
ఫిబ్రవరి అనగానే ఠక్కున ప్రేమికుల రోజు గుర్తొచ్చేస్తుంది. అదీగాక ఆ నెలంతా కూడా హగ్ డే, కిస్ డే వంటివి వచ్చి.. చివరికి ప్రేమికుల రోజుతో ముగుస్తుంది. రొమాంటిక్ భావనను కలుగజేసే ఆ నెలలో ఉండే సందడి అంత ఇంత కాదు. ప్రేమికులు, వివిధ ప్రేమలు సినిమాలు, టీవీల పుణ్యమా అని వాటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాం. కానీ వేల ఏళ్ల చరిత్ర కాలంలోనే హృదయాల్ని కదిలించే అందమైన ప్రేమ కథలు ఉన్నాయి. అవి వింటుంటేనే మనసు అదొలా అయిపోతుంటుంది. మరీ ఈ వాలెంటైన్స్‌డే సందర్భంగా చరిత్ర ముడిపడి ఉండి, అజరామరంగా నిలిచిపోయిన అందమైన లవ్ స్టోరీలను గురించి తెలుసుకుందామా..!
మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా:
చరిత్రకారులను బాగా ఆకర్షించిన ప్రేమ కథల్లో ఒకటి మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా కథ. జూలియస్ సీజర్ మరణం తరువాత, రోమన్ సామ్రాజ్యాన్ని ముగ్గురు వ్యక్తులు పరిపాలించారు. వారే మార్క్ ఆంటోనీ, ఆక్టేవియస్ సీజర్, లెపిడస్. మార్క్ ఆంటోనీ తూర్పు మధ్యధరాను శాసిస్తూ ఈజిప్టులో నివసిస్తున్నాడు. అతను ఈజిప్ట్ రాణి క్లియోపాత్రాతో కూడా ప్రేమలో పడ్డాడు. ఆంటోని తన భార్య ఫుల్వియా మరణం, తన తోటి పాలకుడు ఆక్టేవియస్ సీజర్‌పై పాంపే తిరుగుబాటు తదితరాల వల్ల ఆంటోనీ రోమ్‌కు వెళ్లవలసి వస్తుంది.
అతను తన స్నేహితుడు ఎనోబార్బస్‌తో కలిసి ప్రయాణిస్తాడు. అయితే ఆంటోనీకి తన స్నేహితుడు ఆక్టేవియస్ సీజర్‌కి కొన్ని కారణాల వల్ల మనస్పర్థలు వస్తాయి. దీంతో వీటిని రూపుమాపుకునేలా సీజర్ సోదరి ఆక్టేవియస్‌ని రాజకీయ వివాహం చేసుకుంటాడు. ఈ వివాహంతో లెపిడస్‌తో సహా పాలకులు తిరుగుబాటుదారుడైన పాంపేతో శాంతి ఒప్పందం ఏర్పరుచుకుంటాడు ఆంటోని.
అయితే ఆంటోని మాటతప్పి మళ్లీ క్లియోపాత్ర వద్దకు వెళ్లిపోతాడు. దీంతో విసిగిపోయిన ఆక్టేవియస్ సీజర్ తాము ఏర్పరచుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకుని మార్క్ ఆంటోని, క్లియోపాత్రలపై యుద్ధం చేసేందుకు దిగుతాడు. అయితే ఈ యుద్ధంలో ఆంటోని ఓటమిని చవి చూడాల్సి వస్తుంది. ఓపక్క తన ప్రాణ స్నేహితుడు ఎనోబార్బస్ సైతం ఈ కష్టకాలంలో వదిలి దూరంగా వెళ్లిపోతాడు.
మరోవైపు క్లియోపాత్రకు ఆంటోని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని దూరం జరిగే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే క్లియో పాత్ర సైనికులు ఆంటోనికి సహకరించకుండా పారిపోవడం జరుగుతుంది. దీంతో ఆంటోనికి క్లియోపాత్ర తనను మోసం చేసిందన్న కోపం ఎక్కువవ్వుతుంటుంది. కానీ క్లియోపాత్ర అతడి ప్రేమను పరీక్షించే నిమిత్తం తన సహచర చెలికెత్తలతో తాను మరణించినట్లుగా వార్త పంపిస్తుంది.
