అబ్దుల్ మన్నాన్, సైన్స్ చిత్రకారుడు
బొమ్మల భాషఅక్షరం పుట్టక ముందే చిత్రం రూపుదిద్దుకుంది. ప్రపంచంలో సైగల తర్వాత భాష బొమ్మలదే. పది వాక్యాల విషయాన్ని ఒక బొమ్మ చెప్తుంది. ఆ బొమ్మలతోనే శాస్త్రాన్ని బోధిస్తే ఎలా ఉంటుంది? విజ్ఞాన శాస్త్రం వినోద శాస్త్రమవుతుంది. ఆనందంగా మెదడుకు చేరుతుంది. మరిచిపోలేని జ్ఞానంగా మిగులుతుంది.
అధ్యయనానికి అక్షర రూపమిస్తే మహాగ్రంథమవుతుంది. అధ్యయనానికి చిత్రరూపమిస్తే అద్భుతమైన చిత్రకావ్యం అవుతుంది. అలాంటి వందల చిత్రకావ్యాలకు రూపమిచ్చారు అబ్దుల్ మన్నాన్. డెబ్బై ఏళ్ల మన్నాన్ ఐదు వేలకు పైగా బొమ్మలు వేశారు. ‘‘నా వయసులో నుంచి మూడేళ్లు తగ్గిస్తే నాలోని చిత్రకారుడి వయసది. నా బొమ్మల్లో ఒక్కొక్క థీమ్‌తో కొన్ని వందల చిత్రాలున్నాయి. ఆ చిత్రాల్లో ఒక్కటి చేజారినా చిత్రకావ్యంలో అనుసంధానత లోపిస్తుంది. అందుకే నా బొమ్మలను ఎవరికీ ఇవ్వలేదు, డబ్బు కోసం అమ్మనూ లేదు’’ అన్నారు అబ్దుల్ మన్నాన్.
బొమ్మల చదువు!
మా సొంతూరు ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం, బంటుమిల్లి దగ్గర చిన పాండ్రాక. ఐదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత నా చదువు గుడివాడలో సాగింది. ఏఎన్నార్ కాలేజ్‌లో బీఎస్సీ చదివాను. బొమ్మల మీదున్న ఆసక్తి కొద్దీ చెన్నైకి వెళ్లి ‘శంతనుస్ చిత్ర విద్యాలయం’లో ఆర్ట్ డిప్లమో చేశాను. చెన్నైలోనే బాలమిత్ర, బాలభారతి, బుజ్జాయి వంటి పిల్లల పత్రికల్లో ఇలస్ట్రేటర్‌గా ఐదారేళ్లపాటు ఉద్యోగం చేశాను.
అక్కడి నుంచి నా అడుగులు సినీఫీల్డ్ వైపు పడ్డాయి. అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా సుమారు ఐదేళ్లు చేశాను. చెన్నైలో కవి సమ్మేళనాలు ఎక్కువగా జరిగేవి. మహాలక్ష్మి క్లబ్‌లో తెలుగు వాళ్ల కార్యక్రమాలు జరిగేవి. దాదాపుగా అన్నింటికీ హాజరయ్యేవాడిని. అలా శ్రీశ్రీ,, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర వంటి కవులతోపాటు సినీ పరిశ్రమలో ఎన్‌టీఆర్, ఏఎన్నార్, ఆర్ నారాయణమూర్తి వంటి చాలామందితో పరిచయాలయ్యాయి. దక్షిణాది భాషలు వచ్చాయి. ఇలా కొంత వైవిధ్యంగానే మొదలైంది నా కెరీర్.
వైవిధ్యత ఆకట్టుకుంది!
