సితార్ అద్భుతంగా వాయించేది. తన కలల గురించి తల్లిదండ్రులకు చెప్పిప్పుడు ‘ ఏదో ఒక డిగ్రీ నీ చేతిలో కనిపించాలి. ఆ తరువాతే ఏదైనా’ అన్నారు. అలా బీకామ్ పూర్తి చేసింది.
పాయల్ స్కెచ్చింగ్ నైపుణ్యాన్ని చూసి ‘నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రయత్నించవచ్చు’ అని సలహా ఇచ్చారు సన్నిహితులు. మొదట ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించి పుస్తకాలు, మ్యాగజైన్స్ విరివిగా చదివేది. అలా ఫ్యాషన్ కూడా తన ప్యాషన్‌గా మారింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది.
‘ఫ్యాషన్‌కు ఆర్ట్, సైన్స్ అనే రెండు కోణాలు ఉంటాయి. ఆర్ట్ అనేది సృజనాత్మకతకు సంబంధించిన కోణం, సైన్స్ అనేది సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన కోణం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నా దృష్టిని విశాలం చేసింది. ప్యాటర్న్‌మేకింగ్, డ్రాపింగ్, గ్రేడింగ్, ఇలస్ట్రేషన్, ఫ్యాషన్ మార్కెటింగ్...ఇలా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను’ అంటున్న పాయల్ ఎన్నో కార్పొరేట్ హోటల్స్‌కు ఆకట్టుకునేలా ‘హోటల్ యూనిఫామ్’ను డిజైన్ చేసి ఇచ్చింది. ‘డిజైనర్స్ అంటే గొప్ప ఏమీ కాదు. గ్లోరిఫైడ్ టైలర్స్ మాత్రమే’ అని చాలామంది అనుకొని అపోహపడే కాలంలో డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించింది పాయల్. ఆమె వెస్ట్రన్ క్లాతింగ్ మొదలుపెట్టినప్పుడు దానికి మార్కెట్ లేదు. అయితే ఆ తరువాత మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది.
పాయల్ సక్సెస్ మంత్రా ఏమిటి?
ఆమె మాటల్లోనే చెప్పాలంటే...‘చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే ధోరణిలో కాకుండా మనం చేస్తున్న పనిని మనసారా ప్రేమించాలి. నిద్ర, శ్వాస, కలలో మన లక్ష్యం కనిపించాలి. ఫెయిల్యూర్‌కు చోటివ్వకుండా సాంకేతిక జ్ఞానంపై గట్టి పట్టు సంపాదించాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనల్లో కొత్తదనం వచ్చేలా చూసుకోవాలి. ప్రశంసలు ఆస్వాదించడానికి మాత్రమే పరిమితమైపోకుండా అన్ని కోణాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి.
మార్పులు చేర్పులు చేసుకోవాలి. సానుకూల శక్తి, సంకల్పబలం ఎప్పటికీ మనకు తోడుగా ఉండాలి’ కెరీర్ తొలి రోజుల్లో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది పాయల్. చేదుజ్ఞాపకాలుగా కాదు...ఆ సమయంలోనూ తాను ఎంత ధైర్యంగా ఉందో మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకోవడానికి. ‘విజయం ధైర్యవంతులను వెదుక్కుంటూ వస్తుంది’ అని చెప్పడానికి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆమె తెచ్చుకున్న పేరే నిదర్శనం.
(చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?)
Comments
Please login to add a commentAdd a comment