లక్షలు పెట్టి పెయింటింగ్స్ కొంటారు. ఇంట్లో నచ్చిన చోట వాటిని అలంకరించి మురిసిపోతారు. ఇంటికి వచ్చిన అతిథుల ప్రశంసలు పొందుతారు. అలాంటి కళాఖండాలు ఏ కాస్త దెబ్బతిన్నా కళను ఆరాధించే ప్రాణాలు విలవిల్లాడిపోతాయి. ఇలాంటప్పుడు ఆ పెయింటింగ్స్‌కు పూర్వపు కళను తీసుకువచ్చేవారున్నారని తెలిస్తే ప్రాణం లేచి వచ్చినట్టే అనిపిస్తుంది. అలాంటి అరుదైన కళను ఔపోసన పట్టారు హైదరాబాద్ వాసి అర్చన. అద్భుతమైన ప్రాచీన పెయింటింగ్స్, కళాఖండాలను ఐదేళ్లుగా కాపాడుతున్నారు అర్చన దూబె. హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్ట్ వారితో కలిసి హెరిటేజ్ డ్రైవ్స్‌లోనూ పాల్గొంటున్న అర్చన ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియాల్లోని అరుదైన పెయింటింగ్స్‌కు కూడా రక్షించే పనిలో ఉన్నారు. అపురూపమైన చిత్రరాజాలను కాపాడుకోవాలనే ఆకాంక్షలో అరుదైన కళను కెరియర్‌గా ఎంచుకున్న అర్చన
నైపుణ్యాలు ఆమె మాటల్లోనే...
‘‘ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్‌గా కన్సర్వేషన్‌లో కెరీర్ 2015లో ప్రారంభించాను. చారిత్రక, పురాతన, సాంస్కృతిక సంపద మీద ఆసక్తి ఎక్కువ. ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షించాలనే ఆలోచన కూడా అందుకే వచ్చిందేమో.. ఆ ఆసక్తితో నేషనల్ రిసెర్చ్ లేబరేటరీ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ (ఎన్‌ఆర్‌ఎల్‌సి)లో ప్రవేశం పొందాను. అక్కడ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశాక మైసూర్‌లోని ఎన్‌ఆర్‌ఎల్‌సి ప్రాజెక్టుకు పంపించారు. ఆ సందర్భంగా సీనియర్ కన్సర్వేటర్స్‌తో కలిసి పనిచేశాను. అప్పుడే మ్యూరల్ పెయింటింగ్స్‌కి సంబంధించిన కన్సర్వేషన్ టెక్నిక్స్ నేర్చుకున్నాను.
ఆర్ట్ గ్యాలరీలు..
కళ తగ్గినవి, రంగు వెలిసిన పెయింటింగ్స్‌ని వాటి పూర్వపు వైభవం ఏ మాత్రం తగ్గకుండా చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో నేర్పు, ఓర్పు ఉండాలి. అలాగే, ఆ కళ పట్ల ఆపేక్ష ఉండాలి. మైసూర్‌లోని చామ్‌రాజ్య ఆర్ట్ గ్యాలరీలో కొంత కాలం పనిచేసిన అనుభవం కూడా కళను కాపాడేందుకు సహకరంచింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఢిల్లీ ఆర్క్వైస్‌లో ఒక కన్సర్వేషన్ ప్రాజెక్టులో భాగం పంచుకున్నాను. ఫొటోలామ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండేళ్ల పాటు విభిన్న ప్రాంతాల్లో పని చేశాను. అలాగే కల్చరల్ ప్రాపర్టీ కన్సర్వేషన్‌పై జరిగిన పలు రకాల వర్క్‌షాప్స్, సెమినార్స్‌కు అటెండయ్యాను. అదే క్రమంలో త్రివేండ్రంలోని శ్రీ చిత్ర ఆర్ట్ గ్యాలరీ, జూలో ఉన్న రాజా రవివర్మ పెయింటింగ్స్ స్థితిగతులపై ఒక డాక్యుమెంట్ తయారు చేశాను.
కలెక్షన్స్.. ప్రాజెక్ట్స్..
ప్రస్తుతం సాంస్కృతిక కళా సంపదను కలిగి ఉన్న వ్యక్తులు, ప్రైవేట్ కలెక్షన్స్ ప్రాజెక్ట్స్ తీసుకుని వాటికి పూర్వపు వైభవాన్ని తీసుకువస్తున్నాను. పెయింటింగ్స్, పేపర్ మెటీరియల్స్, శిల్పకళాకృతులను కాపాడే పనులు చేపడుతున్నాను. అలాగే హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే హెరిటేజ్ డ్రైవ్స్‌లో పాల్గొంటున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళా సంపద తాలూకు స్థితిగతులను అక్షరబద్ధం చేస్తున్నాను’’ అని వివరించారు అర్చన. ఎంచుకున్న కళా రంగాన్ని వినూత్నరీతిలో కెరియర్‌గా మలుచుకుంటున్నవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ మార్పు రేపటితరానికి దారి చూపడమే కాదు గత కాలపు కళావైభవానికీ వారధిగానూ నిలుస్తోంది. – నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment