యాక్రలిక్, ఆబ్‌స్ట్రాక్ట్, పాప్ ఆర్ట్, పెయింటర్లీ, వాటర్ కలర్, ఆయిల్ పెయింట్, పేస్టల్స్ కాదేదీ పెయింటింగ్‌కు అనర్హం అన్నట్లు... విచిత్రంగా రక్తంతో బొమ్మలు గీసి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.. నగరానికి చెందిన అనిల్ కుమార్. కొందరు కాన్వాస్‌పై యాక్రిలిక్‌తో అద్భుతమైన చిత్రాలు సృష్టిస్తే మరికొందరు మట్టిముద్దలతో శిల్పాలను రూపొందిస్తున్నారు.. ఇటీవల ఈ క్రియేటివిటీ మరింత పెరగడంతో ఒక్కొక్కరూ ఒక్కో వైవిధ్యమైన రీతిలో కళాకారులు మ్యాజిక్ చేస్తున్నారు. నగరానికి చెందిన యువ చిత్రకారుడు అనిల్ కుమార్ దీని కోసం బ్లడ్‌ను ఉపయోగిస్తూ... ‘రక్త’ సంబంధాలను సరికొత్తగా పునర్నిర్వచిస్తున్నాడు.
అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి.
బ్లడ్ ఆర్ట్ అనే పదం వినడానికి ప్రత్యేకంగా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే ‘బ్లడ్ పెయింటింగ్ భావోద్వేగాలను పంచుకునేందుకు సాటిలేని మార్గం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ప్రేమికులు...తమ మధ్య ఉన్న బలమైన సంబంధాలను తెలియజెప్పేందుకు ఓ శక్తివంతమైన సాధనమని’ అనిల్ అంటున్నాడు.
దైవకృపతో అబ్బిన కళ...
దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అనిల్ కుమార్‌కు ఎటువంటి చదువు, సాధన లేకుండా చిత్రకళ అబ్బింది...అతని కళాత్మక ప్రయాణం 2019లో బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా ప్రారంభమైంది. ‘చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడం హాబీ..అలా అలా పోట్రెయిట్స్ గీయడం అలవాటైంది. బీటెక్ పూర్తి చేసినా ఏదో ఒక ఉద్యోగంలో ఇమడలేక పోట్రెయిట్ (పెన్సిల్ స్కెచింగ్) కళలో ప్రావీణ్యం సంపాదించాను. అప్పుడు నేను పెన్సిల్స్ (మైక్రో ఆర్ట్) మీద పేర్లు చెక్కడం ప్రారంభించాను’ అని అనిల్ చెప్పాడు. అయితే ఫేస్ డ్రాయింగ్‌లు మైక్రో ఆర్ట్ ద్వారా ప్రొఫెషనల్ అనిపించుకున్నప్పటికీ సరైన ఆర్డర్స్ లేక ఏదో ఒక ఉద్యోగం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అమ్మాయి ‘కళ్ల’తో పుట్టిన కళ...
బెంగుళూర్‌కు చెందిన మైక్రో ఆర్ట్ కస్టమర్ తన సోదరి కళ్లను తన రక్తంతో గీయమని అడిగారు. ‘తొలుత నేను ఒప్పుకోలేదు. బాగా రిక్వెస్ట్ చేయడంతో చేసిన ఆ వర్క్‌ని నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే బాగా రీచ్ వచ్చింది. అయినా అప్పుడు కూడా బ్లడ్ ఆర్ట్‌ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత మా అమ్మానాన్నల మ్యారేజ్ డే రోజున నా రక్తాన్ని ఉపయోగించి వారిద్దరి చిత్రాలనూ గీశాను. అది వారి మనసుకు హత్తుకోవడం మాత్రమే కాదు నా భవిష్యత్తును మార్చేసింది’ అని అనిల్ గుర్తు చేసుకున్నాడు.
దేశవిదేశాల నుంచి...
అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. వేలాది మంది తమ ప్రియమైన వారి బ్లడ్ పెయింటింగ్స్ కోసం నాకు మెసేజ్ చేయడం ప్రారంభించారు. ‘దాంతో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనీసం కొన్ని వారాల పాటు సమయం తీసుకోవాల్సి వస్తోంది’ అని అనిల్ చెప్పాడు.
జాగ్రత్తలు తప్పనిసరి..
‘ఈ మాధ్యమాన్ని ఉపయోగించి చిత్రాలు గీసేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే ప్రభావితమయ్యే మొదటి వ్యక్తి చిత్రకారుడే.. కాబట్టి.. గ్లవ్స్, మాస్క్ ధరించడం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి’ అని అనిల్ కుమార్ స్పష్టం చేశాడు. రక్తాన్ని సేకరించడం నుంచి గోడపై కళాకృతిని అలంకరించడం వరకూ... ప్రతీది కఠినమైన పరిశుభ్రతతో జరుగుతుందని చెప్పాడు.
తమకు కావాల్సిన పోట్రెయిట్‌ను గీయించుకోవాలనుకున్న కస్టమర్స్... అనుభవజ్ఞులైన ల్యాబ్ టెక్నీషియ సాయంతో చిన్న ట్యూబ్ ద్వారా సేకరించిన బ్లడ్ (సుమారు 3 నుంచి 4గ్రా) అనిల్‌కు అందిస్తారు. దానిని కనీసం వారం రోజుల వరకూ భద్రంగా నిల్వచేసే అవకాశం ఉంటుంది. రోజుకు ఒక పోర్ర్‌టెయిట్‌ను మాత్రమే పూర్తి చేస్తున్నానని అనిల్ చెబుతున్నాడు. కస్టమర్ తీసుకెళ్లేవరకూ దుర్వాసన లేదా తేమను గ్రహించకుండా ఆర్ట్‌వర్క్‌ను సంరక్షించడానికి ఫిక్సేటివ్ స్ప్రేని ఉపయోగిస్తామన్నాడు.
ప్రస్తుత సాంకేతిక యుగంలో చేతితో వేసిన సిసలైన చిత్రకళ అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఏఐ కూడా రీ క్రియేట్ చేయలేని బ్లడ్ ఆర్ట్ భవిష్యత్తులో మరింత ఆదరణ పొందే అవకాశం ఉంది’ అంటున్నాడు అనిల్.
Comments
Please login to add a commentAdd a comment