కళా ప్రేమికులకు గూగుల్ కొత్త యాప్!
న్యూఢిల్లీః ఇంటర్నెట్ దిగ్గజం.. గూగుల్ సెర్ష్ ఇంజిన్ మరో కొత్త యాప్ ను ప్రారంభించింది. భారత్ లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలనుంచి సేకరించిన ప్రసిద్ధ రచనలు, కళాఖండాల గురించి తెలుసుకునేందుకు గూగుల్ కల్చరల్ ఇనిస్టిట్యూట్ కొత్త యాప్ ను కళా ప్రేమికులకు అందుబాటులోకి తెచ్చింది.
వినియోగదారులకోసం గూగుల్ కొత్తగా 'ఆర్ట్ అండ్ కల్చర్' యాప్ ను సృష్టించింది. యాప్ తో పాటు వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. ప్రపంచంలోని అనేక కళలకు సంబంధించిన సమాచారాన్ని అందులో పొందుపరచి కళాభిమానులకు దగ్గరయ్యేందుకు.. సెర్చ్ ఇంజన్ వినూత్న ప్రయత్నం చేసింది. విశ్వవ్యాప్తంగా 70 దేశాల్లోని మ్యూజియాల్లోని అనేక కళాఖండాలు, సుప్రసిద్ధ రచనలను గురించి తెలుసుకునేందుకు సహాయపడేట్లుగా ఈ కొత్త యాప్ ను గూగుల్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన అనువర్తనం ద్వారా.. ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన బీహార్లోని నలంద విశ్వవిద్యాలయ చరిత్ర వంటి ఏదైనా కళలు, సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు శోధించి తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది.
ప్రముఖ చిత్రకారులు, ఆధునిక భారతీయ చిత్రకళ వంటి అనేక విషయాలను కళా ప్రేమికులు గూగుల్ 'ఆర్ట్ అండ్ కల్చర్' యాప్ ద్వారా తెలుసుకోవచ్చని గూగుల్ కల్చరల్ ఇనిస్టిట్యూట్ ప్రొడక్ట్ మేనేజర్ డంకన్ ఓస్బోర్న్ ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశం లోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ను కూడా గూగుల్ కార్డ్ బోర్డ్ అందుబాటులోకి తెస్తోంది. ఈ హెడ్ సెట్ ద్వారా 1978 లో స్థాపించిన అతిపెద్ద భారత కళా, సాంస్కృతిక సంగ్రహాలయంలో వినియోగదారులు వాస్తవిక కళా, సాంస్కృతిక పర్యటన చేసే అవకాశం ఉంటుందని చెప్తోంది. అలాగే ఈ కొత్త గూగుల్ ఆర్ట్ అండ్ కల్చర్ ను యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చని వెల్లడించింది.