ఈ వార్త విని ఆంటోని కుంగిపోయి తన కత్తితో పొడుచుకుని చనిపోతాడు. వెంటనే అతడిని క్లియోపాత్ర పరిచారికలు అతడిని ఆమె వద్దకు తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఆంటోని ఆమె చేతిలోని ప్రాణాలు వదిలేస్తాడు. మరోవైపు ఆక్టేవియస్ సీజర్ దండయాత్ర చేసుకుంటూ రోమ్ వైపుకి వచ్చేస్తుంటాడు. దీంతో ఆమె ఒక విషపాముతో కరిపించుకుని మరీ ప్రాణాలు వదిలేస్తుంది. ఇక్కడ ఇరువురు ఎంతో గాఢంగా ప్రేమించుకునన్నారు చిన్న మనస్పర్థ ఒకరినొకరు దూరం చేసుకునేందుకు కారణమైంది. అయితే వారికి ప్రాణాలు కోల్పోయిన టైంలో తమది నిజమైన ప్రేమ అని గుర్తించడం బాధకరం.
ముంతాజ్ మహల్- షాజహాన్: !
అర్జుమంద్ బాను బేగంగా జన్మించిన ముంతాజ్ మహల్ యువరాజు ఖుర్రామ్(షాజహాన్ ) హృదయాన్ని దోచుకుంది. ఆమె కేవలం ఖుర్రామ్‌కి రాణి మాత్రమే కాదు నమ్మకమైన సలహాదారు, సహచరురాలు. అయితే ముంతాజ్ విషాదకరంగా 1631లో తన పద్నాలుగో బిడ్డకు జన్మినిస్తున్నప్పుడు ప్రాణాలు వదిలేస్తుంది.
దీంతో షాజహాన్ ఏళ్ల తరబడి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆమె జ్ఞాపకార్థం కట్టించిన స్మారక చిహ్నమే తాజ్ మహల్. ఏడు వింతల్లో ఒకటిగా నిలవడమే గాక యునెస్కో గుర్తింపును కూడా పొందింది. ఏటా లక్షలాదిమంది ఈ మహల్‌ని చూసేందుకు రావడమే గాక శాశ్వత ప్రేమకు చిహ్నంగా కీర్తిస్తారు.
రోమియో - జూలియట్:
ఈ ప్రేమ కథ వెరోనా నగరంలో జరిగింది. ఇరువురి కుటుంబాల నేపథ్యం వేరు. దీంతో వీరిద్దరిని కలవనిచ్చేవారు కాదు బంధువులు. అయినప్పటికి వాళ్ల కళ్లుగప్పి కలుసుకుంటూనే ఉండేవారు. తమ ప్రేమను ఎలాగైన నిజం చేసుకోవాలని ఇరువురు ఆరాటపడ్డారు.
అయితే రోమియో అనుకోకుండా జూలియట్ బంధువు టైబాల్ట్‌ను క్షణికావేశంలో చంపడం జరుగుతుంది. ఈ నేరం కారణంగా రోమియోను వెరోనా నగరం నుంచి బహిష్కరిస్తారు. దీంతో ఇరువురూ ఒకరినొకరు చూసుకోలేనంత అగాథం ఏర్పడుతుంది. అయితే రోమియోకి జూలియట్ చనిపోయినట్లు నమ్మించేలా ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు చూపిస్తారు ఆమె బంధువులు.
దీంతో జూలియట్ లేకుండా జీవించలేనంటూ ప్రాణం తీసుకుంటాడు. ఇంతలో మెల్కొన్న జూలియంట్ రోమియో చనిపోవడం దుఃఖంతో గట్టిగా విలపిస్తుంది. అలా ఏడుస్తూనే ప్రాణాలు వదిలేస్తుంది. అప్పడు గానీ వారి స్వచ్ఛమైన ప్రేమను గుర్తించరు అక్కడి ప్రజలు.