సైన్స్ చిత్రాల చిత్రకారుడిగా మారడానికి బీజం పడింది మాత్రం ఇంటర్‌లోనే. డార్విన్ సిద్ధాంతం ‘ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్’ చదవడం నా మెదడులో కొత్త ప్రపంచానికి ఆవిష్కారం జరిగింది. అలాగే మరో పుస్తకం ‘ఫేమస్ ఫైవ్ హండ్రెడ్ ఆర్టిస్ట్స్ ఇన్ ద వరల్డ్’. ప్రపంచంలోని చిత్రకారులను చదివినప్పుడు పికాసో నుంచి డావిన్సీ వరకు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులెవ్వరూ సైన్స్ ఇతివృత్తంగా బొమ్మలు వేయలేదని అవగతమైంది. దాంతో ఆ ఖాళీని పూరించాలనుకున్నాను.
అలా నా చిత్రాలకు సైన్స్, నేచర్ ప్రధానమైన టాపిక్స్ అయ్యాయి. జీవ వైవిధ్యత నన్ను కట్టి పడేసే అంశం. దాంతో ప్రతి జీవి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. డార్విన్ సిద్ధాంతం చదివినప్పుడు కలిగిన సందేహాలకు సమాధానాల కోసం లెక్కలేనన్ని పుస్తకాలు చదివాను. ఉదాహరణకు క్యాట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏ ఖండంలో ఎలాంటి జాతి క్యాట్‌లుంటాయో అనర్గళంగా చెప్పగలను. శిలాజాలను అధ్యయనం చేసి ఆ ప్రాణి ఊహాచిత్రాన్ని వేయడం, ఎండమిక్ స్పీసీస్ బొమ్మలేయడంలో అనంతమైన సంతృప్తి కలగడం మొదలైంది. ఇక ఆ అలవాటును కొనసాగించాను.
సైన్స్ పాఠాల బోధన!
నా వృత్తి ప్రవృత్తి రెండూ సైన్స్‌లోనే వెతుక్కున్నాను. ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేవాడిని. నా భార్య గవర్నమెంట్ టీచర్. నేను జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ట్యూటోరియల్స్ నిర్వహించాను. స్కూళ్లలో డ్రాయింగ్ టీచర్‌గా పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పించాను. నేను అందుకున్న అవార్డులకంటే నా విద్యార్థులు అందుకున్న అవార్డులే ఎక్కువ.
నేను పీటీరెడ్డి అవార్డు, మూడు జాతీయ స్థాయి అవార్డులందుకున్నాను. నా బొమ్మలు ఆహ్లాదం కోసం చూసేవి కాదు. అవి అధ్యయన మాధ్యమాలు. శాతవాహన, కాకతీయ యూనివర్సిటీలు, వైజాగ్‌లో కాలేజీలు, కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్, చాలాచోట్ల స్కూళ్లలోనూ ప్రదర్శనలు నిర్వహించాను’’ అని తన చిత్రప్రస్థానాన్ని వివరించారు అబ్దుల్ మన్నాన్.
‘చిత్ర’ ప్రమాదాలు
చిత్రకారుడు తన దేహానికి గాయమైనా పట్టించుకోడు. కానీ తన బొమ్మలకు ప్రమాదం వాటిల్లితే ప్రాణం పోయినట్లు విలవిలలాడుతాడు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా చిత్రకార జీవితంలో మూడు ప్రమాదాలను ఎదుర్కొన్నాను. గుడివాడలో ఇల్లు అగ్నిప్రమాదానికి గురయ్యి చిన్నప్పటి నుంచి వేసిన బొమ్మలన్నీ కాలిపోయాయి. మరోసారి చెన్నైలో ఇంట్లో దొంగలు పడి నా పెయింటింగ్స్ పెట్టెను కూడా దోచుకుపోయారు.
ఇక మూడవది హైదరాబాద్‌లో. ఈ ఏడాది వరదల్లో టోలిచౌకిలోని మా ఇంట్లో మూడు రోజులు నీళ్లు నిలిచిపోయాయి. అప్పుడు తడిసిపోయినవి పోగా మళ్లీ వేసిన బొమ్మలు ఐదు వందలు ఎగ్జిబిషన్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్క ప్రమాదం తర్వాత నాలోని చిత్రకారుడు మళ్లీ మళ్లీ పుట్టాడు.
– అబ్దుల్ మన్నాన్, సైన్స్ చిత్రకారుడు
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల
Comments
Please login to add a commentAdd a comment