అవసరం ఒక ఆవిష్కరణకు దారి వేసింది. ఆర్థిక అవసరాలే తనను హ్యాండీక్రాఫ్ట్ కళాకారిణిగా తీర్చిదిద్దాయని చెప్పారు బాల త్రిపుర సుందరి. తాటి ఆకులతో గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తారామె. వీటి తయారీలో మహిళలకు శిక్షణనిస్తారు కూడా. తాటి ఆకు కళారూపాల తయారీలో యాభై ఏళ్ల అనుభవం ఆమెది.
ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేసింది!
త్రిపుర సుందరికి 75 ఏళ్ల వయసు. ఆమెది తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుగ్రామం. చదువుకు నోచుకోని త్రిపుర సుందరి 1972లో ముంబయికి వెళ్లి హస్తకళాకృతుల తయారీలో సర్టిఫికేట్ కోర్సు చేశారు. అక్కడ నేర్పించిన కళారూపాల తోపాటు తన క్రియేటివిటీతో మరికొన్ని రూపాలను తయారు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హస్తకళాకృతుల ఎగ్జిబిషన్‌లలో స్టాల్ పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో పామ్ క్రాఫ్ట్ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు.
పనిలోనే ఆనందం
‘‘మా ఊరిలో తెలిసిన వాళ్ల ద్వారా ముంబయిలో శిక్షణ కోర్సు గురించి తెలిసింది.. మూడు నెలల కోర్సు, బస భోజన వసతులు వాళ్లే ఏర్పాటు చేస్తారని చెప్పారు. చదువు లేదు, భాష ఇబ్బందవుతుందేమోనని భయంతోనే వెళ్లాను. కానీ అక్కడ తెలుగు వాళ్లు కూడా ఉండడంతో ఇబ్బంది కలగలేదు. క్రమంగా హిందీలో చెప్తున్న విషయాలు అర్థం కాసాగాయి. కోర్సు పూర్తయిన తర్వాత మా ఊరికి వచ్చి, నిడదవోలులో ఉన్న తాటిబెల్లం ఫెడరేషన్ లో ట్రైనర్‌గా ఉద్యోగంలో చేరాను.
బదలీ మీద 1983లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కి వచ్చాను. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌తో కూడా పని చేశాను. ఆ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు కూకట్‌పల్లి, హౌసింగ్ బోర్డులో మా ఇంటి దగ్గర నాకు నచ్చిన కళారూపాలు అల్లుకుంటూ, ఎగ్జిబిషన్‌లలో స్టాల్ పెడుతున్నాను. వీటితోపాటు తుక్కుగూడలోని నీరా యూనిట్‌లో శిక్షణనిస్తున్నాను.
బంధువులు, స్నేహితులు ఇంకా పని చేయడం ఎందుకని అడుగుతుంటారు. పిల్లల బాధ్యతలు పూర్తయ్యాయి, నేను పని చేయకపోతే అడిగేవాళ్లు కూడా లేరు. కానీ నాకు పని చేయకుండా కూర్చుని తినడం ఇష్టం ఉండదు. ఆరోగ్యం బాగున్నప్పుడు పని మానేయడం ఎందుకు?’’ అంటూ స్టాల్‌లో ఆమె బొమ్మల ధరలు అడుగుతున్న వారికి బదులివ్వడంలో మునిగిపోయారామె.
-విఎమ్‌ఆర్
ఫోటోలు: ఎస్‌ఎస్ ఠాకూర్
(చదవండి: నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?)
Comments
Please login to add a commentAdd a comment