కేజీఎఫ్ సినిమా హీరో యష్ (ఒరిజినల్) -అర్షద్ గీసిన యష్ చిత్రం
రాప్తాడు: చేయి పట్టుకుని నడక నేర్పించే తండ్రి దూరం కావడం.. ఆ చిన్నారి ఒంటరితనానికి కారణమైంది. కుటుంబ పోషణ కోసం అమ్మ పడుతున్న కష్టం కలచి వేసింది. పలుగు... పార చేతబట్టి ఉపాధి పనులకు పోయిన తల్లి చేతుల నిండా బొబ్బలు.. అన్నం ముద్ద తినిపిస్తున్న ఆమె చేతిలోని గాయాలు ఆ చిన్నారి హృదయాన్ని మరింత గాయపరిచాయి.
ఏదో తెలియని ఒత్తిడి. ఆ భారం నుంచి బయటపడేందుకు తనకొచ్చిన గీతలతో కాలక్షేపం. ఆ గీతలే చివరకు అతని ఒత్తిడిని దూరం చేశాయి. అభద్రతాభావం నుంచి బయటపడేస్తూ అద్భుత చిత్రకారుడిని ఈ లోకానికి పరిచయం చేశాయి. అతనే షేక్ మహమ్మద్ అర్షద్ (ఎస్.ఎం.అర్షద్).
చనిపోవాలనుకుని..
రాప్తాడుకు చెందిన బికెన్‌బాషా, కౌసర్‌బాను దంపతులకు ఇద్దరు కుమారులు. పదేళ్ల క్రితం భార్యాపిల్లలకు బికన్‌బాషా దూరమయ్యాడు. దిక్కుతోచని స్థితిలో కౌసర్‌బాను కొట్టుమిట్టాడింది. చిల్లిగవ్వ కూడా చేతిలో లేక సతమతమవుతున్న కౌసర్‌బాను తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో పుట్టింటి వారు ఆమెకు ధైర్యం చెప్పారు.
మదర్‌థెరిస్సా చిత్రాన్ని గీస్తున్న అర్షద్- అర్షద్ గీసిన త్రీడీ చిత్రం..
ఎలాగైనా ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేయాలని అనుకున్న ఆమె ఉపాధి పనులతో పాటు కూలి పనులకు వెళ్లడం మొదలు పెట్టింది. ఏనాడూ ఎండ ముఖం ఎరుగని ఆమె.. ఒక్కసారిగా తట్టాబుట్ట పట్టుకుని పొలాల బాట పట్టింది. ఈ క్రమంలోనే తమ కోసం తల్లి పడుతున్న తపన ఆ ఇద్దరు చిన్నారులనూ కదిలించింది. తల్లి రెక్కల కష్టం వృథా కాకూడదనుకున్న వారు ఇష్టంతో చదువుకుంటూ రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్‌లో సీటు దక్కించుకున్నారు. ప్రస్తుతం కౌసర్‌బాను పెద్ద కుమారుడు ఎస్.ఎం.అర్షద్ స్థానిక ఏపీ మోడల్ స్కూల్‌లో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు.
గీతలతోనే కాలక్షేపం
రాప్తాడులోనే అద్దె ఇంటిలో నివసిస్తున్న కౌసర్‌బాను.. అప్పు చేసి కుట్టుమిషన్ సమకూర్చుకుంది. ఉదయం ఉపాధి పనులకు పోవడం, ఇంటికి వచ్చిన వెంటనే కుట్టు మిషన్ మీద ఇతరుల దుస్తులు కుట్టి ఇవ్వడం ద్వారా వచ్చే సంపాదనతో పొదుపుగా జీవనం సాగించడం మొదలు పెట్టింది. ఇలాంటి సమయంలోనే తాను ఇంటి వద్ద లేని సమయంలో అర్షద్ కాగితాలపై గీతలు గీస్తుండడం ఆమె గ్రహించింది. నోటు పుస్తకాల నిండా గీతలు గమనించిన ఆమె ఒక్కసారిగా అసహనానికి గురైంది. అసలే అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే.. చదువులకు ఇక నోటు బుక్కులు ఎలా కొనుగోలు చేయాలంటూ కుమారుడిని మందలిస్తూ వచ్చింది. ఇలాగే గీతలు గీస్తూ కూర్చొంటే తనలా కూలి పనులకు వెళ్లాల్సి ఉంటుందని కుమారుడిని హెచ్చరించింది. బుద్ధిగా బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో బాగా ఎదగాలని హితబోధ చేసేది.
త్రీడీ చిత్రాలు గీయడంలో దిట్ట
ఇంటి వద్ద ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు పిచ్చి గీతలు గీయడం మొదలు పెట్టిన అర్షద్... ఆ తర్వాత ఆ గీతల ద్వారా అద్భుతాలను ఆవిష్కరించడం మొదలు పెట్టాడు. తల్లి ఇస్తున్న డబ్బును దాచుకుని వాటితో తనకు కావాల్సిన పెన్నులు, స్కెచ్‌లు, పెయింట్స్, డ్రాయింగ్ పేపర్లు కొనుగోలు చేయడం మొదలు పెట్టాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో బొమ్మలు గీయడం మొదలు పెట్టాడు. అతనిలోని కళాకారుడిని అతని క్లాస్‌మేట్స్ గుర్తించి ప్రోత్సహిస్తూ వచ్చారు.
ఈ క్రమంలోనే తాను చదువుకుంటున్న స్కూల్‌లోని ఉపాధ్యాయుల చిత్రాలను గీసి, అందరి మన్ననలూ పొందాడు. ఆ సమయంలోనే త్రీడీ చిత్రాలు గీయడం నేర్చుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. అప్పటి వరకూ త్రీడీ చిత్రాలు అంటే ఏమిటో తెలియని అర్షద్.. ఇంటికెళ్లిన తర్వాత సెల్‌ఫోన్‌లో యూట్యూబ్ ద్వారా త్రీడీ చిత్రాలు గీయడం చూసి సాధన మొదలు పెట్టాడు. చూస్తుండగానే అందరినీ అబ్బురపరిచే స్థాయికి ఎదిగాడు. అర్షద్‌లోని ప్రతిభను తల్లి కౌసర్ గుర్తించింది. కుమారుడి అభీష్టం మేరకు అతనికి ఇష్టమైనవి కొనుగోలు చేసి ఇస్తూ మరింత ప్రోత్సహిస్తూ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment