గోవా కళాప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహిళ శారదా కేర్కర్. ఆమె యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేసింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్పెషలైజేషన్ చేసింది. ఇండియాకి వచ్చి గోవాలో మ్యూజియం ఆఫ్ గోవా (ఎంఓజీ)కి చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. చిల్డ్రన్ ఆర్ట్ స్టూడియో స్థాపించి పిల్లలకు కళారంగం కోసం కొంత సమయాన్ని కేటాయించే అవకాశం కల్పించింది. కళారంగంలో ఉపాధి పొందడానికి అవసరమైన భరోసా కల్పిస్తూ కళాసాధనను లాభదాయకమైన వృత్తిగా మార్చింది.
గోవా రాష్ట్రాన్ని కళలు, కళారంగం, వాటికి మార్కెట్ కల్పిస్తూ సామాజిక వ్యవస్థాపనల దిశగా నడిపిస్తోంది శారదాకేర్కర్. సాహిత్యం, రంగస్థలం, విజువల్ ఆర్ట్స్, సంగీతం, నాట్యరీతులను సుసంపన్నం చేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోంది. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులను ఒక్కో విభాగాన్ని ఒక్కో కేటగిరీగా వర్గీకరించి వారి కళారూపాల ప్రదర్శనలను నిర్వహిస్తోందామె.
అలాగే సాంకేతికత సహకారంతో సృజనాత్మక రంగంలో ఎన్ని ప్రయోగాలు చేయవచ్చనేది ఆచరణలో చూపిస్తోంది. గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్యాషన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, యానిమేషన్, గేమింగ్, ఆర్ట్ డైరెక్షన్, సౌండ్ ఇంజనీరింగ్ వంటి సృజనాత్మకమైన ఉపాధి రంగాలను కళల విభాగంలోకి తీసుకువస్తూ కళారంగాన్ని విస్తరిస్తోంది శారద కేర్కర్.
గడచిన తొమ్మిదేళ్లలో 600 మంది హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో ఎమ్‌ఓజీ నిర్వహించిన ఎగ్జిబిషన్‌లలో పాల్గొన్నారు. దివ్యాంగులైన కళాకారుల చిత్రాలతో ‘ఆర్ట్ ఇంక్’, పిల్లల చిత్రాలతో ‘ఏ వరల్డ్ ఆఫ్ మై ఓన్’, మహిళా చిత్రకారులతో ‘అన్ ఎర్త్‌డ్’ చిత్రకళా ప్రదర్శనలను నిర్వహించింది శారద. ఎమ్‌ఓజీని రోజుకు 200 మంది సందర్శిస్తారు.
సంస్కృతి ప్రతిబింబాలు
మ్యూజియం ఆఫ్ గోవా కోసం శారద పాతికమంది గోవా ఆర్టిస్టులు చిత్రించిన గోవా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను సేకరించింది వీటిని ఎమ్‌ఓజీ నిర్వహించే ప్రతి ఎగ్జిబిషన్‌లోనూ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ‘హోమోలూడెన్స్: ద ఆర్ట్ ఆఫ్ ప్లే’ ప్రదర్శన జరుగుతోంది.
అందులో గోవా ఆర్టిస్టులతోపాటు అనేక రాష్ట్రాలు, నెదర్లాండ్ దేశం నుంచి కూడా ఆర్టిస్టులు మొత్తం వంద మంది చిత్రకారుల కళారూపాలున్నాయి. బీచ్ కంటే మ్యూజియం సందర్శనలోనే ఎక్కువ ఎంజాయ్ చేశాం అని ఫీడ్‌బ్యాక్ బుక్‌లో రాస్తున్నారు. ఏడాదికి పదివేల మంది స్టూడెంట్స్ సందర్శిస్తున్నారు. వాళ్లు సమకాలీన కళలతోపాటు గోవా చరిత్రను తెలుసుకుంటున్నారు.
కళాకృతులకు మార్కెట్ వేదిక
గడచిన ఎనిమిదేళ్లుగా ప్రతి ఆదివారం ఎంఓజీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వివిధ రంగాలకు చెందిన నాలుగు వందల మంది నిపుణులు హాజరై ప్రసంగించారు. ఆర్ట్, ఆర్కిటెక్చర్, సైన్స్, మేనేజ్‌మెంట్, బిజినెస్, ఎన్విరాన్‌మెంట్, పాలసీ మేకింగ్, యాక్టివిజమ్ అంశాల్లో కళాకారులకు సమగ్రమైన అవగాహన కల్పించారు.
‘ఆమి గోవా’ నాన్‌ప్రాఫిట్ సోషల్ ఎంటర్‌ప్రైజ్ ద్వారా అల్పాదాయ వర్గాల మహిళలు తయారు చేసే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్పత్తులను విక్రయించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసింది శారద. ఇందులో మహిళల స్వావలంబన సాధికారత, గోవా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ అనే రెండు రకాల ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. శారద కేర్కర్ చొరవతో గోవా హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీ కొత్త రూపు సంతరించుకుంటోంది.
(చదవండి: కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..)
Comments
Please login to add a commentAdd a comment