సృజనాత్మకతకు రూపం ‘ఇకబెనా’
నగరంలో ప్రదర్శనకు స్పందన
సాక్షి, సిటీబ్యూరో: అద్భుతమైన ప్రకృతిని చిన్న ప్రదేశంలో చూపించే ఇకబెనా ఆర్ట్‌కు జపాన్‌లో మంచి ఆదరణ ఉంది. దీనికి నగరంలోనూ ఆదరణ పెరుగుతోంది. ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకబెనా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 35 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పార్క్ హోటల్‌లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విభిన్నమైన పూలు, ఆకులు ఇతర వస్తువులతో ఇకబెనా శైలిని ప్రదర్శించారు.
ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ హోజుకి ఒయామాడ చేసిన పూల అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత దేశంలోనూ ఇకబెనా కోర్సు ఆదరణ పొందుతోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జపాన్ గౌరవనీయమైన కాన్సుల్ జనరల్ తకాహషి మునియో దంపతులు, హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్ రేఖారెడ్డి, ప్రెసిడెంట్ నిర్మలా అగర్వాల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఇందుమతి దావ్లూర్, శారద, జ్యోత్స్న, నందరావు, శశి కోలా, రేఖా బయాంకర్, మీనాక్షి సుజనని, కనకదుర్గ, నిరూప తదితరులు భాగమయ్యారు.
మేకింగ్ స్కిల్స్ బాగుంటాయి..
హైదరాబాద్‌లో ఇకబెనా ఎగ్జిబిషన్ ఎక్కడున్నా హాజరువుతా.. క్రియేటివిటీ, ఫ్లవర్ డెకరేషన్ వాటి నిర్వహన చాలా బాగుంటుంది. ఈ కోర్సు నేర్చుకోవాలంటే అధునాతన జీవన శైలిపై అవగాహన ఉండాలి. సొంతగా ఇల్లు, కంపెనీని అందంగా అలంకరించుకుంటాను. గార్డెన్‌ను సైతం మొక్కలు, రంగురంగుల పూలతో అందంగా తయారు చేసుకుంటాను. – జీవీఎస్ రామారావు, పారిశ్రామికవేత్త, మల్లాపూర్.
అరుదైన కళ..
పెయింటింగ్, సింగింగ్, నృత్యం వంటి కళల్లాగే ఇకబెనా కూడా అరుదైన కళ. ఈ స్కూల్‌కు జపాన్‌లో మంచి గుర్తింపు ఉంది. మనం జపాన్ వెళ్లలేం.. కానీ ఆయా నిపుణులను నగరంలో కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతి. పదేళ్ల నుంచి ఇందులో భాగమయ్యాను. ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం పొందాలంటే దీని లోతైన విశిష్టత అవగతమవ్వాలి. – చిలుకూరి అన్నపూర్ణ, హైదరాబాద్.
ఏకాగ్రతతోనే సాధ్యం..
ఇకబెనా వినూత్నమైన కోర్సు. ఒహారా స్కూల్ ఆఫ్ ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్ చేసే వ్యక్తికి కలర్ కాంబినేషన్‌పై మంచి పట్టుండాలి. సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను ప్రదర్శించగలగాలి. మేమంతా ఎంతో ఇష్టంతో చేస్తున్నాం. దీన్ని ప్రొఫెషన్‌గా తీసుకుని స్కూల్ నడిపిస్తున్న వారు ఇందులో ఉన్నారు. – నీరజ గోదావర్తి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment