![Valentines Day 2025: Couples In Love United By Art](/styles/webp/s3/article_images/2025/02/14/love2.jpg.webp?itok=hceqLuI9)
కళాభిరుచిని కొనసాగించాలంటే.. కలలు కనాలి. అలాంటి కలలే కన్న మరో జత కనులు తోడైతే.. కల సాకారం అవడం తథ్యం. నచ్చిన అభిరుచిని పంచుకుంటూ పరస్పరం ప్రేమను పెంచుకుంటూ దగ్గరైన హృదయాలు ఆలపించే యుగళగీతం మృదు మధురంగా ఉంటుంది. ఆ మధురిమలు ఆస్వాదిస్తున్న కొన్ని జంటల్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పలకరించినప్పుడు.. తమ రెండు హృదయాలను ఒకటి చేసిన కళాత్మక జ్ఞాపకాలను
నెమరువేసుకున్నారిలా..
ప్రేమించాలనుకోలేదు.. పెళ్లి చేసుకోవాలనుకున్నా..
నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు గాయనిగా, ఆయన(రేణుకాప్రసాద్) ఇంటర్‌లో ఉండగా మృదంగం కళాకారుడిగా.. మా ఇద్దరికీ ప్రథమ పరిచయం. సంప్రదాయ సంగీతం అంటే ఇద్దరికీ ప్రాణం. చిన్న వయసు నుంచే కలిసి ‘కళ’లు పండించుకున్నాం. ఎన్నో వేదికలపై ఎన్నో కార్యక్రమాలు కలిసి చేయడం వల్ల సహజంగానే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం, అభిమానం.. ఆ తర్వాత నాకు పెళ్లి వయసు వచ్చే సమయానికి నా ఫ్రెండ్స్ అనేక మంది పెళ్లిళ్లు చేసుకుని తమకెంతో ఇష్టమైన కళకు వీడ్కోలు పలకాల్సి రావడం కళ్లారా చూశాను.
చాలా వరకూ అత్తింటి ఆంక్షలే అందుకు కారణం అవడం కూడా గమనించాను. ఎంతో శ్రమించి అభిమానించి ప్రాణంగా ప్రేమించిన కళను పెళ్లి కోసం వదిలేసుకోవాల్సి రావడం చూశాక.. తప్పనిసరిగా నాతో పాటు ఇదే రంగంలో ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా అనుకున్న వెంటనే నా మదిలో ఆయనే మెదలడం.. బహుశా దాన్నే ప్రేమ అనుకోవచ్చేమో.. ధైర్యంగా నా మనసులో మాట ఆయనకు చెప్పడం..
ఆయన కొంత సమయం తీసుకుని ఓకే చెప్పడం.. నేను ఇంట్లో వాళ్లని కన్విన్స్ చేయడం.. వరుసగా జరిగిపోయాయి. మా పెళ్లితో సహా.. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ కలిసి సాగుతున్న మా కళాత్మక ప్రయాణం.. చక్కని చిక్కని సంగీతంలా కన–వినసొంపుగా సాగిపోతూనే ఉంది.
శ్వేత, ప్రముఖ గాయని
కలర్ ఫుల్.. కళ కపుల్..
కలిసి చదువుకున్నాం.. కలిసి బొమ్మలేశాం.. కలిసి ఏడడుగులు నడిచాం.. నగరంలోని జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులుగా ఉన్నప్పుడు తొలుత పెయింటింగ్ అంటే మాకున్న ఇష్టాల్ని పంచుకున్నాం. అలా అలా పరస్పరం ప్రేమను పెంచుకున్నాం. మా ప్రేమ ప్రయాణం మీద మాకెంత నమ్మకం వచ్చిందంటే.. వృత్తిలోనో, ఉద్యోగంలోనో స్థిరపడాలి ఆ తర్వాతే పెళ్లి అనే ఆలోచన కూడా చేయకుండా.. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉండగానే పెళ్లి చేసేసుకున్నాం.
ఆ తర్వాత స్ట్రీట్ ఆర్టిస్ట్స్‌గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైవిధ్యభరితమైన ఆర్ట్ వర్క్స్ గీశాం. తద్వారా సిటీలో పుట్టిన క్యూరియాసిటీ.. మా కపుల్ ఆర్ట్‌కి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరం కలిసి నగరంలోని పలు గోడలమీద బొమ్మలు గీసిన రోజులు మాకు ఇంకా గుర్తున్నాయి. ఫ్రెండ్స్‌గా మొదలుపెట్టి ఫ్రాన్స్ ఆర్ట్ ఫెస్టివల్ దాకా.. ఇంకా అనేకానేక జ్ఞాపకాలతో సాగుతున్న మా కలర్‌ఫుల్ జర్నీకి బాటలు వేసింది మా ప్రేమే..
– విజయ్, స్వాతి ప్రముఖ చిత్రకారులు
పాట కలిపిన ప్రేమ బాట గురించి వారి మాటల్లోనే..
పాటల ప్రయాణంలో.. చిగురించిన ప్రేమ.. ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.., ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా.., ఈ రాతలే దోబూచులే.. అంటూ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో అద్భుతమైన ప్రేమ గీతం పాడిన సింగర్ హరిణి ఇవటూరి.. తన జీవితంలో మాత్రం కలవని ఇరు ప్రేమికుల్లా ఉండకూడదు అనుకుందో ఏమో.. తన స్వరానికి తోడుగా మరో స్వరాన్ని ప్రేమతో కలిపేసుకుంది. సలార్‌లో తను పాడిన.. సూరీడే గొడుగు పట్టి, వచ్చాడే భుజం తట్టి.. చిమ్మచీకటిలోనూ నీడలా ఉండేటోడు.. రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు.. అనే పాటను ప్రతిబింబించేలా తన ప్రియసఖుడు భాస్కరుని సాయిచరణ్ ఆమె ప్రేమకు పెళ్లి కానుక అందించారు. ఆయనెవరో కాదు.. ప్రముఖ హిట్ మూవీస్ హనుమాన్, కాటమరాయుడు, సుప్రీమ్ వంటి సినిమాల్లో హిట్ సాంగ్స్‌తో తెలుగు సంగీత ప్రియుల మన్ననలను పొందినవాడే..
మా మొదటి పరిచయం 2011–12 సంవత్సర కాలంలో ఓ టీవీ ఛానెల్‌లో నిర్వహించిన పాటల కార్యక్రమంలో.., కానీ మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది మాత్రం ప్రముఖ సింగర్ బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో నిర్వహించిన సంగీత ప్రదర్శనల్లోనే.. ఈ ప్రదర్శనల కోసం చాలా చోట్లకు ప్రయాణం చేశాం.. ఈ సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారాం.. ఒకానొక సమయంలో మా బంధం స్నేహం మాత్రమే కాదు అంతకుమించి అనిపించింది.
అలా 2014లో మా స్నేహం కాస్త ప్రేమని తెలుసుకున్నాం. ‘హరిణికి తన పైన ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని.. ‘స్నేహానికి మించిన బంధంమనది అనిపిస్తుంది, ఇకపై నువ్వు నన్ను అన్నయ్య అని పిలువు’ అని సాయి చరణ్ ఆర్డర్ వేయగా, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్య అని పిలువను అని చెప్పకనే తన ప్రేమను చెప్పిందని తమ ప్రేమ స్మృతులను గుర్తు చేసుకున్నారు’. మేమే కాకుండా మా స్నేహం వల్ల మా ఇద్దరి కుటుంబాలు కూడా కలిసిపోయాయి. కానీ.. అప్పటికీ మేమింకా సెటిల్ కాలేదు.
మా కుటుంబాల్లో ప్రేమ పెళ్లి ఒప్పుకుంటారా అనే అనుమానంతో భయపడ్డాం. ఇరు కుటుంబాలపైన ఉన్న నమ్మకంతో నిజాయితీగా మా ప్రేమ విషయం చెప్పడం, మా ప్రేమను గౌరవించి వారు కూడా ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. కానీ మీరు సెటిల్ అయ్యాకే కలిసి జీవితాన్ని ప్రారంభించండి అనే వారి సూచన మేరకు మూడేళ్ల తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మాకొక బాబు ఉన్నాడు. పెళ్లికి ముందు ఈ ప్రేమ గురించి మా గురువు బాలసుబ్రహ్మణ్యంకు తెలపగా., కుటుంబ సభ్యులు ఒప్పుకోకుంటే తను మాట్లాడతానని భరోసా ఇచ్చారు.
పెళ్లికి రావడంతో పాటు పెళ్లి కానుకగా మా కోరిక మేరకు మా ఇంటికి భోజనానికి వచ్చి ఆశీర్వదించారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, విశ్వంభర వంటి సినిమాల్లో పాటలు పాడుతున్నాం. ఆస్కార్ విజేత కీరవాణి సంగీత దర్శకత్వంలో రాజమౌళి–మహేష్ బాబు ప్రాజెక్టుకు సైతం పాడుతున్నాం. ప్రేమికులు ఎవరికైనా వేరు వేరు ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి. కేవలం 10 శాతం మాత్రమే ఆ ఇద్దరికీ ఆలోచనలు కలుస్తాయి. ఈ విషయంలో సమన్వయం ఉంటే ప్రేమ జీవితం అద్భుతంగా కొనసాగుతుంది.
– భాస్కరుని సాయి చరణ్, హరిణి
నాటి అభిమాని.. నేటి జీవిత భాగస్వామి..
తను (డా.బిజినా సురేంద్రనాథ్) కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ విద్యార్థినిగా ఉన్నప్పుడు నేను కూచిపూడి నృత్యకళాకారుడిగా ప్రదర్శనలు ఇస్తుండేవాడిని. ఒకసారి సిలికానాంధ్ర కార్యక్రమంలో మేము ఇద్దరం కలిసి ప్రదర్శన ఇచ్చాం. అప్పుడే తను నా ప్రదర్శనలు చూస్తున్నానని, నా నృత్యానికి అభిమానినని చెప్పింది.
నిజం చెప్పాలంటే ఆ ప్రదర్శనలో నాకన్నా తనే బాగా నృత్యం చేసింది. ఆ విషయం తనతో చెప్పాను. అక్కడి నుంచి ఇద్దరం సన్నిహితులమయ్యాం. నృత్యం అంటే ఉన్న ఇష్టం పరస్పరం ఒకరి మీద ఒకరికి కూడా ఏర్పడింది. కొంత కాలం తర్వాత మేం పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నాకు సరైన ఉద్యోగం లేదని ఆమె ఇంట్లో వాళ్లు అభ్యంతరం పెట్టారు.
దాంతో నేను సెటిలయ్యాకే వివాహం చేసుకుందామని అనుకుని.. ఇద్దరం కలిసి ప్రణాళికాబద్ధంగా ప్రదర్శనలు ఇస్తూ వచ్చాం. ఏడాదిలోనే నేను మంచి స్థితికి రావడంతో మా పెళ్లికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ.. మా నడక నర్తన సంతోష భరితంగా సాగిపోతున్నాయి.
– సురేంద్రనాథ్, కూచిపూడి నృత్యకళాకారుడు.
(చదవండి: చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్ లవ్ స్టోరీ..!)
Comments
Please login to add a commentAdd a comment