
తెలంగాణ వారసత్వ సంపద, సాంస్కృతిక వైభవం, కళలను పరిరక్షించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కళాయజ్ఞ బృందం, టార్చ్ సంస్థ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. గత చరిత్ర వైభవాన్ని, విశిష్టతను తెలియజెప్పే మాధ్యమాలుగా ఎన్నో పుస్తకాలు, ఆడియో, వీడియో, గ్రంథాలు ఇలా అనేక రూపాల్లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి నేలపై ఘన చరిత్ర కలిగిన కాకతీయ సామ్రాజ్యపు విశిష్టత, కళా సాంస్కృతిక వైభవం, ఈ కట్టడాలు, శిల్పాలపైనే ప్రతిబింబించి ఉంది. కానీ మన చరిత్రలో భాగమైన పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరి వాటి వాస్తవ రూపాలను, కళను కోల్పోనివి ఎన్నో ఉన్నాయి. ఆ శిల్ప కళ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది, వాటి సంరక్షణ, పరిరక్షణ ఎంత వరకూ అవసరం అనే నేపథ్యంలో కళాయజ్ఞ బృందం, టార్చ్ సంస్థ ఆధ్వర్యంలో శిథిలమైన పురాతన కట్డడాలు, ఆలయాలు ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టేలా లైవ్ స్కెచింగ్, పెయింటింగ్స్ గీశారు.
ఈ ప్రాజెక్టులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా 50 మంది కళాత్మక నైపుణ్యం కలిగిన సభ్యులు కాకతీయుల అద్భుత కట్టడాల పరిస్థిని లైవ్‌స్కెచింగ్, పెయింటింగ్ ద్వారా ఈ తరానికి తెలియజేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జనవరి నెల్లో పెద్దపల్లి జిల్లా మంథనిలోని చెంద్రవెళ్లి దేవాలయాలు, ఘనపురం కోటగుళ్లు, రామప్ప దేవాలయాలకు టార్చ్ కళాయజ్ఞలో భాగంగా కళాత్మక రూపాన్ని అందించారు.
శిథిలావస్థలో ఉన్న ఇక్కడి సాంస్కృతిక కళా వైభవానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. కొందరు ఆర్టిస్టులు ఈ కళాసంపద శిథిలం కాకముందు ఎలా ఉండేదో అని ఊహాజనిత చాత్రాలను సైతం గీశారు. ఈ చిత్రాలను ‘శిలా నిశ్శబ్దం’ పేరుతో ఈ నెల 12 నుంచి 14 వరకూ మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. ఈ ప్రయత్నానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
చరిత్రకు సాక్ష్యాలుగా..
కళా సంపద పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసేలా చేపట్టిన ఈ ప్రాజెక్టులో కళాకారులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. కళా వైభవమున్న ఆ ఆలయాల వద్దకే వెళ్లి ధ్వంసమైన ఈ నిర్జీవ కళలను వారి కళాత్మక రేఖలతో ఈ తరానికి చేరువ చేశారు.
అంతేకాకుండా ఈ కళా ప్రయోగాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో పోలిస్తే కాకతీయులకు సంబంధించి తెలియని ఘన చరిత్రే ఎక్కువ. ఈ మేరకు అన్వేషణ కొనసాగిస్తున్న కళాయజ్ఞ–టార్చ్ బృందం తమ పరిశోధనలో వెలుగులోకి వచ్చిన సమాచారాన్ని భద్రపరిచి ముందుతరాలకు అందిస్తుంది. కోలి్పయింది ఎంతైనా.. మిగిలుంది ఈ తరానికి ఘనమైనవారసత్వ సంపదే. దానిని భవిష్యత్ తరాలకు మరింత భద్రంగా అందించాల్సిన భాధ్యత అందరిపైనా ఉంటుంది.
దశాబ్దాల క్రితమే వైభవంగా..
అద్భుతమైన వారసత్వ కళా సంపదకు నెలవు ఈ తెలంగాణ నేల. ఎన్ని దండయాత్రలు జరిగినా ఇప్పటికీ సగర్వంగా అప్పటి కళా వైభవాన్ని ప్రదర్శిస్తున్నాయి ఆ రూపాలు. కానీ సంరక్షణ, భద్రత లేకపోవడంతో శిథిలావస్థలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఒక కళాకారుని దృష్టి, కళాత్మక కోణం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మేమంతా కలిసి ఈ ప్రాజెక్ట్ చేపట్టి, ఆ చిత్రాలను ‘శిలా నిశ్శబ్దం’గా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నాం. ప్రస్తుతం విదేశాలు గొప్పగా ఉన్నాయని చర్చించుకుంటాం.. కానీ శతాబ్దాల క్రితమే మన నేల యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా ఉందనే సత్యాన్ని మన శిల్పకళ చెబుతోంది. ఆ ఆనవాళ్లను కాపాడుకుందాం.
– శేషబ్రహ్మం, ప్రముఖ చిత్ర కళాకారులు
(చదవండి: Cleanest City: మరో ఇండోర్‌లా.. భాగ్యనగరం కాగలదా..?)