షిరిన్- ఫర్హాద్: ఇది పర్షియన్ ప్రేమ కథ. అందమైన ఆర్మేనియన్ యువరాణి షిరిన్. ఆమె అందం ససానియన్ రాజు ఖోస్రో II దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే ఫర్హాద్ శిల్పి, రాతికట్టడాలను నిర్మించడంలో నేర్పరి. ఇరువురి మధ్య హోదాల పరంగా చాలా వ్యత్యాసం ఉంది. అయినా వాటన్నింటిని పక్కన పెట్టి ఒకరినొకరు విడిచి ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు.
అయితే వీరిని ఎలాగైన విడదీయాలన్న ఉద్దేశ్యంతో యువరాజు ఖోస్రో ఫర్హాద్‌కి కష్టమైన పనులన్నీ అప్పగించేవాడు. అన్నింటిని అలవోకగా చేసేయడంతో చివరికి షిరిన్ చనిపోయినట్లు అబద్ధం చెబుతాడు. ఆ వార్త వినడంతోనే కుప్పకూలిపోతాడు ఫర్హాద్. ఆవేదనతో తమ ప్రేమను ఏ పర్వతంపై చెక్కాడా అక్కడకే వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడు. ఫర్హాద్ మరణవార్త విని అతడున్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది షిరిన్. ఆమె కూడా అక్కడ నుంచే దూకి చనిపోతుంది.
లైలా-మజ్నున్:
పర్షియన్, అరబిక్ సాహిత్యంలో భావితరాల కోసం భద్రపరచబడిన గొప్ప ప్రేమ కథ లైలా-మజ్నులది. మజ్నుగా పిలిచే ఖైస్ కవి. అతడు సంపన్న కుటుంబానికి చెందిన లైలాతో ప్రేమలో పడతాడు. లైలా అందం, తెలివిలో ఆమెకు సాటిలేరెవ్వరూ. అయితే మజ్ను ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అందువల్ల లైలాకు అతడు తగిన జోడి కాదని ఇరువురి కుటుంబాలు వారి ప్రేమను నిరాకరిస్తాయి.
అయినా కూడా వాటిని లెక్కచేయకుండా తమ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చూపించాలాని భావిస్తారిద్దరు. విధి మరోలా వారిప్రేమను పరీక్షించింది. ఇక్కడ లైలా తండ్రి మరో సంపన్న వ్యక్తితో పెళ్లి చేసి పంపేస్తాడు. లైలా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న విరహంతో పిచ్చి వాడైపోతాడు మజ్ను.
అక్కడ లైలా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. రాజభోగాల మధ్య ఉన్నా.. ముళ్లమీద కూర్చున్నట్లుగానే ఉంటుంది ఆమెకు. మనసు ఎల్లపుడూ కైస్ చుట్టూనే తిరుగుతుంటుంది. కొన్నేళ్లకు భర్తతో కలిసి ఆమె ఇరాక్ వెళ్లిపోతుంది. కొద్దిరోజులకే అక్కడ అనారోగ్యం బారినపడి లైలా కన్నుమూస్తుంది. లైలా మరణవార్త తెలుసుకున్న కైస్ మిత్రులు విషయం అతడికి చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తారు.
కానీ, కైస్ జాడ దొరకదు. కొద్దిరోజుల తర్వాత ఓ చోట కైస్ ఆచూకీని కనుగొంటారు. వాళ్లు అక్కడికి వెళ్లి చూడగా.. కైస్, లైలా సమాధి దగ్గర ప్రాణం లేకుండా పడి ఉంటాడు. లైలా కోసం పిచ్చివాడిలా తిరగటం వల్లే కైస్‌కు మజ్ను అనే పేరు వచ్చిందని అంటారు చరిత్రకారులు. ఎందుకంటే "మజ్ను లైల" అంటే లైలా కోసం పిచ్చివాడిలా తిరిగిన వాడు అని అర్థం వస్తుంది. వారిప్రేమ విషాదంగా ముగిసినా..ఇప్పటికీ ప్రేమికులు వారిని తలుచుకుంటూనే ఉంటారు. అలాగే "ప్రేమ" అనగానే ఆ ఇరువురే గుర్తు వచ్చేలా చిరస్మరణీయంగా నిలిచిపోయారు.
(చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!)
Comments
Please login to add a commentAdd a comment