శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వేంకటేశ్వరుడు వాహనాల మీద ఊరేగుతాడు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు తొమ్మిది రూపాలలో దర్శనమిస్తుంది. ఈ రెండు విశేషాలు ఒకసారే జరుగుతాయి. ఒకటి తిరుమల కొండ మీద.. మరొకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన. ఈ రెండు అద్భుతాలను తన కలంతో చిత్రీకరించాడు రాజమండ్రికి చెందిన మాధవ్ చిత్ర. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎం.టెక్ పూర్తి చేసి, చెన్నైలో ఉద్యోగం చేస్తున్న మాధవ్ దసరా సందర్భంగా సాక్షితో తన మనసులోని భావాలను పంచుకున్నాడు.
నా చిన్నతనం నుంచే అంటే ఏడవ ఏట నుంచే బొమ్మలు వేయటం ప్రారంభించాను. అమ్మ ఆ బొమ్మలు చూసి, వాటిమీద తారీకులు వేసి దాచుకోమని చెప్పేది. ప్రతిరోజూ స్కూల్ నుంచి ఇంటికి రాగానే బొమ్మలు వేసుకునేవాణ్ణి. మొదట్లో వాటర్ కలర్స్‌తో తరవాత పోస్టర్ కలర్స్‌తో వేయటం ప్రారంభించాను. రాజమండ్రిలో చిన్నజీయర్ స్వామి రామానుజ కూటం వారు రామాయణంలోని బాలకాండ మీద పోటీలు పెట్టారు. అందులోని ఏదో ఒక సంఘటనను బొమ్మగా వేయాలి. నేను అహల్య శాపవిమోచనం బొమ్మ వేశాను. దానికి నాకు మొదటి బహుమతి వచ్చింది. బహుమతితో పాటు నాలో ఉత్సాహం కూడా మొదలైంది అప్పటి నుంచి బొమ్మలు వేస్తూనే ఉన్నాను.
జెల్ పెన్‌తో
ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో చార్‌కోల్‌తో బొమ్మలు వేయటం ప్రారంభించాను. వాటికి మంచి స్పందన వచ్చింది. ఖరగ్‌పూర్ లో రంగోలీ చాలా ప్రముఖంగా వేసేవారు. నేలమీద మనం అనుకున్న థీమ్‌తో రంగులతో ముగ్గులు వేయాలి. నేను మేఘ సందేశం కావ్యంలోని గంధర్వుడి సన్నివేశం వేశాను. ఆ తరవాత భారతీయ పౌరాణిక సన్నివేశాలు చాలా వేశాను.
వాల్మీకి రచించిన రామాయణ మహేతిహాసాన్ని మొత్తం 30 బొమ్మలుగా వేశాను. అన్నీ ఏ 4 సైజులో నల్లరంగు జెల్ పెన్‌తో వేశాను. శివకల్యాణాన్ని దక్షప్రజాపతి దగ్గర నుంచి శివుని కల్యాణం వరకు 15 బొమ్మలుగా నలుపు జెల్ పెన్‌తో వేశాను. మా ఇంట్లో సంప్రదాయ వాతావరణం నా మీద ప్రభావం చూపిందేమో అనిపిస్తుంది. అలాగే టీవీలో ప్రవచనాలు విని వాటికి ప్రభావితమయ్యాను. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై 30 పాశురాలు ఎరుపు రంగు పెన్నుతో వేశాను.
నవరాత్రుల నేపథ్యంలో...
దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని 2013లో నవదుర్గలు వేశాను. 2019లో నవదుర్గలు రెండోసారి ఎరుపు బ్యాక్‌గ్రౌండ్‌తో వేశాను. ఇదంతా నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. అట్లతద్ది, మంగళ గౌరి వంటి చిన్న చిన్న పండుగల నుంచి అన్ని పండుగలకు బొమ్మలు వేయాలనుకుంటున్నాను. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి వాహనాలను పెన్సిల్ స్కెచ్‌లుగా వేసి, తిరుమల మ్యూజియమ్ వారికి సమర్పించాను. ఈ సంవత్సరం కూడా చిన్న చిన్న బొమ్మలు మట్టితో చేస్తున్నాను. జాడీల ప్యాక్టరీ నుంచి మట్టి తెచ్చి ఈ బొమ్మలు చేస్తున్నాను. కృష్ణాష్టమికి పాడ్యమి నుంచి అష్టమి దాకా ఎనిమిది రకాల కృష్ణుడి బొమ్మలు వేశాను. చెన్నై నగరాన్ని నా బొమ్మలలో బంధించటానికి ప్రయత్నించాను. కపాలేశ్వర ఆలయం, పార్థసారథి దేవాలయం, లజ్ చర్చ్... ఇలా చెన్నైకి సంబంధించిన వాటిని గీశాను.
సన్నిహితులు ఒకరు వటపత్రశాయి బొమ్మ వేసి, ఇవ్వమని అడిగారు. బొమ్మ పూర్తయ్యాక ఇవ్వాలనిపించలేదు. నా గదిలో పెట్టుకున్నాను.
– సంభాషణ: డా. వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment