![Movie First Looks Release for Upcoming Movies in Tollywood: Valentine Day 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/siddhu.jpg.webp?itok=OszC-3xa)
ప్రేమికుల రోజు(Valentine Day) సందర్భంగా ప్రేమ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల నుంచి ‘లవ్ అప్‌డేట్స్ గురూ’ అంటూ శుక్రవారం కొందరు తమ సినిమాల నుంచి పాటలు, లుక్స్ రిలీజ్ చేయగా, మరికొందరు సినిమా విడుదల తేదీలను ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళదాం...
⇒ నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వేర్‌ఎవర్ యు గో’.. అంటూ సాగే రెండో పాటని హీరో మహేశ్‌బాబు లాంచ్ చేశారు. ఈ పాటని కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ పాడారు.
⇒ సిద్ధు జొన్నలగడ్డ రోగా నీరజా కోన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది.
⇒ కిరణ్ అబ్బవరం హీరోగా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సింది. అయితే తాజాగా మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, కిరణ్ అబ్బవరం పోస్టర్‌ని రిలీజ్ చేశారు.
⇒ సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి సుహాస్, మాళవికా మనోజ్‌ల సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
⇒ హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కోర్ట్–స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ప్రేమలో..’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడారు.
⇒ మోహిత్ పెద్దాడ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకత్వంలో దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ యునిక్‌గా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment